సీసీ రోడ్డు వేసి.. కబ్జాలకు సహకరించారా..?

by Aamani |   ( Updated:2025-04-11 07:44:34.0  )
సీసీ రోడ్డు వేసి.. కబ్జాలకు సహకరించారా..?
X

దిశ, పేట్ బషీరాబాద్: ప్రభుత్వ స్థలం పక్కనే ప్రైవేటు పట్టా భూమి ఉన్నది. దశాబ్దాలుగా కొద్దిపాటి భూమి అక్కడ ఖాళీగా ఉంది. ఆ ప్రాంతంలో నాలాకు ఆనుకొని జీహెచ్ఎంసీ సీసీ రోడ్డు నిర్మాణం చేసింది. సరిగ్గా కాలి స్థలం ఎక్కడ వరకు ఉన్నదో అక్కడ వరకు మాత్రమే నిర్మాణం చేసి వదిలేసింది. అనంతరం అక్కడ ఉన్న ఖాళీ స్థలాన్ని ప్లాట్లుగా చేసి నిర్మాణాలు చేసేశారు. ఆ అక్రమ నిర్మాణాలపై ఫిర్యాదు చేసి నెలలు గడుస్తున్న కనీసం చర్యలు లేవని, అసలు పబ్లిక్ యాక్సిస్ లేని చోట సీసీ రోడ్డు ఏ విధంగా వేశారు అంటూ స్థానికులతో కలిసి బిజెపి నేతలు గురువారం గాజులరామారం సర్కిల్ డిప్యూటీ కమిషనర్ మల్లారెడ్డిని నిలదీశారు.

ప్రైవేట్ పట్టా భూమిలో రోడ్డు ఎలా..?

కుత్బుల్లాపూర్ గ్రామ రెవెన్యూ సర్వే నెంబర్ 148 పక్కనే సర్వే నెంబర్ 155 లో గతంలో మొగుళ్ళ చెరువు ఉండేది. దీని విస్తీర్ణం మొత్తం 29 ఎకరాల 10 గుంటలు. దీనికి అనుకొని సర్వే నెంబర్ 148, 149 ప్రైవేటు పట్టా భూమి ఉన్నది. వీటిలో ఉన్న కొంత భాగం చెరువు ఎస్టీఎల్ బఫర్ జోన్ ప్రాంతాలు ఉన్నట్లుగా గ్రామ పట్టం చూస్తే అర్థమవుతుంది. అయితే సర్వే నెంబర్ 148 భూమిలో కొంత భాగాన్ని చెరువు యొక్క బఫర్ జోన్, ఎఫ్ టి ఎల్ ప్రాంతం తో పాటుగా నాలా ఉండటంతో దానిని అలాగే ఖాళీగా వదిలేశారు. అయితే ఇక్కడ కొన్ని నెలల క్రితం గాజులరామారం జిహెచ్ఎంసి ఇంజనీరింగ్ అధికారులు సిసి రోడ్డు వేశారు. ఆ రోడ్డు స్మశాన వాటిక కోసం వేసామని చెబుతున్నప్పటికీ సీసీ రోడ్డు నిర్మాణం ఎక్కడ వరకు అయితే ఖాళీ స్థలం ఉండదు అక్కడ వరకు మాత్రమే వేసి వదిలేశారు. అధికారులు చెబుతున్న దాని ప్రకారం స్మశాన వాటిక కోసం సీసీ రోడ్డు వేస్తున్నట్లయితే అంతవరకు మాత్రమే వేసి ఎందుకు వదిలేశారు..?, ఒకవేళ ఫండ్స్ లేకపోతే పూర్తిస్థాయి నిధులు లేకుండా ఎందుకు పనులు ప్రారంభించారు అనేది ఇక్కడ ప్రశ్న.

అక్రమ నిర్మాణాలపై చర్యలేవి

తొలుత దోబీఘాట్ స్థలంలో అక్రమ నిర్మాణాలు జరుగుతున్నాయని వాటిని వెంటనే అడ్డుకోవాలని స్థానికులు కొందరు గత సంవత్సరంలోని ఫిర్యాదు చేశారు. అనంతరం అది 148 ప్రైవేట్ పట్టా భూమి అని తెలియడంతో అసలు ప్రైవేటు పట్టాలో అనుమతులు లేకుండా ఏ విధంగా నిర్మాణాలు చేస్తారు..? అన్ని సక్రమంగా ఉన్న వాళ్ళు అయితే సరైన అనుమతులు తీసుకుని నిర్మాణాలు చేసుకోవచ్చు కదా..? అని కొన్ని నెలల క్రితమే గాజులరామారం జిహెచ్ఎంసి కార్యాలయంలో బీజేపీ నిజాంపేట్ కార్పొరేషన్ మాజీ అధ్యక్షుడు ఆకుల సతీష్, బిజెపి నాయకులు జయశంకర్ గౌడ్ తదితరులు ఫిర్యాదు చేశారు. అయినప్పటికీ కనీసం వాటి మీద చర్యలు ఎందుకు తీసుకోలేదని, సీసీ రోడ్డు ఏ విధంగా వేస్తారని గురువారం మరోసారి సర్కిల్ కార్యాలయంలో ఫిర్యాదు చేశారు.


గణపతిని కలవండి అని ఎలా చెప్తారు..?

అక్రమ నిర్మాణాలు అని తెలిసినప్పటికీ ఎందుకు చర్యలు తీసుకోవడం లేదంటూ ఫిర్యాదుదారులు గురువారం డిప్యూటీ కమిషనర్ మల్లారెడ్డిని నిలదీశారు. దీనికి స్పందనగా ఆయన సదరు నిర్మాణాలపై రిపోర్ట్ ఇచ్చామని, స్పీకింగ్ ఆర్డర్ సైతం సర్వ్ చేశామని చెప్పుకొచ్చారు. అంతేకాకుండా జోనల్ కార్యాలయంలో “గణపతి” అనే అధికారి ఉంటారని ఆయన్ని కలవాల్సిందిగా ఉచిత సలహా ఇచ్చినట్లుగా ఫిర్యాదుదారులు వాపోతున్నారు. అక్రమ నిర్మాణాలను కూల్చే అధికారం వాళ్ళకి లేకపోయినప్పటికీ కనీసం ఆపగలిగే అధికారం గాజులరామారం సర్కిల్ టౌన్ ప్లానింగ్ అధికారులకు ఉన్నప్పటికీ ఏమాత్రం పట్టించుకోకుండా అక్రమ నిర్మాణాలను ప్రోత్సహించారు అని ఆరోపిస్తున్నారు ఫిర్యాదుదారులు. కేవలం కబ్జాదారులకు సహకరించడానికి లక్షల రూపాయలు వెచ్చించి ఎవరు తిరగని చోట సీసీ రోడ్డు వేసి నిధులను దుబారా చేశారని తీవ్ర ఆరోపణలు చేస్తున్నారు స్థానికులు.





Next Story

Most Viewed