ఏడాదిలో 13,421 భవనాలు, లేఅవుట్లకు అనుమతి

by Mahesh |
ఏడాదిలో 13,421 భవనాలు, లేఅవుట్లకు అనుమతి
X

దిశ, తెలంగాణ బ్యూరో: ఆస్తిపన్ను వసూళ్లలో ఆల్‌టైం రికార్డు నమోదు చేసిన జీహెచ్ఎంసీ టౌన్ ప్లానింగ్ విభాగం ద్వారా కూడా భారీగానే ఆదాయం సమకూర్చుకుంది. గతేడాది కంటే ఎక్కువగానే అనుమతులివ్వడంతో పాటు ఆదాయం వచ్చిందని అధికారులు చెబుతున్నారు. అంతా ఆన్‌లైన్ ద్వారా భవన నిర్మాణ, లేఅవుట్ అనుమతులు, ఆక్యూపెన్సీ సర్టిఫికెట్లను జారీచేస్తున్నారు. 500 చదరపు గజాల స్థలంలో 10 మీటర్ల లోపు భవన నిర్మాణాలకు నేరుగా దరఖాస్తుదారునికే ఇన్‌స్టంట్ రిజిస్ట్రేషన్, ఇన్‌స్టంట్ అప్రూవల్ వస్తోంది. దీంతో ఎక్కడా కూడా పెండింగ్ లేకుండా అనుమతులు జారీ చేస్తున్నారు.

13,421 అనుమతులు.. రూ.1,138 కోట్ల ఆదాయం..

జీహెచ్ఎంసీ పరిధిలో 2024-25 ఆర్థిక సంవత్సరంలో 13,421 అనుమతులు జారీ చేశారు. వీటిలో రెసిడెన్షియల్, కమర్షియల్, హస్పిటల్స్, ఇతర సంస్థలకు సంబంధించిన బహుళ అంతస్తుల భవనాలు కూడా ఉన్నాయి. ఇన్‌స్టంట్ రిజిస్ట్రేషన్స్ 523, ఇన్‌స్టంట్ అప్రూవల్స్ 8,377, సింగిల్ విండో ద్వారా 2,422, ఆరు లేఅవుట్లలో గేటెడ్ కమ్యూనిటీ ఇండ్ల నిర్మాణం, ఐదు ఓపెన్ ప్లాట్ లేఅవుట్లు, ఆక్యుపెన్సీ సర్టిఫికెట్లు జారీ చేశారు. వీటి ద్వారా జీహెచ్ఎంసీకి రూ.1,138.44 కోట్ల ఆదాయం వచ్చింది.

49 అంతస్తుల భవనం..

హైదరాబాద్ మహనగరంలో శేరిలింగంపల్లి జోన్ పరిధిలోని కొండాపూర్‌లో 49 అంతస్తుల భవనానికి జీహెచ్ఎంసీ అనుమతులు జారీ చేసింది. నగరంలో ఇప్పటివరకు ఇదే అత్యధిక ఫ్లోర్లు, ఎత్తు కూడా. నాలుగు సెల్లార్లతో పాటు జీ+49 ఫ్లోర్లతో ఎనిమిది టవర్లు నిర్మించనున్నారు. ఈ భవనం ఎత్తు 165.95 మీటర్లు ఉంటుంది. దీంతో పాటు మరో 102 మల్టీ స్టోర్ బిల్డింగ్స్ బల్దియా అనుమతులు జారీ చేసింది. 2,320 నాన్ హైరైజ్ బిల్డింగ్స్‌కు పర్మిషన్స్ ఇచ్చారు.

Next Story

Most Viewed