సిగ్నల్స్ లేవ్… ఫైన్స్ వదలట్లేవ్…

by Shyam |
సిగ్నల్స్ లేవ్… ఫైన్స్ వదలట్లేవ్…
X

దిశ, వికారాబాద్: ట్రాఫిక్ సమస్యను అధిగమించడం కోసం జిల్లా కేంద్రంలో మూడు ప్రధాన కూడళ్లలో సిగ్నల్స్ ఏర్పాటు చేశారు. అవి కాస్త మూన్నాళ్ల ముచ్చటగానే మిగిలాయి. మూడు చోట్ల ట్రాఫిక్ సిగ్నల్స్ ఏర్పాటు చేస్తే మహాశక్తి థియేటర్ ఎదుట కొన్ని రోజులకే మూతపడింది. బీజేఆర్ చౌరస్తాలో కొన్నాళ్లు పని చేసినా ఇప్పుడు ఇక్కడ కూడా పనిచేయడం లేదు. దీంతో పాదచారులు, వాహనదారులు తీవ్ర ఇబ్బందులు పడుతు న్నారు.

నిత్యం ఈ ప్రాంతం రద్దీగా ఉంటుంది. ఈ ఏరియాలోనే ఆసుపత్రులు, కిరాణా షాపులు, రైల్వే స్టేషన్ రోడ్, బస్టాండ్ రోడ్, పోలీస్ స్టేషన్, హైదరాబాద్, తాండూరు, అంతర్ జిల్లాలకు వెళ్లేందుకు రోడ్డు మార్గాలు ఉన్నాయి. బీజేఆర్ చౌరస్తాలో ట్రాఫిక్ సిగ్నల్స్ పనిచేయడం లేదు. వాహనాలను కంట్రోల్ చేసేందుకు పోలీసులు ఉన్నా ట్రాఫిక్ కు అంతరాయం కలుగుతూనే ఉంది. జిల్లా కేంద్రంలో రోజు రోజుకూ ట్రాఫిక్ పెరిగిపోతోంది. వాహనాల రాకపోకలు కూడా పెరిగాయి. వికారాబాద్ లోనే జిల్లా కార్యాలయాలు ఉండటం వల్ల సుదూర ప్రాంతాల నుంచి ప్రజలు వివిధ పనుల నిమిత్తం వస్తున్నారు.

వికారాబాద్ లో ట్రాఫిక్ సిగ్నల్స్ పనిచేయకపోవడంతో వాహనదారులు నిబంధనలు పాటించడం లేదు. బీజేఆర్ చౌరస్తాలో హోటళ్లు, షాపింగ్ మాల్స్ ఉండటం వల్ల ప్రజలతో రద్దీగా ఉంటుంది. వాహనాలు కూడా అక్కడే రోడ్డు పక్కన నిలుపుకొని వారి పనులు చేసుకుంటారు. దీంతో అక్కడే ఉన్న ట్రాఫిక్ పోలీసులు నో పార్కింగ్ అని ఫొటోలు తీసి ఈ చలాన్లు వేస్తున్నారు. అదే సిగ్నల్స్ పనిచేస్తే వాహనదారులు ట్రాఫిక్ నిబంధనలు పాటిస్తారు.

ట్రాఫిక్ సమస్య ఉంది..

పట్టణంలో ట్రాఫిక్ సమస్య అధికంగా ఉంది. నిత్యం ఎక్కడో ఓ చోట సమస్య వస్తుంది. సిగ్నల్స్ పనిచేయడం లేదు. అధికారులు పట్టించుకోవడం లేదు. ట్రాఫిక్ సిగ్నల్స్ ను మరమ్మతులు చేయడం లేదు కాని నిబంధనలు పాటించడం లేదని ఫైన్లు వేస్తున్నారు. ఇప్పటికైనా బాగు చేయించాలి.
-శ్రీకాంత్, ద్విచక్ర వాహనదారుడు

ఇబ్బంది కలుగుతోంది..

నాలుగు ప్రధాన కూడళ్లలోని ట్రాఫిక్ సిగ్నల్స్ పని చేయకపోవడం వల్ల వాహనదారులు ఇబ్బంది పడుతున్నారు. బీజె ఆర్ చౌరస్తా, మహాశక్తి చౌరస్తా పెట్రోల్ బంకు వద్ద సిగ్నల్స్ పని చేయడం లేదు. దీంతో వాహనదారులు ట్రాఫిక్ రూల్స్ పట్టించుకోవడం లేదు. అధికారులు వెంటనే స్పందించి సిగ్నల్స్ కు మరమ్మతులు చేయించాలి.
-నగేశ్, వాహనదారుడు

Advertisement

Next Story

Most Viewed