ఓ తల్లీ.. నీకు సలాం..

by Shyam |
ఓ తల్లీ.. నీకు సలాం..
X

దిశ, నిజామాబాద్: లాక్‌డౌన్ నేపథ్యంలో ఓ మాతృమూర్తి చేసిన సాహసం ఇప్పుడు ఇంటా బయట ఆమెకు సలాం కొట్టేలా చేసింది. బోధన్ కు చెందిన మహిళ మూడు రోజుల్లో 1,400 కిలో మీటర్లు స్కూటీపై ప్రయాణించి అక్కడున్న తన తనయుడిని తీసుకురావడానికి పడిన తపన ఇప్పుడు సర్వత్రా చర్చనీయాంశమైంది. జిల్లాల సరిహద్ధులను దాటి వేరే రాష్ర్టంలోకి వెళ్లడానికి ఆ మహిళ చేసిన సాహసాన్ని సోషల్ మీడియాలో చూసి తెలుసుకున్న నెటిజన్లు ఓ మాతృమూర్తి నీకు సలాం అంటూ వందనాలు చేస్తున్నారు.

విషయమేమిటంటే.. బోధన్‌కు చెందిన రజియా బేగం ప్రభుత్వ పాఠశాలలో ఉపాధ్యాయురాలు. ఆమెకు ఇద్దరు కుమారులు, ఒక కుమార్తె ఉన్నది. 12 ఏళ్ల క్రితం భర్త మరణించాడు. అప్పటి నుంచి పిల్లల ఆలనాపాలనా ఆమె చూస్తోంది. చిన్నవాడైన మహ్మద్‌ నిజాముద్దీన్‌ ఇంటర్‌ పూర్తి చేసి హైదరాబాద్‌లోని నారాయణ మెడికల్‌ అకాడమీలో కోచింగ్‌ తీసుకుంటున్నాడు. నెల్లూరుకు చెందిన నిజాముద్దీన్‌ స్నేహితుడు బోధన్‌లో ఇంటర్‌ చదివాడు. అతడి ఇంటర్‌ సప్లిమెంటరీ పరీక్షల కోసం గత నెలలో ఇద్దరూ కలసి హైదరాబాద్‌ నుంచి బోధన్‌కు వచ్చారు. స్నేహితుడి తండ్రి ఆరోగ్యం సరిగాలేదని తెలియడంతో అతడికి తోడుగా నిజాముద్దీన్‌ మార్చి 12న నెల్లూరుకు వెళ్లాడు. అక్కడ ఉండగానే ప్రభుత్వం జనతా కర్ప్యూ విధించింది. ఒక్కరోజుతో అది ముగుస్తుందని, తరువాత ఎప్పుడైనా తిరిగి రావొచ్చనుకున్నాడు నిజాముద్దీన్. అయితే ప్రభుత్వం ముందుగా మార్చి 31 వరకు లాక్ డౌన్ అనగానే అది ముగిసిన తరువాత రావాలని అతని తల్లి రజియా సూచించింది. కానీ, ప్రభుత్వం ఏప్రిల్ 14 వరకు లౌక్ డౌన్ అని చెప్పి, పరిస్థితుల దృష్ట్యా ఇప్పుడు ఎత్తేయ్యడం కుదరదని ప్రకటించడంతో ఆ తల్లి తీవ్ర అందోళనకు గురైంది. రైళ్లు, బస్సులు బంద్ అయిన ఈ సమయంలో ఇతర రాష్ట్రాల వ్యక్తులు తమ ప్రాంతాలకు వెళ్లడం ఎంత కష్టమో, తెలంగాణ సరిహద్ధు వద్ధ ఆంధ్రా విద్యార్థులు వారి స్వరాష్ట్రానికి వెళ్లేందుకు చేసిన ఎంత ఇబ్బంది పడ్డారో అనేది టీవీలో, సోషల్ మీడియాలో చూసి ఆ తల్లి తల్లడిల్లింది.

చిన్నవాడైన తన కొడుకు రాష్ర్ట సరిహద్ధులను దాటుకొని ఇంటికి చేరడమంటే సాధ్యమయ్యే పనికాదని, స్వంతంగా తానే తనయుడి కోసం ఎవ్వరూ చేయని సాహసం చేసింది రజియా బేగం. తన తనయుడు నెల్లూరు జిల్లాలో చిక్కుకున్న వైనాన్ని బోధన్‌ ఏసీపీ జైపాల్‌రెడ్డిని కలిసి పరిస్థితిని వివరించింది. రెండు రాష్ట్రాల సరిహద్ధులు దాటడానికి అనుమతి ఇవ్వాలని మొరపెట్టుకుంది.

ఏసీపీ ఇచ్చిన అనుమతి లేఖ తీసుకుని, 700 కిలో మీటర్ల దూరంలో ఉన్న నెల్లూరుకు బోధన్ నుంచి ఈనెల 6న ఉదయం తన స్కూటీపై బయల్దేరి వెళ్లింది. 7న మధ్యాహ్నం అక్కడకు చేరుకున్నది. కుమారుడితో కలిసి అదే స్కూటీపై సాయంత్రం తిరుగు ప్రయాణమై.. 8 న సాయంత్రం బోధన్ కు చేరుకున్నది. కోవిడ్-19 వ్యాప్తి చెందుతున్న ఈ పరిస్థితులలో తన కొడుకును ఇంటికి తీసుకు రావాలన్న లక్ష్యం తనను 1400 కిలోమీటర్ల దూరాన్ని కుడా దగ్గర చేసిందని రజీయా బేగం అన్నారు. కుమారుడిని ఇంటికి క్షేమంగా తీసుకురావడమే లక్ష్యంగా వెళ్లానని, అటవీ ప్రాంతం గుండా వెళ్లినా భయం అనిపించలేదని ఆమె తెలిపింది. చాలా చోట్లా పోలీసులు ఆపారని, బోధన్‌ ఏసీపీ ఇచ్చిన లెటర్‌ను చూపించడంతో అనుమతించారని వివరించారు. ఈ సందర్భంగా ఆమె పోలీసులకు ధన్యవాదాలు తెలిపారు.

Tags: Razia Begum, Bodhan, Nellore, Scooty ride, Mother and son, ACP, Police, Corona Effect

Advertisement

Next Story