బీజేపీ ఆధిక్యంపై కోమటిరెడ్డి సంచలన కామెంట్స్.. తప్పని పరిస్థితుల్లో అలా చేశాం..!

by Anukaran |   ( Updated:2021-11-02 04:56:30.0  )
komatireddy
X

దిశ, తెలంగాణ బ్యూరో : హుజురాబాద్ ఉపఎన్నికలో ఓట్లు చీలుతాయనే కారణంగా ఈటల రాజేందర్‌కు కాంగ్రెస్​పార్టీ మద్దతు ఇవ్వక తప్పలేదని ఎంపీ కోమటిరెడ్డి వెంకట్​రెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. హుజూరాబాద్ ఉపఎన్నికలు, ఫలితాలపై ఆయన మాట్లాడారు. బీజేపీ అభ్యర్థి ఈటల రాజేందర్ 30 వేల ఓట్ల మెజార్టీతో గెలుస్తారని, టీఆర్ఎస్ పార్టీకి ఈటల రాజేందర్ పెద్ద షాక్ ఇస్తున్నారన్నారు. తెలంగాణలో సంచలన ఫలితాన్ని మనం చూస్తున్నామన్నారు. ఎన్నికలో గెలవడానికి టీఆర్ఎస్ పార్టీ సర్వశక్తులను ఒడ్డిందని కోమటిరెడ్డి చెప్పారు. ఐదు నెలల్లోనే టీఆర్ఎస్ రూ. 5 వేల కోట్లు ఖర్చు చేసిందని, మద్యం ఏరులై పారిందన్నారు. చాలా ప్రయత్నాలు, ప్రలోభాలు, భయాలకు గురి చేసినా టీఆర్ఎస్‌కు అదిరిపోయే తీర్పును హుజూరాబాద్ ప్రజలు ఇచ్చారన్నారు.

‘శత్రువుకు శత్రువు మిత్రుడు’ అనే సిద్ధాంతం ప్రకారం ఈటల రాజేందర్‌కు కాంగ్రెస్ పార్టీ మద్దతు ఇవ్వక తప్పలేదన్నారు. కాంగ్రెస్ గట్టిగా పోరాడితే ఓట్లు చీలిపోయి, చివరకు టీఆర్ఎస్‌కు లాభం చేకూరుతుందనే తాము కాస్త, వెనక్కి తగ్గామని చెప్పారు. ఈటలకు పరోక్షంగా మద్దతు ఇవ్వాల్సి వచ్చిందని అన్నారు. నాగార్జునసాగర్, దుబ్బాక ఎన్నికల్లో పని చేసినట్టు హుజూరాబాద్‌లో తాము చేయలేదని కోమటిరెడ్డి వెంకట్​రెడ్డి చెప్పారు. ఇదిలాఉండగా 13వ రౌండ్ ముగిసే సరికి బీజేపీ అభ్యర్థి ఈటల రాజేందర్ 8,388 ఓట్ల ఆధిక్యంలో ముందు వరుసలో నిలిచారు.

Advertisement

Next Story