Negative Thoughts: మీరు సక్సెస్ సాధించాలనుకుంటున్నారా? .. అయితే నెగెటివ్ థాట్స్‌ను వదిలేయండి!

by Prasanna |   ( Updated:2023-03-22 15:52:26.0  )
Negative Thoughts: మీరు సక్సెస్ సాధించాలనుకుంటున్నారా? .. అయితే నెగెటివ్ థాట్స్‌ను వదిలేయండి!
X

దిశ, ఫీచర్స్: ప్రపంచంలో అందరు వ్యక్తుల ఆలోచనలు, అభిప్రాయాలు ఒకేలా ఉండవు. ఆయా వ్యక్తుల అవగాహన, అనుభవాలు కూడా ఇక్కడ ప్రధానపాత్ర పోషిస్తాయి. ఒక సమస్య ఎదురైనప్పుడో, విజయం సాధించినప్పుడో వారి స్పందనలు కూడా భిన్నంగానే ఉంటాయి. సమస్య ఎదురైనా, సక్సెస్‌ సాధించినా కొందరు నిరాశ పడరు. అలాగనీ మరీ సంతోషంతో పొంగిపోతూ గర్వపడరు. ఇలాంటి వారినే మానసిక నిపుణులు స్థిత ప్రజ్ఞులని పేర్కొంటున్నారు. వీరు ఎలాంటి పరిస్థితులనైనా ఎదుర్కొంటారు. అయితే ప్రతీ విషయానికి నెగెటివ్‌గా ఆలోచించేవారు కూడా కొందరుంటారు. వీరు జీవితంలో అనేక సమస్యలు ఎదుర్కొంటూ ఉంటారని నిపుణులు చెప్తున్నారు. అయిందానికి, కానిదానికి అతిగా ఊహించుకొని, తమకు ఆపాదించుకొని ప్రతికూల ఆలోచనల్లో మునిగిపోతే క్రమంగా తీవ్రమైన మానసిక రుగ్మతకు, శారీరక అనారోగ్యానికి దారితీస్తుంది. అందుకే నెగెటివ్ థాట్స్‌ను మైండ్‌లోకి రానివ్వొద్దని సైకాలజిస్టులు చెప్తున్నమాట. రాత్రీ పగలు ఎలాగో, అమావాస్య పౌర్ణమి ఎలాగో, అలాగే ప్రతి ఒక్కరి జీవితంలో బాధలు, సంతోషాలు కలిగించే సందర్భాలు వచ్చిపోతుంటాయి. వాటన్నింటినీ సానుకూల ఆలోచనలతో స్వీకరించాలి. మంచిని ఆస్వాదిస్తూ, చెడును ఎదుర్కొంటూ పోవాలి. అయ్యో నాకే ఎందుకిలా జరుగుతోందని నెగెటివ్‌గా ఆలోచిస్తూ కూర్చుంటే మాత్రం మీ జీవితం అగాధంలో కూరుకుపోయినట్టేనని హైదరాబాద్‌కు చెందిన క్లినికల్ సైకాలజిస్టు ఉమాకాంత్ అంటున్నారు.

గతంలో ఒక యువకుడు పోలీస్ ఇన్ స్పెక్టర్ ఉద్యోగ నోటిఫికేషన్ పడగానే అప్లయ్ చేశాడు. ఫిజికల్ టెస్టుల్లో రాణించగలననే నమ్మకం అయితే ఉంది కానీ రాత పరీక్షే అతనికి సవాలుగా మారింది. ఎగ్జామ్ రాసేందుకు బాగా ప్రిపేర్ కావాలనుకున్నాడు. కానీ పార్ట్ టైమ్ జాబ్ చేస్తూ చదువుకుంటున్నాడు కాబట్టి, తగిన సమయం దొరికేది కాదు. చివరికి పరీక్ష తేదీ దగ్గర పడింది. 30 రోజులే సమయం ఉంది. ఇప్పుడేం చేయాలి? ఇన్నాళ్లూ చదవనిది నెల రోజుల్లోనే చదవగలమా? చదివితే మాత్రం పాసవగలమా? అనే సందేహాలు తలెత్తుతాయి. ఇలాంటప్పుడే సరైన ఆలోచన అవసరం అంటున్నారు మానసిక నిపుణులు.

ఇక లాభం లేదు. చదివినా ఫలితం ఉండదు అనే ప్రతికూల ఆలోచనలతో సతమతమైతే.. నిజంగానే అలా జరుగవచ్చు. కాబట్టి ఈ నెగెటివ్ ఆలోచనను దూరం పెట్టాలి. షార్ట్ టైం ప్రిపరేషన్ అనేది పెద్ద సవాలే అయిప్పటికీ దానిని స్వీకరించ గలిగే ధైర్యం, ఆత్మ విశ్వాసం కూడా అలవర్చుకోవాలి. ఎందుకంటే ఏ వ్యక్తీ కావాలని తన సమయాన్ని దుర్వినియోగం చేసుకోడు. తప్పని పరిస్థితిలో సమయం అనుకూలించని కారణంగా కొన్నిసార్లు ఇటువంటి ఇబ్బందులు ఎదురు కావచ్చు. కాబట్టి ఎదురైన సమస్యను సవాలుగా స్వీకరించి రాత్రిం బవళ్లు వీలైన సమయంలో చదివితే ర్యాంకు రాకపోవచ్చునేమో గానీ, పరీక్ష మాత్రం తప్పక పాసవగలుగుతారు అని సదరు యువకుడికి కౌన్సెలింగ్ ఇచ్చారు కుటుంబ పెద్దలు. పాసైనా, ఫెయిలైనా పర్లేదు ప్రయత్నం చేయాలని సూచించారు. ఇలాంటి మాటలతో సదరు యువకుడిలో నెగెటివ్ థాట్స్ పోయి, పాజిటివ్‌గా ఆలోచించడం మొదలు పెట్టాడు. అతనిలో ధైర్యం, ఆత్మ విశ్వాసం ఏర్పడ్డాయి. సమస్యను సవాలుగా స్వీకరించేలా చేశాయి. రాత్రిం బవళ్లు కష్టపడ్డాడు. ఇంకేముందు ఎస్సై ఎగ్జామ్‌లో మంచి మార్కులతోపాటు జాబ్ కూడా వచ్చింది. బెంగుళూరుకు చెందిన సంగమేశ్వర్ అనే యువకుడి జీవితంలో సాధ్యమైన ఈ సక్సెస్ ఇతరులకు ఎందుకు సాధ్యం కాదు? ఎగ్జామ్ కావచ్చు. ఉద్యోగం కావచ్చు. మరే లక్ష్యం అయినా కావచ్చు. వాటి గురించిన పాజిటివ్ ఆలోచనే సగం విజయాన్ని తెచ్చిపెడుతుంది. మిగతా సగం మీ ప్రయత్నాన్ని బట్టి ఉంటుంది. నెగెటివ్‌గా ఆలోచిస్తే మాత్రం అందుబాటులో ఉన్న అవకాశాలు, విజయాలు కూడా దూరం అవుతాయి. అందుకే మీకు ఎటువంటి స్విచ్చువేషన్ ఎదురైనా నెగెటివ్ ఆలోచనకు స్వస్తి పలికి, పాజిటివ్ ఆలోచనకు అవకాశం ఇస్తే మీరే విజేతలు.

ఇవి కూడా చదవండి:

అభిమానులకు బాలయ్య ఉగాది గిఫ్ట్.. NBK 108 ఫస్ట్ లుక్ రిలీజ్

Advertisement

Next Story

Most Viewed