Disha Special Story: ‘తార’గా వెలగాలంటే ‘బెడ్’పై నలగాల్సిందేనా?

by sudharani |   ( Updated:2024-09-28 15:11:04.0  )
Disha Special Story: ‘తార’గా వెలగాలంటే ‘బెడ్’పై నలగాల్సిందేనా?
X

సినిమా అంటేనే రంగుల ప్రపంచం.. అక్కడ ‘స్టార్’గా మెరవాలని అనేక మంది కలలు కంటారు. అందం, అభినయం, నటనలో ప్రావీణ్యం, టాలెంట్‌తో ఇండస్ట్రీకి వస్తారు. అయితే ఇక్కడికి వచ్చాక.. ‘మాకు కావాల్సింది కమిట్‌మెంట్’ అనే మాట మహిళా ఆర్టిస్టుల ఆశలపై నీళ్లు చల్లుతున్నది. ‘పక్క’లోకి వస్తేనే అవకాశాలు ఇస్తామని కొందరు చెబుతుండగా.. కాదన్న వారిని బ్యాడ్ గర్ల్, ఐరన్ లెగ్, పొగరుబోతూ అంటూ పేర్లు పెట్టి.. ఇండస్ట్రీ నుంచి తరిమేస్తున్నారనే చర్చ ఉన్నది. అయితే ఈ ‘కాస్టింగ్ కౌచ్’ ఒక్క బాలీవుడ్, టాలీవుడ్‌ అనే కాదు.. అన్ని భాషల సినీ ఇండస్ట్రీలకూ విస్తరించింది. మలయాళం ఫిల్మ్ ఇండస్ట్రీకి సంబంధించి ఇటీవల జస్టిస్ హేమ కమిటీ సమర్పించిన రిపోర్ట్ సంచలనంగా మారగా.. తెలుగు పరిశ్రమలోనూ వేధింపులు ఎక్కువే అంటూ ఓ స్టార్ హీరోయిన్ చేసిన కామెంట్స్ చర్చనీయాంశంగా మారాయి. -చుక్క సుధారాణి

హాలీవుడ్ నుంచి స్టార్ట్ అయి..

‘నీకు సినిమాల్లో అవకాశం ఇస్తా.. నాకు శారీరక సుఖం అందిస్తావా?’ అనే తీరులో చాలా మంది వ్యవహరిస్తున్నారు. సినీరంగంలో దీన్నే క్యాస్టింగ్ కౌచ్ అని పిలుస్తున్నారు. హాలీవుడ్‌లో మొదలైన ఈ పాడుపని.. క్రమంగా బాలీవుడ్‌కు విస్తరించింది. ఆ తర్వాత నెమ్మదిగా మిగతా భాషల ఇండస్ట్రీలకు వ్యాపించింది. తెలుగు ఇండస్ట్రీలో జెమినీ, వాహినీ, ఏవీఎం సంస్థలు సినిమాలు నిర్మించిన రోజుల్లో అంతా ఓ పద్ధతి ప్రకారం ఉండేది. ఎప్పుడైతే సంస్థలు పోయి.. నిర్మాతల పెత్తనం వచ్చిందో అప్పటి నుంచి కాస్టింగ్ కౌచ్‌ పెరిగిపోయిందని ఫిల్మ్ వర్గాల్లో టాక్. ప్రస్తుతం ఇది ‘పక్క (బెడ్) ఎక్కితేనే పరదా మీదికి..’ అన్న చందంగా మారిపోయిందంటే అతిశయోక్తి కాదు.

అవకాశం కోసం.. శరీరం అర్పించాల్సిందేనా!

ప్రస్తుతం సోషల్ మీడియా, యూట్యూబ్ ప్రభావం బాగా పెరిగిపోయింది. వీటిల్లో షార్ట్ ఫిల్మ్‌‌లు, చిన్న చిన్న స్టోరీస్, రీల్స్, టీవీ షోలు చేస్తూ చాలామంది ఓవర్ నైట్ స్టార్స్ అయిపోతున్నారు. ఇలా ఫేమస్ అయిన వాళ్లు హీరోయిన్స్‌‌గా, క్యారెక్టర్ ఆర్టిస్టులుగా ఎదుగుతున్నారు. కానీ గతంలో సినీ ఇండస్ట్రీలో అడుగు పెట్టాలంటే అదొక అద్భుతం. హీరోయిన్‌గా ఎదిగి తమను తాము తెరపై చూసుకోవడానికి మహిళలు ఎన్నో ప్రయత్నాలు చేసేవారు. ఈ ప్రాసెస్ లో ఎన్నో ఇబ్బందులు పడేవారు. అయితే ‘నీకు సినిమాలో అవకాశమిస్తే నాకేంటి? నిన్ను గ్లామరస్ గా చూపిస్తే నాకేంటి?’ అనే ప్రశ్నలు వారికి ఎదురయ్యేవి. తమతో గెస్ట్ హౌజ్ కు రావాలనే డిమాండ్లు వినిపించేవి. ఫొటోగ్రాఫర్, కెమెరామెన్ నుంచి హీరో వరకు హీరోయిన్ అవ్వాలన్ని వచ్చే వాళ్లను టార్గెట్ చేసే వాళ్లు. వారిని వాడుకోవాలని చూసే వారు. అయితే ఇలాంటి వాటికి కొందరు నో చెప్పి వెనుదిరిగితే.. అడిగింది అర్పించి మరికొందరు అవకాశాలు అందుకున్నారనే చర్చ ఉన్నది. అయితే.. వారిలో కూడా చాలా మంది మోసపోయారు. వాడుకుని వదిలేశారంటూ కొంతమంది రోడ్డెక్కి నిరసన సైతం తెలియజేశారు.

సంచలనంగా జస్టిస్ హేమ కమిటీ రిపోర్ట్‌

2017లో మలయాళ నటి కిడ్నాప్ కేసు సంచలనం సృష్టించింది. కారులో ఆమెను లైంగికంగా వేధించడానికి రౌడీలను వినియోగించినట్టు నటుడు దిలీప్‌పై ఆరోపణలు రాగా, అతడు అరెస్ట్ అయ్యాడు. ఈ క్రమంలోనే మాలీవుడ్‌లో మహిళలు ఎదుర్కొంటున్న సమస్యలపై అధ్యయనం చేసేందుకు కేరళ ప్రభుత్వం 2019లో జస్టిస్ హేమ నేతృత్వంలో ఓ కమిటీ ఏర్పాటు చేసింది. ఏడేళ్ల తర్వాత ఆ కమిటీ తన నివేదికను ప్రభుత్వానికి అందజేసింది. చిత్ర పరిశ్రమలో పనిచేసే మహిళలు క్యాస్టింగ్ కౌచ్, లైంగిక వేధింపులు ఎదుర్కొంటున్నట్లు ఆ నివేదికలో పేర్కొన్నది. హేమ కమిటీ రిపోర్ట్ తర్వాత.. క్యాస్టింగ్ కౌచ్ పై ఇప్పుడు ఒక్కొక్కరుగా గొంతు విప్పుతున్నారు. మరోవైపు మలయాళ మూవీ ఆర్టిస్ట్స్ అసోసియేషన్ సభ్యులపైనే లైంగిక వేధింపుల రావడంతో అధ్యక్ష పదవికి మోహన్‌లాల్ సైతం రిజైన్‌ చేశారు. మరో 17 మంది సభ్యులు రాజీనామా చేయడంతో ‘అమ్మ’ కమిటీని రద్దు చేశారు.

హాట్ టాపిక్‌గా శ్రీరెడ్డి నగ్న పోరాటం

లైంగిక వేధింపులపై నటి శ్రీరెడ్డి చేసిన పోరాటం ఇండస్ట్రీ పెద్దలను ముప్పుతిప్పలు పెట్టింది. అవకాశాల పేరుతో ఇండస్ట్రీ పెద్దలు తనను వాడుకున్నారని, తెలుగు అమ్మాయి అనే కారణంతో అవకాశాలు లేకుండా చేశారని శ్రీరెడ్డి మీడియా ముందుకు వచ్చారు. ఏకంగా హైదరాబాద్‌లో ఫిల్మ్ చాంబర్ ఎదుట కేవలం అండర్‌వేర్ తో కూర్చొని నిరసన తెలిపారు. తెలుగు అమ్మాయిలను శారీరకంగా, మానసికంగా వేధిస్తున్నారని, కమిట్‌మెంట్స్‌కు ఒప్పుకోకపోతే కక్షసాధింపు చర్యలకు పాల్పడుతున్నారని ఆరోపించారు. ఈ ఇష్యూలో సినీ ఇండస్ట్రీకి చెందిన చాలా మంది పెద్దోళ్ల పేర్లను బయటపెట్టారు. అప్పట్లో ఆమె చేసిన పోరాటం తెలుగు సినీ ఇండస్ట్రీలో హాట్ టాపిక్‌గా మారింది.

టాలీవుడ్ కమిటీ ఏమైనట్టు?

శ్రీరెడ్డి ఆందోళన నేపథ్యంలో 2018లో మహిళా ఆర్టిస్టులకు రక్షణ కల్పించాలని పలువురు మహిళా హక్కుల కార్యకర్తలు హైకోర్టును ఆశ్రయించారు. స్పందించిన న్యాయస్థానం సినీ పరిశ్రమలో మహిళలపై జరుగుతున్న వేధింపులు, ఇతర సమస్యలపై ఉన్నతస్థాయి కమిటీ వేసి విచారణ జరిపించాలని ప్రభుత్వాన్ని ఆదేశించింది. హైకోర్టు ఆదేశంతో నాటి తెలంగాణ స్టేట్ ఫిలిం డెవలప్‌మెంట్ కార్పొరేషన్ చైర్మన్ రామ్మోహన్ రావు నేతృత్వంలో 2019 ఏప్రిల్‌లో 25 మందితో ఉన్నతస్థాయి కమిటీని ఏర్పాటు చేసింది. ఇందులో దర్శకురాలు నందిని రెడ్డి, సినీ నటి సుప్రియ, దర్శక నిర్మాతలు తమ్మారెడ్డి భరద్వాజ, సుధాకర్ రెడ్డి, యాంకర్ ఝాన్సీ, గాంధీ మెడికల్ కళాశాల వైద్యురాలు రమాదేవి, నల్సార్ యూనివర్సిటీ ప్రొఫెసర్ వాసంతి, సామాజిక కార్యకర్త విజయలక్ష్మి తదితరులు ఉన్నారు. ఇండస్ట్రీలో మహిళా ఆర్టిస్టులపై లైంగిక వేధింపులు, వారికి కల్పిస్తున్న భద్రత, రెమ్యూనరేషన్ తదితర అంశాలపై సుదీర్ఘంగా విచారణ చేపట్టింది. 2022 జూన్ 1న ప్రభుత్వానికి నివేదిక సమర్పించింది. కానీ ఆ రిపోర్ట్‌ ఇప్పటికీ బయటకురాకపోవడం గమనార్హం.

స్టార్ హీరోయిన్స్ రియాక్షన్ ఇలా..

కాస్టింగ్ కౌచ్ పై చిన్న ఆర్టిస్టుల నుంచి స్టార్ హీరోయిన్ల వరకు ఒక్కొక్కరుగా గళం విప్పుతున్నారు. తనకు కూడా లైంగిక వేధింపులు తప్పలేదని తమిళ స్టార్ హీరో కూతురు, నటి వరలక్ష్మీ శరత్ కుమార్‌కు బహిరంగంగానే చెప్పారు. అమలాపాల్, శృతిహసన్, త్రిష, నయనతారా, చిన్మయి శ్రీపాద, తాప్సీ పన్ను, రోజా, విజయశాంతి, రమ్యకృష్ణ, ఆమని, కస్తూరి, నందితా శ్వేత, మాధవీలత, ఐశ్వర్య రాజేశ్, షకీలా, క్యారెక్టర్ ఆర్టిస్టులు హేమ, ఝాన్సీ, కరాటే కళ్యాణి ఇలా ఎంతో మంది తమకు ఎదురైన వేధింపులను ఏకరువు పెట్టారు.

సీఎం రేవంత్ రెడ్డికి సమంత స్పెషల్ రిక్వెస్ట్

మలయాళం ఇండస్ట్రీలో లైంగిక వేధింపులపై జస్టిస్ హేమ కమిటీ రిపోర్ట్ అనంతరం హీరోయిన్ సమంత దీనిపై వరుస ట్వీట్స్‌ తో తన గొంతును వినిపించారు. ‘తెలుగు ఫిల్మ్ ఇండస్ట్రీలోని మహిళలంతా హేమ కమిటీ రిపోర్టును స్వాగతిస్తున్నాం. కేరళలో ఉమెన్ ఇన్ సినిమా కలెక్టివ్ (డబ్ల్యూసీసీ) చేస్తున్న కృషిని అభినందిస్తున్నాం. వాళ్ల కృషే ఈ ఉద్యమానికి దారి తీసింది. ఆ డబ్ల్యూసీసీ నుంచి స్ఫూర్తి పొందే.. టాలీవుడ్ ఫిల్మ్ ఇండస్ట్రీలోని మహిళల కోసం ఏర్పడిన ‘సపోర్ట్ గ్రూప్ ది వాయిస్ ఆఫ్ ఉమెన్’ 2019లో ఏర్పాటైంది. లైంగిక వేధింపులపై ఉన్నత కమిటీ సమర్పించిన రిపోర్టును పబ్లిష్ చేయాలని మేము తెలంగాణ ప్రభుత్వాన్ని కోరుతున్నాం. ఇది టాలీవుడ్ ఫిల్మ్ ఇండస్ట్రీలో పని చేసే మహిళల రక్షణ కోసం ప్రభుత్వం, ఇండస్ట్రీ చేపట్టబోయే విధానాలకు తోడ్పడుతుంది’ అంటూ సమంత తన ఇన్‌స్టా వేదికగా పోస్ట్ చేశారు. సమంత వ్యాఖ్యలను స్టార్ హీరోయిన్ అనుష్క శెట్టి, యాంకర్ ఝూన్సీ మద్దతు పలికారు. టాలీవుడ్‌లో విచారణ చేపట్టిన ఉన్నతస్థాయి కమిటీ రిపోర్ట్‌ ను బహిర్గతం చేయాలని సీఎం రేవంత్ రెడ్డికి విజ్ఞప్తి చేశారు.

స్పందించిన సాయి పల్లవి..

లైంగిక వేధింపులపై టాలీవుడ్ నటి సాయి పల్లవి పరోక్షంగా స్పందించారు. సోనీలివ్ ఓటీటీలో ‘నిజం’ అనే ‘షో’కు గెస్ట్‌ గా వచ్చిన ఆమె.. ‘శారీరకంగానే హింసించాల్సిన అవసరం లేదు. మాటల ద్వారా హింసించడం, వారిని ఇబ్బంది పెట్టడం కూడా ఓ రకంగా లైంగిక వేధింపుల కిందకే వస్తుంది’ అని చెప్పారు. కాగా, ఈ టాక్ షో పూర్తి ఎపిసోడ్ త్వరలోనే స్ట్రీమ్ అవనుంది.

నేను కూడా బాధితురాలినే: సమీరా రెడ్డి

మెగాస్టార్ చిరంజీవి ‘జై చిరంజీవ’, ఎన్టీఆర్ ‘అశోక్’ వంటి చిత్రాలతో తెలుగు ప్రేక్షకుల్లో గుర్తింపు తెచ్చుకున్న బాలీవుడ్ హీరోయిన్ సమీరా రెడ్డి కూడా క్యాస్టింగ్ కౌచ్‌పై స్పందించారు. ‘వైకుంఠపాళీ ఆట లాంటి ఈ సినీ ఇండస్ట్రీలో పాముల నోటికి చిక్కకుండా అడుగులు వేయాలి. అలా చేయడానికి నేను చాలా కష్టపడ్డాను. ఎన్నో సినిమాలను వదులుకున్నాను. బాలీవుడ్‌లో నేను అగ్రిమెంట్ చేసిన ఓ సినిమా నిర్మాత వచ్చి.. మీరు ఈ పాత్రకు సరిపోరు అని చెప్పి వెళ్లిపోయారు. అయితే.. ఆ తర్వాత తెలిసింది. ఓ స్టార్ కిడ్‌ను ఆ మూవీలోకి తీసుకునేందుకు ఇలా చేశారని. నెపోటిజం ఇక్కడ చాలా ఎక్కువ.’ అని చెప్పారు.

ఎందుకు పెదవి విప్పరు?

లైంగిక వేధింపులపై నోరు విప్పడానికి చాలా మంది మహిళా ఆర్టిస్టులు వెనకడుగు వేస్తున్నారు. సినిమా అవకాశాలు రాకుండా చేస్తారని, పరిశ్రమలో ఎదగనీయరని, చెడుగా ప్రచారం చేస్తారనే భయం మహిళా ఆర్టిస్టుల్లో ఉన్నది. అగ్రహీరోలు, బడా దర్శక, నిర్మాతలను ఎదురించి నిలబడలేమనే భయమూ లేకపోలేదు. అందుకే చాలా మంది నటీమణులు సర్దుకొని పోతున్నారని ఫిల్మ్ నగర్ టాక్. ఇప్పటికే క్యాస్టింగ్ కౌచ్‌పై మాట్లాడిన తారలు అడ్రస్ లేకుండా పోయారని భావిస్తుంటారు. ఇండస్ట్రీలో క్యాస్టింగ్ కౌచ్‌పై గళం విప్పితే ‘మా’ అసోసియేషన్, ఫిల్మ్ చాంబర్ అండగా నిలబడతారనే నమ్మకం లేకపోవడం కూడా ఒక కారణంగా చెబుతుంటారు.

మేనేజర్లదే కీ రోల్?

ఏ దర్శక, నిర్మాత, హీరో తారలను, ఆర్టిస్టులను డైరెక్ట్ గా కమిట్‌మెంట్ అడగరు. ‘అగ్రిమెంట్ సమయంలో మేనేజర్లను మీడియేటర్లుగా ఉంచి కమిట్‌మెంట్ అడుగుతారని, శారీరక సుఖం అందించాలని డిమాండ్ చేస్తారనే చర్చ ఉన్నది. అలాగే ఓ సినిమా హిట్ అయితే వారితో లేట్ నైట్ పార్టీలకు వెళ్లిన తారలకు, మహిళా ఆర్టిస్టులకు మరిన్ని అవకాశాలు వస్తాయని ఇండస్ట్రీలో టాక్. బడాబాబుల చెప్పుచేతల్లో ఉన్న వారికి చేతినిండా ఆఫర్లు ఉంటాయనే గుసగుసలు ఫిల్మ్ నగర్‌లో వినిపిస్తుంటాయి. నో చెప్పిన వారి బొమ్మ ఎక్కడా కనిపించదని కూడా ఇండస్ట్రీలో ప్రచారంలో ఉన్నది.

ప్రకంపనలు సృష్టించిన 'మీ టూ' ఉద్యమం

‘మీటూ’ పేరిట 2018లో స్టార్ట్ అయిన ఉద్యమం క్రమంగా సినీ రంగాన్నీ తాకింది. లైంగిక వేధింపులపై మాట్లాడడానికి ఇది ఒక శక్తివంతమైన వేదికగా మారింది. ‘మీ టూ’ యాష్ ట్యాగ్ తో ట్విట్టర్, ఫేస్ బుక్ వేదికగా తమపై జరిగిన లైంగిక వేధింపులపై మహిళలు నోరు విప్పడం స్టార్ట్ చేశారు. నటీమణులు తనూశ్రీ దత్తా, చిన్మయి శ్రీపాద చేసిన ఆరోపణలు సంచలనంగా మారాయి. అనతికాలంలో ఇలాంటి మహిళల సంఖ్య వేలకు చేరడం, మీ టూ ప్రకంపనలు అన్ని రంగాలకు తాకడంతో తీవ్ర చర్చనీయాంశంగా మారాయి.

క్యాస్టింగ్ కౌచ్.. దిశ స్పెషల్​ ఎడిషన్​...రంగురంగుల ప్రపంచంలో చీకటి కోణాలు ఎన్నో?...తారలుగా వెలగాలంటే బెడ్ పై నలగాల్సిందేనా?​

Advertisement

Next Story

Most Viewed