- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- దిశ స్పెషల్స్
- స్పోర్ట్స్
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్ / ట్రెండింగ్
- బిజినెస్
- జాతీయం-అంతర్జాతీయం
- క్రైమ్
- భక్తి
- ఎడిట్ పేజీ
- జిల్లా వార్తలు
TG Govt.: జీపీవో పోస్టులపై సర్కార్ కసరత్తు.. పూర్వ VRO, VRAల నుంచి మళ్లీ ఆప్షన్లు!

దిశ, తెలంగాణ బ్యూరో: గ్రామ పాలన అధికారుల నియామకానికి రాష్ట్ర ప్రభుత్వం కసరత్తు చేస్తున్నది. 10,954 పోస్టుల కోసం పూర్వ వీఆర్వో, వీఆర్ఏల నుంచి మళ్లీ ఆప్షన్లు తీసుకుంటున్నది. గూగుల్ ఫామ్స్ దరఖాస్తులు పూరించి, 16వ తేదీలోపు సమర్పించాలని భూ పరిపాలన ప్రధాన కమిషనర్ నవీన్ మిట్టల్ ప్రకటన జారీ చేశారు. స్వయంగా సంతకం చేసిన కాపీని సంబంధిత కలెక్టర్ల కార్యాలయాల్లో అందజేయాలని సూచించారు. పని స్వభావం, నియమ నిబంధనలతోపాటు పూర్తి వివరాలు వెబ్‌సైట్ https://ccla.telangana.gov.in లో లభిస్తాయని పేర్కొన్నారు.
పునరాలోచనలో పూర్వ వీఆర్వో, వీఆర్ఏలు
జీపీవో పోస్టుల కోసం రాష్ట్ర సర్కారు గతంలోనే పూర్వ వీఆర్వో, వీఆర్ఏల నుంచి ఆప్షన్లు తీసుకున్నది. అయితే ఇప్పుడు మరోసారి గూగుల్ ఫామ్ నింపి సమర్పించాలన్న సూచనల నేపథ్యంలో వారి మధ్య మధ్య చర్చ నడుస్తున్నది. ఇప్పటికే ప్రభుత్వం జీవో నం.129 జారీ చేయగా.. పాత సర్వీసును పరిగణనలోకి తీసుకోమని తేల్చి చెప్పింది. దాంతో ఆప్షన్లు ఇచ్చిన పూర్వ వీఆర్వో, వీఆర్ఏలు ఇప్పుడు పునరాలోచనలో పడ్డారు. ఏదో ఒక శాఖలో పని చేస్తున్నందున, సర్వీసు జీరో చేసుకొని రెవెన్యూ శాఖలోకి వెళ్లడం ద్వారా అదనంగా వచ్చే ప్రతిఫలం ఏం ఉంటుందని ఆలోచిస్తున్నారు. చాలా మంది వీఆర్ఏలు కొంత కాలం క్రితమే పర్మినెంట్ అయ్యారు. ఇందులో ఉన్నత విద్యావంతులు, ఏపీపీఎస్సీ, టీఎస్ పీఎస్సీ ద్వారా పరీక్ష రాసి వీఆర్ఏలుగా డైరెక్ట్ రిక్రూట్ అయిన వారు కూడా ఉన్నారు.
అలాంటి వారు ఇప్పుడు తమ ఉద్యోగానుభవాన్ని కోల్పోవడానికి సిద్ధంగా లేరని సమాచారం. జీపీవో పోస్టుకు ఇంటర్ తో పాటు ఐదేండ్ల రెగ్యులర్ సర్వీస్ ఉండాలన్న షరతు పెట్టారు. మరి ఆ ఐదేండ్ల సర్వీసును పరిగణనలోకి తీసుకోకపోవడం ద్వారా ఎంత నష్టం వాటిల్లుతుందో ఉన్నతాధికారులు ఆలోచించాలని కోరుతున్నారు. ఈ క్రమంలోనే ఈ జీపీవో పోస్టులకు ఎంత మంది గూగుల్ ఫామ్ ద్వారా ఆప్షన్లు ఇస్తారో వేచి చూడాలి. జీవో, నియామకపు ఉత్తర్వుల్లో గ్రామ పాలనాధికారులకు 9 రకాల విధులను డిజైన్ చేశారు. అవన్నీ గతంలో వీఆర్వో, వీఆర్ఏలుగా ఉన్నప్పుడు నిర్వహించినవే కావడం గమనార్హం.
గతంలో ఇచ్చిన ఆప్షన్లు వృథా!
ప్రభుత్వం రెండు నెలల క్రితమే పూర్వపు వీఆర్వో, వీఆర్ఏల నుంచి ఆప్షన్లను స్వీకరించింది. 33 జిల్లాల నుంచి 9,654 మంది గూగుల్ ఫారాల ద్వారా ఆప్షన్ ఇచ్చారు. 5,130 మంది వీఆర్వోల్లో 3,534 మంది, 16 వేల మంది వీఆర్ఏల్లో 5,987 మంది రెవెన్యూలో రావడానికి సిద్ధమయ్యారు. వారందరి వివరాలను కలెక్టర్లు పరిశీలించారు. అడ్మినిస్ట్రేటివ్ ఆఫీసర్లు గూగుల్ ఫారాలను పరిశీలించి యోగ్యులను గుర్తించారు. అయితే రెవెన్యూ శాఖలో జూనియర్ అసిస్టెంట్లుగా, వార్డు ఆఫీసర్లుగా ఉన్న వారు జీపీవోలుగా పని చేయడానికి ఆసక్తి చూపలేదని తెలుస్తున్నది. ఇతర శాఖల్లో వివిధ హోదాల్లో రీ డెప్లాయ్మెంట్ అయిన వారు కూడా రెవెన్యూలోకి వెళ్లి మళ్లీ ఇబ్బందులు ఎదుర్కోవడం ఎందుకన్న అభిప్రాయంతో ఉన్నట్లు సమాచారం. ఇంకొందరేమో రిటైర్మెంట్ కి దగ్గర ఉన్న తాము ఇప్పుడు శాఖ మారడం వల్ల ఎలాంటి ఇబ్బందులు తలెత్తుతాయోనన్న అనుమానంతో ఉన్నారు. ఇప్పుడు సర్వీసు జీరో అనే సరికి గతంలో ఆప్షన్లు ఇచ్చిన వారు కూడా వెనక్కి వెళ్తారన్న ప్రచారం జరుగుతున్నది.