Review: అశ్విన్‌బాబు ‘శివం భజే’ రివ్యూ..

by sudharani |
Review: అశ్విన్‌బాబు ‘శివం భజే’ రివ్యూ..
X

నటీనటులు: అశ్విన్‌బాబు, దిగంగనా సూర్యవన్షీ, హైపర్‌ ఆది, బ్రహ్మజీ, తనికెళ్ల భరణి

నిర్మాత: మహేశ్వర్‌ రెడ్డి

దర్శకత్వం: అప్సర్‌

దిశ, సినిమా: 'కల్కి 2898ఏడి' చిత్రం థియేటర్‌లో సందడి చేసిన తరువాత.. వరుసగా సినిమాలు థియేటర్‌లో విడుదలవుతున్నాయి. అందులో భాగంగా యాంకర్‌ ఓంకార్‌ సోదరుడు అశ్విన్‌బాబు హిడింబ తరువాత నటించిన మరో చిత్రం 'శివం భజే'. ఆగస్టు 1న ప్రేక్షకుల ముందుకొచ్చిన ఈ చిత్రం ఎలా వుంది? ప్రేక్షకులను ఏ మేరకు ఆకట్టుకుందో తెలుసుకుందాం.

కథ: చందు (అశ్విన్‌బాబు) బాల్యంలోనే తండ్రి చనిపోవడంతో.. కుటుంబ బాధ్యతలు నెత్తి మీద వేసుకుని జీవితాన్ని గడుపుతుంటాడు. మోటారు వాహనలకు ప్రయివైట్‌ బ్యాంకులు ఇచ్చిన లోన్‌లను. ఈఎమ్‌ఐ రూపంలో వసూలు చేస్తుంటాడు. ఈ ప్రాసెస్‌లోనే శైలజ (దిగంగన సూర్య వన్షీ) ప్రేమలో పడతాడు చందు. ఇక అనుకోకుండా జరిగిన గొడవ వల్ల కంటి చూపును కోల్పోతాడు. దాంతో ట్రాన్స్‌ ప్లాంటేషన్‌ ద్వారా తిరిగి కళ్లు వస్తాయి. కొత్త కళ్లు అమర్చిన తరువాత అతనిలో కొత్త కొత్త మార్పులు కనిపిస్తుంటాయి. కొన్ని హత్యలకు సంబంధించిన గుర్తులు మెదడులో తిరుగుతుంటాయి. అయితే ఆపరేషన్‌ తరువాత అతనిలో ఈ అనూహ్య మార్పులకు కారణమేమిటి? అనేది తెలుసుకోవాలంటే సినిమా చూడాల్సిందే..

విశ్లేషణ: డివోషనల్‌ థ్రిల్లర్‌ కథాంశంతో తెరకెక్కిన ఈ చిత్రంలో దర్శకుడు నాలుగైదు జానర్లను కలిపి.. ఇది ఏ జానరో అర్థం కాక చిత్రాన్ని సరిగ్గా తెరకెక్కించలేదు అనిపిస్తుంది. అసలు ఈ కథాంశంతో ఆయన ఏం చెప్పాలని అనుకున్నాడో క్లారిటీ లేదు. కథ పాయింట్‌గా చెప్పుకుంటే కాస్త కొత్తగా అనిపించిన దానిని తెరపైకీ తీసుకొచ్చిన విధానం పేలవంగా వుంది. ముఖ్యంగా కథాంశం నత్తనడక సాగుతుంటే.. మరో వైపు సన్నివేశాలు కూడా విసుగు పుట్టించే విధంగా తెరకెక్కించాడు. చిత్తం శివుని మీద...భక్తి చెప్పుల మీద అనే సామెత.. శివం భజే చిత్రానికి అతికినట్టుగా సరిపోతుంది.. ఎందుకంటే శివం భజే టైటిల్‌తో సినిమా తీస్తూ.. శివుడు, లయకారుడు.,. లోకరక్షనార్థం లయకారుడే తరలోస్తున్నాడు అంటూ పబ్లిసిటిలో హడావుడి చేసి అసలు టైటిల్‌కు సినిమాకు సంబంధం లేకుండా.. . శివుడికి ఈ కథకు లింక్‌ లేకుండా కేవలం హీరో ఎలివేషన్‌.. ఫైట్స్‌.. చైనా, పాకిస్థాన్‌లు కలిపి ఇండియా మీద బయోవార్‌ చేస్తున్నారంటూ.. కథలో ఆ అంశాన్ని జోడించి..డివోషనల్‌ థ్రిల్లర్‌ను డివియేట్‌ చేసే విధంగా ఇతరత్రా విషయాలపై మీద దృష్టి పెట్టి అసలు కథను చెప్పడంలో కన్‌ఫ్యూజ్‌ అయ్యాడు దర్శకుడు. ఫస్ట్‌హాఫ్‌ సో.. సో.. సాగిన ఈ చిత్రం సెకండాఫ్‌లో మరింత నెమ్మదించింది. ఎక్కడా కూడా సినిమా ఆసక్తికరంగా అనిపించదు. ఈ చిత్రంలో జరిగే రెండు హత్యలకు కారణాలు తెలుసుకోవడానికి జరిగే ఇన్విస్టిగేషన్‌ సన్నివేశాలు చాలా డల్‌గా వుంటాయి. సినిమా మొత్తం ఎటువంటి జోష్‌ లేకుండా నిస్సత్తువగా,నీరసంగా వుంటుంది. ఇక సెకండాఫ్‌లో హీరోకు ఆపరేషన్‌ తరువాత తరచుగా తలనొప్పి వస్తుంటుంది. థియేటర్‌లో ప్రేక్షకుడి పరిస్థితి కూడా అలాగే వుంటుంది. సినిమాలో ఏ సన్నివేశానికి సరైన లాజిక్‌ కనిపించదు. కళ్ల ట్రాన్స్‌పరేషన్‌ అనేది చాలా ఈజీగా.. అవలీలగా, ఎటువంటి లాజిక్‌ లేకుండా చూపించడంలో స్క్రిప్ట్‌పై ఏ మాత్రం అవగాహన లేకుండా సినిమా రూపొందించారని అనిపిస్తుంది.

నటీనటుల, సాంకేతిక నిపుణుల పనితీరు: చందుగా అశ్విన్‌బాబు నటన ఫరవాలేదు అనిపించింది. అయితే ఇంకా డైలాగ్‌ డెలివరీలో, డిక్షన్‌లో పరిణతి సాధించాలి. యాక్షన్‌ ఏపిసోడ్స్‌లో మాత్రం హుషారుగా కనిపించాడు. కథానాయిక దిగంగనా సూర్యవంశీ అందంగా వుంది. హైపర్‌ ఆది పంచ్‌లు అక్కడక్కడా వినోదాన్ని పంచాయి, డాక్టర్‌ పాత్రలో బ్రహ్మజీ నవ్వించడానిక ప్రయత్నించాడు. అయితే ఆ సన్నివేశాలు అంతగా పండలేదు. కథలో కొత్తదనం కనిపించినా దానిని తెరకెక్కించడంలో దర్శకుడు విఫలమయ్యాడు. నేపథ్య సంగీతంతో ఆకట్టుకునే ప్రయత్నం చేశారు. కానీ కుదరలేదు.

ఫైనల్‌గా: దారి తప్పిన డివోషనల్‌ థ్రిల్లర్‌..!

రేటింగ్‌: 1.75/5

Advertisement

Next Story