Thangalan: సినిమా థియేటర్స్ లో మీ అందరినీ ఆశ్చర్యపరుస్తుంది: Chiyan Vikram

by Hamsa |
Thangalan: సినిమా థియేటర్స్ లో మీ అందరినీ ఆశ్చర్యపరుస్తుంది: Chiyan Vikram
X

దిశ, సినిమా: చియాన్ విక్రమ్ హీరోగా నటిస్తున్న పీరియాడిక్ యాక్షన్ మూవీ ‘తంగలాన్’. ఈ చిత్రాన్ని దర్శకుడు పా రంజిత్ రూపొందిస్తున్నారు. నీలమ్ ప్రొడక్షన్స్‌తో కలిసి స్టూడియో గ్రీన్ ఫిలింస్ బ్యానర్ పై ప్రముఖ నిర్మాత కేఈ జ్ఞానవేల్ రాజా నిర్మిస్తున్నారు. తంగలాన్ సినిమాలో పార్వతీ తిరువొతు, మాళవిక మోహనన్ హీరోయిన్లుగా నటిస్తున్నారు. కోలార్ గోల్డ్ ఫీల్డ్స్ నేపథ్యంలో యదార్థ ఘటనల ఆధారంగా ఈ మూవీ రూపొందింది. అయితే స్వాతంత్య్ర దినోత్సవం సందర్భంగా ఈ నెల 15న వరల్డ్ వైడ్‌గా గ్రాండ్ థియేట్రికల్ రిలీజ్ కాబోతుంది.

తంగలాన్ చిత్ర ప్రెస్ మీట్ నిర్వహించారు. ఈ కార్యక్రమంలో హీరో విక్రమ్ మాట్లాడుతూ.. పా రంజిత్ నా ఫేవరేట్ డైరెక్టర్. ఆయన తీసిన ప్రతి సినిమా నాకు ఇష్టం. పా రంజిత్ తో మూవీ చేయాలని ఎప్పటి నుంచో ఉండేది. ఆయన తంగలాన్ కథ నా దగ్గరకు తీసుకువచ్చినప్పుడు చాలా హ్యాపీగా ఫీలయ్యా. ఇది తెలుగు, తమిళ, కన్నడ అని కాదు ప్రపంచంలో ప్రతి ఒక్కరికీ రిలేట్ అయ్యే స్టోరీ. బంగారం వేట అనేది హైలైట్ అవుతున్నా..ఈ కథలో స్వేచ్ఛ కోసం చేసే పోరాటం ఉంది. మన జీవితాల్లో కూడా ఎప్పుడో ఒకప్పుడు అసమానతలకు గురవుతూ ఉంటాం. అలాంటి వారి కోసం దర్శకుడు పా రంజిత్ సినిమా అనే మాధ్యమం ద్వారా తన అభిప్రాయాలు చెబుతున్నారు.

సార్పట్ట సినిమా చూసినప్పుడు ఆ కథలోకి లీనమవుతాం గానీ మిగతా విషయాలు పట్టించుకోం. అలాగే ఈ సినిమా కథ మిమ్మల్ని ఆకట్టుకుంటుంది. ఎవరినీ ఇబ్బంది పెట్టే పేర్లు, మాటలు ఈ సినిమాలో ఉండవు. ఈ సినిమాలో నా క్యారెక్టర్ లుక్స్ చూసినప్పుడు ఒక్కోసారి ఒక్కో అంచనాలు ఏర్పడ్డాయి. ఫస్ట్ టైమ్ లుక్ రిలీజ్ చేసినప్పుడు ఇది కేజీఎఫ్ లా ఉంటుందా అన్నారు. కానీ తంగలాన్ లో అన్ని అంశాలు ఉన్నాయి. క్యారెక్టర్ కోసం రెడీ అయ్యేందుకు కొన్ని గంటలు మేకోవర్‌కు పట్టేది. మళ్లీ మేకప్ తొలగించుకునేందుకు కనీసం రెండు గంటలు అయ్యేది. చలిలో, వేడిలో అలాగే షూటింగ్ చేశాం.

మనకు ఇష్టమైన పని దొరికినప్పుడు ఆకలి, నిద్ర మర్చిపోతుంటాం. అలా నేను నా సినిమాల్లో నటిస్తున్నప్పుడు మిగతా విషయాలేవీ పట్టించుకోను. ఆ పాత్రకు తగినట్లు మారానా లేదా అనేదే ఆలోచిస్తాను. అవార్డులు నాకు ఇష్టమే. కానీ మీ నుంచి వచ్చే ప్రశంసలు మరింత సంతోషాన్ని ఇస్తాయి. ఆఫ్రికన్ ట్రైబ్స్ సహా ప్రపంచంలోని కొన్ని తెగలు ఎలా ఉంటాయో నేను తెలుసుకున్నాను. అవి ఈ మూవీ చేయడంలో హెల్ప్ అయ్యాయి. నాతో పాటు ఆర్టిస్టులంతా సింగిల్ షాట్ లో సీన్స్ చేశాం. ఆ సీన్ లో 30 టేక్స్ ఉన్నా.. సింగిల్ షాట్ లోనే చేసేవాళ్లం. పాన్ ఇండియా అని మనమే అంటున్నాం. నేను ఎక్కడ నటించినా అది అన్ని భాషల ప్రేక్షకులకు రీచ్ అవుతోంది. థియేటర్ లో మిమ్మల్ని ఈ సినిమా సర్ ప్రైజ్ చేస్తుంది అన్నారు.

Advertisement

Next Story