'ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ 'లో తెలుగు రాష్ట్రాల సత్తా!

by S Gopi |
ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ లో తెలుగు రాష్ట్రాల సత్తా!
X

న్యూఢిల్లీ: సులభతర వ్యాపార నిర్వహణ(ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్)కు సంబంధించి రెండు తెలుగు రాష్ట్రాలు మరోసారి మొదటి స్థానాలను కైవసం చేసుకున్నాయి. గురువారం కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారమన్ విడుదల చేసిన 'వ్యాపార సంస్కరణల కార్యాచరణ ప్రణాళిక-2020' నివేదిక ప్రకారం.. ఆంధ్రప్రదేశ్, గుజరాత్, తెలంగాణ రాష్ట్రాలు అగ్రస్థానంలో నిలిచాయి. ముఖ్యంగా వ్యాపార సంస్కరణలను సమర్థవంతంగా అమలు చేయడంలో ఏడు రాష్ట్రాలు ర్యాంకులను సాధించాయి. వాటిలో రెండు తెలుగు రాష్ట్రాలు, గుజరాత్ ముందు వరుసలో ఉన్నాయి.

మిగిలిన స్థానాల్లో హిమాచల్ ప్రదేశ్, ఉత్తరప్రదేశ్, ఒడిశా, మధ్యప్రదేశ్‌లు మెరుగైన ర్యాంకులను సాధించాయి. అలాగే, అభివృద్ధి చెందుతున్న వాణిజ్య విభాగంలో 11 రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాలైన ఢిల్లీ, పుదుచ్చేరి, త్రిపుర రాష్ట్రాలు నిలిచాయి. దేశీయంగానే కాకుండా విదేశీ పెట్టుబడులను రాబట్టే విషయంలో రాష్ట్రాల మధ్య పోటీని పెంచడానికి పరిశ్రమలు, అంతర్గత వాణిజ్య ప్రోత్సాహక విభాగం(డీపీఐఐటీ)తో కలిసి వాణిజ్య మంత్రిత్వ శాఖ 2014 నుంచి ఈ ర్యాంకులను ప్రకటిస్తోంది. వ్యాపారాల సంస్కరణల అమలును బట్టి వీటిని కేటాయిస్తున్నారు. ఇందులో మొత్తం 15 విభాగలు ఉంటాయి. లైసెన్స్, అనుమతులు, ప్రభుత్వ సహకారం, విధానాలు, కార్మికుల వంటి కీలక అంశాలు ఉన్నాయి.

Advertisement

Next Story