ఈ నెల 12 నుంచి మరో 80 ట్రైన్లు

by Shamantha N |   ( Updated:2020-09-05 08:06:34.0  )
ఈ నెల 12 నుంచి మరో 80 ట్రైన్లు
X

న్యూఢిల్లీ: ఈ నెల 12 నుంచి అదనంగా మరో 80 ట్రైన్లను నడపనున్నట్టు రైల్వే బోర్డు ప్రకటించింది. వీటి రిజర్వేషన్ 10వ తేదీ నుంచి మొదలవుతుందని వెల్లడించింది. సెప్టెంబర్ 12 నుంచి 40 జతల స్పెషల్ ట్రైన్‌లను అందుబాటులోకి తెస్తామని, ఇవి ప్రస్తుతం నడుస్తున్న 230 ట్రైన్‌లకు అదనమని రైల్వే బోర్డు చైర్మన్ వినోద్ కుమార్ యాదవ్ తెలిపారు. రాష్ట్రాల అభ్యర్థన మేరకు అవసరమున్న చోట్ల అదనంగా ట్రైన్లను నడిపేందుకు సిద్ధంగా ఉన్నామని అన్నారు.

కేంద్రం అన్‌లాక్ 4 మార్గదర్శకాలు ప్రకటించిన అనంతరం మరిన్ని ట్రైన్‌లను నడపాలని ఇండియన్ రైల్వే ప్రణాళికలు వేస్తున్నది. ప్రస్తుతం రాష్ట్ర ప్రభుత్వాలతో సంప్రదింపులు జరుపుతున్నది. లాక్‌డౌన్ కారణంగా మార్చి 25న రైల్వే సేవలు నిలిచిపోయిన సంగతి తెలిసిందే. అనంతరం పలురాష్ట్రాల్లో చిక్కుకున్న వలసకార్మికులను సొంతూళ్లకు తరలించడానికి మే 1వ తేదీ నుంచి శ్రామిక్ ట్రైన్‌లను రైల్వే శాఖ నడిపింది. మే 12వ తేదీ నుంచి 15 జతల స్పెషల్ ఎయిర్ కండీషన్డ్ ట్రైన్‌ల సేవలను అందుబాటులోకి తెచ్చింది. జూన్ 1వ తేదీ నుంచి 100 జతల షెడ్యూల్డ్ ట్రైన్‌ల సేవలను ప్రారంభించింది. తాజాగా, ఈ నెలలో మరో 80 ట్రైన్‌లను నడపనున్నట్టు ప్రకటించింది.

Advertisement

Next Story

Most Viewed