తల్లిని కోమాలోకి పంపించి.. ఆపై ఇద్దరి ప్రాణాలను బలిగొన్న డాక్టర్..!

by Sumithra |
aruna
X

దిశ, ఎల్బీనగర్ : ఎల్బీనగర్ అరుణ హాస్పిటల్‌లో దారుణం చోటుచేసుకుంది. అనస్థీషియా అధికంగా ఇవ్వడంతో గర్భిణీ మహిళ కోమాలోకి వెళ్లింది. దీంతో వైద్యులు హడావుడిగా పలుమార్లు ఆపరేషన్ చేశారు. పరిస్థితి విషమించడంతో వెంటనే అవేర్ గ్లోబల్ ఆస్పత్రికి తరలించారు. దీంతో అక్కడే బాలింత మృతి చెందింది. వివరాల్లోకి వెళితే.. చింతలకుంట ఇంజినీర్స్ కాలనీ ఫేస్-2కు చెందిన సాఫ్ట్‌వేర్ ఇంజినీర్ విజయ్‌తో ప్రతిభ(27)కు గత ఏడాది నవంబర్‌లో వివాహం జరిగింది. గర్భవతి అయిన ప్రతిభను ఎల్బీనగర్ అరుణ ఆసుపత్రిలో శుక్రవారం సాయంత్రం 5 గంటలకు చేర్పించారు. శనివారం ఉదయం ఆమెకు పురిటి నొప్పులు రావడంతో ఆపరేషన్ కోసం సిద్ధం చేశారు. అదే సమయంలో అనస్థీషియా అధికంగా ఇవ్వడంతో గర్భిణీ కోమాలోకి వెళ్ళిపోయింది. దీంతో కంగారు పడ్డ డాక్టర్ అరుణ గర్భిణీ మహిళకు పలుమార్లు ఆపరేషన్ చేసి శిశువును బయటకు తీసింది.

ప్రతిభ పరిస్థితి విషమించడంతో వెంటనే అవేర్ గ్లోబల్ ఆస్పత్రికి తరలించిగా.. అప్పటికే బాలింత మృతి చెందింది. ఈ విషయాన్ని కుటుంబ సభ్యులకు చెప్పకుండా దాచి పెట్టారు. అపస్మారక స్థితిలో ఉన్న మగ శిశువును మలక్‌పేట్‌లోని న్యూ షైన్ ఆస్పత్రికి తరలించారు. సాయంత్రం ఐదు గంటలకు ప్రతిభ మృతి చెందినట్టు కుటుంబ సభ్యులకు తెలియజేశారు. దీంతో ఆగ్రహానికి గురైన బాలింత కుటుంబ సభ్యులు మృతదేహాన్ని అవేర్ గ్లోబల్ ఆస్పత్రిలోనే ఉంచి ఆదివారం ఉదయం అరుణ ఆసుపత్రి ముందు ఆందోళనకు దిగారు. ఆస్పత్రి యాజమాన్యం నిర్లక్ష్యం వల్లే ప్రతిభ ప్రాణాలు కోల్పోయిందని ఆగ్రహం వ్యక్తం చేశారు. శిశువు కూడా మరణించినట్టు తెలియడంతో ఆస్పత్రి యాజమాన్యం పై కఠిన చర్యలు తీసుకోవాలని బాధితులు అరుణ ఆస్పత్రి ఎదుట బైఠాయించారు. విధుల్లో నిర్లక్ష్యంగా వ్యవహరించి ఇద్దరి ప్రాణాలు తీసిన డాక్టర్ అరుణ పై చట్టపరంగా కఠిన చర్యలు తీసుకోవాలని బాధితులు డిమాండ్ చేశారు.

Advertisement

Next Story

Most Viewed