బస్సు సీట్ల కింద కోటి నగదు

by srinivas |   ( Updated:2020-03-12 06:15:17.0  )
బస్సు సీట్ల కింద కోటి నగదు
X

కోటి రూపాయల నగదుతో గుంటూరు జిల్లాకు చెందిన వ్యక్తి చెన్నైలో పట్టుబడిన ఘటన కలకలం రేపుతోంది. ఘటన వివరాల్లోకి వెళ్తే.. చెన్నై సమీపంలోని ఎళావూరు మీదుగా హెరాయన్‌, గంజాయి, ఎర్రచందనం వంటివి అక్రమ రవాణా జరుగుతున్నట్టు ఆరంబాక్కం పోలీసులకు సమాచారం అందింది. దీంతో చెన్నై మెట్రోపాలిటన్ రీజియన్‌లోని గుమ్మిడిపూండి వద్ద పోలీసులు తనిఖీలు నిర్వహించారు. ఆ దిశగా వెళ్తున్న వాహనాలను క్షుణ్ణంగా తనిఖీలు చేశారు. ఈ క్రమంలో విజయవాడ నుంచి చెన్నై వైపు వెళ్తున్న ఓ ప్రైవేటు లగ్జరీ బస్సులో తనిఖీలు నిర్వహించగా, సీట్ల కింద రెండు సంచుల్లో కోటి రూపాయల నగదును గుర్తించారు. ఈ నగదుతో పాటు గుంటూరు జిల్లా చిలకలూరుపేటకు చెందిన సాంబశివరావును అదుపులోకి తీసుకోగా, కుమార్తె వివాహం కోసం నగలు కొనుగోలు చేసేందుకు వెళ్తున్నానని తెలిపాడు. దీంతో అతనిపై కేసు నమోదు చేసిన పోలీసులు చెన్నై ఆదాయపు పన్ను శాఖ అధికారులకు సమాచారం అందించారు. వారు విచారణ జరుపుతున్నారు.

tags :one crore money, money in the bus, chennai, guntur, sambasiva rao

Advertisement

Next Story

Most Viewed