Super Star Krishna: రాజకీయాల్లో సూపర్ స్టార్ ప్రస్థానం..

by Sathputhe Rajesh |   ( Updated:2022-11-15 04:58:58.0  )
Super Star Krishna: రాజకీయాల్లో సూపర్ స్టార్ ప్రస్థానం..
X

దిశ, వెబ్ డెస్క్: రాజకీయాల్లో కూడా సూపర్ స్టార్ రాణించారు. 1972లో జై ఆంధ్ర ఉద్యమం జరిగినప్పుడు కృష్ణ ఆ ఉద్యమానికి బహిరంగంగా మద్దతునిచ్చాడు. 1980లో ఎన్టీ రామారావు రాజకీయ రంగ ప్రవేశం చేసి ముఖ్యమంత్రి కావడంతో తెలుగు నాట కూడా సినిమా రంగంలో గ్లామర్ కు రాజకీయాలకు మధ్య ప్రత్యక్ష సంబంధం ఏర్పడింది. 1982 డిసెంబర్ 17న కృష్ణ కథానాయకుడిగా విడుదలైన రాజకీయ చిత్రం ఈనాడు సినిమా అప్పడే రంగ ప్రవేశం చేసిన తెలుగుదేశం పార్టీ సిద్ధాంతాలకు, ప్రచారానికి అనుకూలంగా ఉంది. ఎన్నికలు మూడు వారాల్లో ఉన్న స్థితిలో విడుదలైన ఈ సినిమా తెలుగుదేశం ప్రభంజనంలో తనవంతు పాత్ర పోషించింది.

ఎన్టీఆర్‌తో విభేదాలు..

1983లో తెలుగుదేశం పార్టీ ప్రభుత్వం అధికారం చేపట్టి ఎన్టీ రామారావు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి అయ్యారు. 1984లో ఎన్టీఆర్ ప్రభుత్వాన్ని నాదేళ్ల భాస్కరరావు కూలదోసి ముఖ్యమంత్రి అయ్యారు. ఆ సమయంలో భాస్కరరావును కృష్ణ అభినందించినట్లు ఫుల్ పేజీ ప్రకటన విడుదల కావడం సంచలనంగా మారింది. ఈ ఘటనతో ఎన్టీ రామారావు, కృష్ణకి మధ్య విభేదాలకు రాజకీయ కోణాన్ని ఇచ్చింది. ఎన్టీ రామారావు తిరిగి ముఖ్యమంత్రి అయ్యాక ఈ విభేదాలు రాజుకున్నాయి. 1984 అక్టోబర్ లో ఇందిరా గాంధీ దారుణ హత్యకు గురైనప్పుడు కృష్ణ ఆమె అంత్యక్రియలకు ఢిల్లీ వెళ్లారు. అదే సమయంలో ప్రధాన మంత్రిగా, కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడిగా బాధ్యతలు స్వీకరించిన రాజీవ్ గాంధీ, కృష్ణ కలిసారు. తెలుగుదేశం పార్టీకి రామారావు మాస్ అప్పీల్ లభిస్తోందని, అలాంటి ప్రజాకర్షణ ఉన్న కృష్ణ కాంగ్రెస్ పార్టీకి ఉపకరిస్తాడని కాంగ్రెస్ నాయకులు భావించారు. 1984లో కృష్ణ కాంగ్రెస్ పార్టీలో చేరాడు. ఆ తర్వాత కృష్ణ ప్రభుత్వ చర్యలను వ్యంగ్యంగా విమర్శిస్తూ సినిమాలు చేశారు. కృష్ణ 80వ దశకంలో పలు రాజకీయ నేపథ్యంలోని సినిమాలు చేయడం వెనుక కారణం ఇదే అని అంటుంటారు.

ఎంపీగా తొలి ప్రయత్నంలోనే విజయం..

1989లో కృష్ణ కాంగ్రెస్ తరపున ఏలూరు లోక్ సభ నియోజకవర్గం నుంచి పోటీ చేసి విజయం సాధించాడు. 1991 లోక్ సభ ఎన్నికల్లో కృష్ణ గుంటూరు లోక్ సభ నియోజకవర్గం కోరుకున్నా తిరిగి ఏలూరులోనే పార్టీ పోటీ చేయించింది. ఆ ఎన్నికల్లో 31వేల ఓట్ల పై చిలుకు తేడాతో ప్రత్యర్థి బోళ్ల బుల్లిరామయ్యపై కృష్ణ ఓటమి పాలయ్యారు. 1991లో తనకు సన్నిహితుడు రాజకీయాల్లో తనను ప్రోత్సహించిన కాంగ్రెస్ అధ్యక్షుడు, మాజీ ప్రధాని రాజీవ్ గాంధీ దారుణ హత్యకు గురికావడం, తాను కోరిన గుంటూరు నియోజకవర్గం కాంగ్రెస్ ఇవ్వకపోవడంతో ఓడిపోవడం వంటి కారణాలతో కృష్ణ ప్రత్యక్ష రాజకీయాల్లో పోటీచేయడం విరమించుకున్నారు. 2009 ఎన్నికల్లో వైఎస్ రాజశేఖర్ రెడ్డి కోరిక మేరకు కాంగ్రెస్ పార్టీకి కృష్ణ కుటుంబం నైతిక మద్ధతు అందించింది.

ఇవి కూడా చదవండి:

సూపర్ స్టార్ కన్నుమూత.. ప్రముఖుల సంతాపం

మహేశ్ అన్నా.. నీకే ఎందుకు ఇన్ని బాధలు?

Advertisement

Next Story