ప్ర‌స‌వం కోసం భార్య భార‌త్ కు.. దుబాయ్ లో భ‌ర్త మృతి

by vinod kumar |
ప్ర‌స‌వం కోసం భార్య భార‌త్ కు.. దుబాయ్ లో భ‌ర్త మృతి
X

దుబాయి: తండ్రి కాబోతున్నాననే ఆనందంలో గడుపుతున్నాడు… అంత‌లోనే తిరిగిరాని లోకాల‌కు వెళ్లిపోయాడు. భ‌ర్త మ‌ర‌ణించాడ‌న్న విష‌యం తెలుసుకున్న భార్య బోరుమంది. త‌నకు పుట్ట‌బోయే బిడ్డ‌కు దిక్కెవ‌రు అంటూ ఆమె రోదించింది.

కేర‌ళ‌కు చెందిన నితిన్ చంద్ర‌న్(28), అథిరా గీతా శ్రీధ‌ర‌న్(27) దంప‌తులు. ఉద్యోగ‌రీత్యా వీరిద్ద‌రూ దుబాయిలో సెటిల‌య్యారు. గీతా శ్రీధ‌ర‌న్ ఏడు నెల‌ల గ‌ర్భిణి కావ‌డంతో.. ప్ర‌స‌వం కోసం ఆమెను మే 7వ తేదీన వందే భార‌త్ మిష‌న్ లో భాగంగా ఏర్పాటు చేసిన ప్ర‌త్యేక విమానంలో కేర‌ళ‌కు పంపించాడు భ‌ర్త‌. అయితే నితిన్ కు ఇటీవ‌ల బీపీ పెర‌గ‌డంతో.. అత‌ను చికిత్స తీసుకుంటున్నాడు. ఈ క్ర‌మంలోనే గుండెనొప్పితో నిద్ర‌లోనే నితిన్ మృతి చెందాడు. దీంతో భార్య‌ శ్రీధ‌ర‌న్ తో పాటు కుటుంబ స‌భ్యులు క‌న్నీరు పెట్టుకున్నారు. భార్య ఇండియాకు వ‌చ్చిన నెల రోజుల‌కు భ‌ర్త చ‌నిపోయాడు.
నితిన్ మృత‌దేహాన్ని ఇంట‌ర్నేష‌న‌ల్ సిటీలోని ర‌షీద్ ఆస్ప‌త్రికి త‌ర‌లించారు. అత‌ని ర‌క్త‌న‌మూనాల‌ను సేక‌రించి కొవిడ్-19 ప‌రీక్ష‌ల‌కు పంపించారు. క‌రోనా నెగిటివ్ వ‌స్తేనే మృత‌దేహాన్ని కుటుంబ స‌భ్యుల‌కు అప్ప‌గిస్తామ‌ని దుబాయి అధికారులు తెలిపారు.

వార్త‌ల్లో నిలిచిన శ్రీధ‌ర‌న్

లాక్ డౌన్ కార‌ణంగా అంత‌ర్జాతీయ విమానాల రాక‌పోక‌ల‌పై ఆంక్ష‌లు విధించిన విష‌యం తెలిసిందే. మార్చిలోనే ఇండియాకు రావాల్సిన శ్రీధ‌ర‌న్ ప్ర‌యాణం వాయిదా ప‌డింది. దీంతో తాను గ‌ర్భిణిగా ఉన్నాన‌ని.. స్వదేశానికి తీసుకెళ్లమంటూ గ‌త నెల‌లో గీతా.. భార‌త అత్యున్న‌త న్యాయ‌స్థానంలో పిటిష‌న్ దాఖ‌లు చేసి వార్త‌ల్లో నిలిచింది. ఈ ఏడాది జులై మొద‌టి వారంలోనే త‌న‌కు డెలివ‌రీ డేట్ ఇచ్చార‌ని.. త‌న భ‌ర్త ఉద్యోగానికి వెళ్తే.. చూసుకునే వారెవ‌రూ లేర‌ని ఆమె పిటిష‌న్ లో పేర్కొంది. మొత్తానికి వందే భార‌త్ మిష‌న్ ప్ర‌త్యేక విమానంలో ఆమెకు ఇండియాకు వ‌చ్చింది.

ప్రస్తుత పరిస్థితుల్లో తన భార్యతో కలిసి వెళ్లలేకపోతున్నానని చంద్రన్ గ‌తంలో ఆవేదన వ్యక్తం చేశాడు. యూఏఈలోని వలస కార్మికులకు సంబంధించిన యూత్ వింగ్ సహాయంతోనే సుప్రీంకోర్టులో ఆమె పిటిష‌న్ దాఖ‌లు చేసింది.

Advertisement

Next Story

Most Viewed