ఈ నెలలోనైనా అందేనా..?

by Shyam |
ఈ నెలలోనైనా అందేనా..?
X

దిశ, మహబూబ్ నగర్: లాక్ డౌన్ సమయంలో నిరుపేద, మధ్య తరగతి కుటుంబాలు ఇబ్బంది పడకుండా రాష్ట్ర ప్రభుత్వం రేషన్ కార్డులు ఉన్న ప్రతి కుటుంబానికి రూ.1500తో పాటు 12 కేజీల బియ్యం సరఫరా చేసిన విషయం తెలిసిందే. దీనిని మే మాసానికి కూడా కొనసాగిస్తూ ప్రభుత్వం నిర్ణయం తీసుకోవడంతో ఇప్పటికే అయా జిల్లాలో బియ్యం పంపిణీ కార్యక్రమం మొదలవ్వగా, త్వరలోనే రూ.1500 కూడా వారివారి అకౌంట్లలో జమ చేయనున్నట్లు అధికారులు చెబుతున్నారు. అయితే గత నెల విడుదల చేసిన ప్రభుత్వ ఆర్థిక సాయం చాలా మందికి అందలేదు. వివిధ కారణాలతో ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా 97,718 వేల మంది రేషన్ కార్డు దారులకు రూ.1500 నగదు నేటి వరకు కూడా వారి అకౌంట్లలో జమ కాలేదు. దీంతో ఈ నెల అయినా తమ అకౌంట్లలో ఆ నగదు జమ అవుతుందా..? అని చాలామంది రేషన్ కార్డు దారులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.

అందుతుందో లేదో..

ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లా విషయానికి వస్తే 9,20,565 రేషన్ కార్డులు ఉండగా వారిలో 97,718 మందికి గత నెల ప్రభుత్వ ఆర్థిక సాయం అందలేదు. జిల్లాల వారీగా చూస్తే మహబూబ్ నగర్ జిల్లాలో మొత్తం 2,36,878 రేషన్ కార్డులు ఉండగా అందులో 1,88,046 కార్డు దారులకు బ్యాంకుల ద్వారా, 11,487మందికి పోస్టాఫీసుల ద్వారా ప్రభుత్వ ఆర్థిక సాయం అందగా ఇంకా 37,345 మందికి అందలేదు. అలాగే నాగర్ కర్నూల్ జిల్లాలో 2,34,007 రేషన్ కార్డులు ఉండగా వారిలో 1,97,386 మందికి బ్యాంకు ద్వారా, 15,285 మంది పోస్టాఫీసు ద్వారా సహాయం అందగా 21,336 మంది ఎదురు చూస్తున్నారు. నారాయణపేట జిల్లా విషయానికి వస్తే 1,38,105 కార్డులు ఉండగా అందులో 1,15,634 మంది బ్యాంకుల ద్వారా, 11,350 మందికి పోస్టాఫీసుల ద్వారా సాయం అందగా ఇంకా 11,121 మందికి అందనే లేదు. జోగుళాంబ గద్వాల విషయానికి వస్తే 1,57,410 కార్డులు ఉండగా 1,34,412 కార్డుదారులకు బ్యాంకుల ద్వారా, 9,681 మందికి పోస్టాఫీసు ద్వారా ఆర్థిక సాయం అందగా ఇంకా 13,317మంది ఎదురుచూస్తున్నారు. అదేవిధంగా వనపర్తి జిల్లాలో 1,54,165 మొత్తం రేషన్ కార్డులు ఉండగా నేటికి 14,594 మందికి ఇంకా అందలేదు. దీంతో ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లా వ్యాప్తంగా గత ఏప్రిల్ మాసంలో 9,20,565 రేషన్ కార్డు దారులకు రూ.138 కోట్ల 84 లక్షల 47,500లను ఆర్థిక సాయం అందగా ఇంకా 97,718 మందికి సంబంధించిన రూ.14 కోట్ల 65 లక్షల 77 వేలు నేటికి కూడా కార్డు దారులకు అందలేదు. ఈ నేపథ్యంలో ప్రభుత్వం మే మాసంలో అందించే ఆర్థిక సాయం మాకు అందుతుందో లేదో అనే ఆందోళన రేషన్ కార్డు దారుల్లో నెలకొన్నది.

Tags: Mahabubnagar, ration cards, ration, financial aid, post office

Advertisement

Next Story