‘పీఎం కేర్స్ ఫండ్’ ప్రభుత్వ పరిధిలో లేదు: పీఎంవో

by Shamantha N |
‘పీఎం కేర్స్ ఫండ్’ ప్రభుత్వ పరిధిలో లేదు: పీఎంవో
X

న్యూఢిల్లీ: కొవిడ్ 19పై పోరాడే ఉద్దేశంతో పెద్దమొత్తంలో విరాళాలు సేకరించిన పీఎం కేర్స్ ఫండ్.. ప్రభుత్వ పరిధిలో లేదని ప్రధాని కార్యాలయం వెల్లడించింది. ముగ్గురు కేంద్ర క్యాబినెట్ మంత్రులు ట్రస్టీలుగా, స్వయాన ప్రధాని ట్రస్ట్‌కు ఎక్స్ అఫీషియో చైర్మెన్‌గా ఉన్న ఈ పీఎం కేర్స్ ఫండ్ ప్రభుత్వ పరిధిలో లేదని ప్రకటించడం గమనార్హం. పీఎం కేర్స్ ఫండ్‌కు సంబంధించిన సమాచారం వెల్లడించాలని అజీమ్ ప్రేమ్‌జీ యూనివర్సిటీ స్టూడెంట్ హర్ష కందుకూరి ఆర్టీఐ దాఖలు చేశారు. దీనికి సమాధనంగా ఆర్టీఐ 2005లోని సెక్షన్ 2(హెచ్) ప్రకారం ఈ నిధి పబ్లిక్ అథారిటీగా పరిగణించలేమని ప్రధాని కార్యాలయం వెల్లడించింది. కరోనాపై పోరులో భాగంగా ఈ నిధిని మార్చి 28న ఏర్పాటు చేశారు. కొన్ని రిపోర్టుల ప్రకారం పీఎం కేర్స్ ఫండ్‌కు ప్రధాని ఎక్స్ అఫీషియో చైర్మన్‌గా, మంత్రులు అమిత్ షా, రాజ్‌నాథ్ సింగ్, నిర్మలా సీతారామన్‌లు ట్రస్టు సభ్యులుగా కొనసాగుతున్నారు. ఈ విషయమై ఆర్టీఐ దాఖలు చేసిన హర్ష మాట్లాడుతూ, ఈ సమాచారాన్ని నిరాకరిండచమంటే పారదర్శకతను నిరాకరించడమేనని, సమాచార హక్కను కాలరాయడమేనని ఆరోపించారు. పీఎం కేర్స్ ఫండ్‌ పేరు, ఎంబ్లం, ప్రభుత్వ డొమైన్ నేమ్, ట్రస్టు సభ్యులు, నియంత్రణలాంటి విషయాలన్నీ ఇది ప్రభుత్వ నిధి అనే సూచిస్తున్నాయని తెలిపారు. ఈ నిధికి సంబంధించి నిర్ణయాలపై నియంత్రణ, అధికారాలు ఎవరికి ఉన్నాయో తెలియడం లేదని, ఈ పేరుతో సేకరించిన పెద్దమొత్తాన్ని ఎలా వినియోగించనున్నారో అనే విషయమూ తీవ్ర ఆందోళన కలిగిస్తున్నదని వివరించారు. ‘ప్రధాని జాతీయ సహాయక నిధి’(పీఎం నేషనల్ రిలీఫ్ ఫండ్) ఉండగా, పీఎం కేర్స్ ఫండ్ అవసరమేంటని ప్రతిపక్షాలు మొదటి నుంచీ ప్రశ్నిస్తున్న విషయం తెలిసిందే.

Advertisement

Next Story

Most Viewed