ఎన్నాళ్లకెన్నాళ్లకు.. పట్టాలెక్కనున్న MMTS

by Shyam |   ( Updated:2021-06-20 10:56:47.0  )
mmts 1
X

దిశ, తెలంగాణ బ్యూరో : మహానగరంలో ఎంఎంటీఎస్ రైళ్ల రాకపోకలకు ఎట్టకేలకు గ్రీన్ సిగ్నల్ లభించింది. వచ్చే వారం నుంచి ఈ రైళ్లు పట్టాలెక్కనున్నాయి. కొవిడ్ వ్యాప్తి తగ్గుతున్న తరుణంలో రైల్వే శాఖ ఈ నిర్ణయం తీసుకుంది. కరోనా కారణంగా గతేడాది మార్చి 16వ తేదీన రైల్వే శాఖ సర్వీసులను నిలిపివేసింది. దాదాపు 15 నెలల సుదీర్ఘ సమయం అనంతరం ఎంఎంటీఎస్ సర్వీసులకు మోక్షం లభించనుంది. దీంతో ప్రయాణికుల కష్టాలు తీరనున్నాయి. నగరవాసులకు ట్రాఫిక్ బాధలు కూడా తప్పనున్నాయి. సామాన్యుడిపై పడిన పెట్రో భారం సైతం తగ్గనుంది. ఇదిలాఉండగా కొవిడ్ కారణంగా గతేడాది మార్చి 16 నుంచి సర్వీసులు నిలిపివేయగా రైల్వేశాఖకు భారీ నష్టం ఏర్పడింది. ప్రతిరోజు సగటున లక్షన్నర నుంచి రెండు లక్షల మంది ఎంఎంటీఎస్ లో ప్రయాణించేవారు. అలా రోజుకు రూ. లక్షల ఆదాయం వచ్చేది. సర్వీసులు రద్దు చేయడంతో ఇప్పటి వరకు దాదాపు రూ.41 కోట్లకు పైగా నష్టాన్ని మూటగట్టుకుంది.

మూడు లైన్లలో సర్వీసులు..

మహానగరంలో మూడు లైన్లలో మల్టీ మోడల్ ట్రాన్స్ పోర్ట్ సిస్టమ్(ఎంఎంటీఎస్) సర్వీసులు నడుపుతోంది. సికింద్రాబాద్-లింగంపల్లి, హైదరాబాద్(నాంపల్లి)–లింగంపల్లి, సికింద్రాబాద్–ఫలక్‌నుమా మార్గాల్లో దక్షిణ మధ్య రైల్వే ఈ సర్వీసులను కొనసాగిస్తోంది. ఈ మూడు లైన్లలో 50 కిలోమీటర్ల దూరం రాకపోకలు సాగించి ప్రయాణికులను వారి గమ్యస్థానాలకు సురక్షితంగా చేరుస్తోంది ఎంఎంటీఎస్. జంట నగరాల్లోని 29 స్టేషన్ల ద్వారా ప్రజల దూరాన్ని చెరిపివేస్తూ అతి తక్కువ సమయంలో గమ్యాలకు చేర్చి హైదరాబాద్ వాసుల మనసు గెలుచుకుంది. అలాంటిది కొవిడ్ కారణంగా ఎంఎంటీఎస్ సర్వీసులను రద్దు చేస్తూ రైల్వే శాఖ నిర్ణయం తీసుకోవడంతో రైళ్లు షెడ్డుకే పరిమితమయ్యాయి. ఫస్ట్ వేవ్ లాక్ డౌన్ ఎత్తేసినా కూడా సర్వీసులు ప్రారంభించకపోవడంతో ప్రయిణికులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారు.

తీరనున్న ప్రయాణికుల కష్టాలు..

వచ్చే వారం ఎంఎంటీఎస్ రైళ్లను ప్రారంభిస్తామని రైల్వే శాఖ తీసుకున్న నిర్ణయంతో ప్రయాణికుల కష్టాలు తీరనున్నాయి. దాదాపు 15 నెలలుగా షెడ్డుకే పరిమితమై రైళ్లు పట్టాలెక్కడంతో ప్రయాణికుల మార్గం మరింత సుగమం కానుంది. ఇన్నిరోజులు ఎంఎంటీఎస్ సర్వీసులు లేకపోవడంతో నగరవాసులు గమ్య స్థానాలకు చేరుకునేందుకు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారు. ఫస్ట్ వేవ్ అనంతరం ప్రభుత్వం ప్రైవేట్ వాహనాలు, ఆర్టీసీ, మెట్రో సర్వీసులను పునురుద్ధరించినా ఎంఎంటీఎస్ రైళ్లను మాత్రం కొనసాగించలేదు. కార్యాలయాలు తెరుచుకోవడంతో అక్కడి వరకు చేరుకునేందుకు చిరుద్యోగులు ఇబ్బంది పడ్డారు. వ్యాపారులు సైతం సామగ్రి తెచ్చుకునేందుకు కష్టాలు ఎదుర్కొన్నారు. రైల్వేశాఖ తాజా నిర్ణయంతో చిరుద్యోగుల కష్టాలు తీరనున్నాయి. సామాన్యులకు సైతం ట్రాఫిక్ ఇబ్బందులు తప్పనున్నాయి.

ట్రాఫిక్ సమస్యలకు చెక్..

ఇన్నిరోజులు ఎంఎంటీఎస్ రైళ్లు నడవకపోవడంతో నగరవాసులకు ప్రయాణం భారంగా మారింది. తాజాగా రైల్వే శాఖ తీసుకున్న నిర్ణయంతో ఈ రైళ్లు ప్రారంభమైతే జంట నగరాల్లో ట్రాఫిక్ సమస్యకు కొంతమేర చెక్ పడనుంది. లాక్ డౌన్ కారణంగా ఇన్నిరోజులు ఉద్యోగులు, వ్యాపారులు, సామాన్యులు తమ సొంత వాహనాల్లో రాకపోకలు సాగించారు. ప్రైవేట్ ట్రాన్స్ పోర్ట్ సౌకర్యం ఉన్నా ఒకరి నుంచి వైరస్ మరొకరికి వ్యాప్తి చెందే అవకాశం ఉండటంతో ఆ భయానికి సొంత వాహనాలకే ప్రయాణికులు మొగ్గు చూపారు. దీని ద్వారా రోడ్లపై విచ్చలవిడిగా వాహనాలు పెరిగిపోయి జనం ట్రాఫిక్ సమస్యను ఎదుర్కొన్నారు. ఎంఎంటీఎస్ సేవలు కొనసాగితే కాలుష్యాన్ని కూడా నివారించవచ్చు.

అతి తక్కువ ధరలోనే ప్రయాణం..

జంట నగరవాసులకు ట్రాన్స్ పోర్ట్ ఇబ్బందులు తొలగించేందుకు రైల్వే శాఖ 2003లో ఎంఎంటీఎస్ సర్వీసులను ప్రారంభించింది. సికింద్రాబాద్-లింగంపల్లి, హైదరాబాద్(నాంపల్లి)–లింగంపల్లి, సికింద్రాబాద్–ఫలక్‌నుమా మార్గాల్లో ఈ రైళ్లు సేవలందించాయి. ఈ మూడు లైన్లలో ఎంఎంటీఎస్ రైళ్లు 50 కిలోమీటర్ల దూరం రాకపోకలు సాగించి ప్రయాణికులను వారి గమ్యస్థానాలకు సురక్షితంగా చేరుస్తున్నాయి. మహానగరంలో 29 స్టేషన్ల ద్వారా ఈ సర్వీసులు కొనసాగుతున్నాయి. ప్రాంరంభంలో 48 సర్వీసులతో ప్రారంభమైన ఎంఎంటీఎస్ క్రమంగా 121 సర్వీసులకు పుంజుకుంది. అయితే ఒక స్టేషన్ నుంచి మరొక స్టేషన్ కు కనీస టికెట్ ధర రూ.5 ఉండగా ప్రయాణ దూరాన్ని బట్టి గరిష్టంగా రూ.15గా ఉంది. ఈ రైళ్ల రద్దుతో సామాన్యుడిపై భారం ఎక్కువైంది.

భారీగా ఆదాయం..

కొవిడ్కు ముందు ఎంఎంటీఎస్ రైళ్లు జంట నగరాల్లో విస్తృత సేవలు అందించాయి. టికెట్ ధరలు కనిష్టంగా రూ.5 ఉండగా.. గరిష్ట టికెట్ ధర రూ.15గా ఉండేది. ఈ నేపథ్యంలో ఉద్యోగులు, విద్యార్థులు, ఇతర ప్రయాణికులు వీటిలో ప్రయాణానికి మొగ్గుచూపేవారు. నిత్యం లక్షన్నర నుంచి రెండు లక్షల మంది ఎంఎంటీఎస్లో రాకపోకలు సాగించేవారు. అలా రోజుకు సుమారు రూ.9 లక్షల వరకు ఆదాయం రైల్వేశాఖకు వచ్చేది. నెలకు కనీసం రూ.2 కోట్ల 70 లక్షలకు పైగా రైల్వే శాఖకు లభించేది. అయితే కరోనా కారణంగా ఫస్ట్ వేవ్ లాక్ డౌన్ సమయంలో అన్ని సర్వీసులను రద్దు చేస్తూ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. గతేడాది మార్చి నుంచి నేటి వరకు ఎంఎంటీఎస్ రైళ్లు షెడ్డుకే పరిమితమయ్యాయి. ఇదిలా ఉండగా ఇప్పటికే కొవిడ్ ప్రభావం ఎక్కువగా ఉన్న పలు నగరాల్లో ఎంఎంటీఎస్ సేవలు మొదలయ్యాయి. ఈ నేపథ్యంలో హైదరాబాద్‌లో 15 నెలలుగా నిలిచిపోయిన ఎంఎంటీఎస్ రైళ్లు పట్టాలెక్కబోతున్నాయి. దీంతో తిరగి శాఖకు భారీగా ఆదాయం సమకూరే అవకాశాలున్నాయి.

సర్వీసుల రద్దుతో నష్టాల్లో రైల్వేశాఖ..

కరోనా వైరస్ ప్రపంచాన్ని కుదిపేసింది. ఎన్నో దేశాలు ఈ వైరస్ ధాటికి నష్టాలను చవిచూశాయి. వైరస్ వ్యాప్తికి అడ్డుకట్ట వేసేందుకు ప్రభుత్వాలు లాక్ డౌన్ అస్త్రాన్ని ప్రయోగించడంతో ప్రజా రవాణాకు సైతం బ్రేక్ పడింది. ఈ కారణంగా రైల్వే శాఖ తీవ్ర నష్టాలను చవిచూసింది. జంట నగరాల్లో ఎంఎంటీఎస్ సర్వీసులను రద్దు చేయగా ప్రతిరోజు కనీసం రూ.9 లక్షలకు పైగా ఆదాయం కోల్పోయింది రైల్వే శాఖ. అలా ఒక్కో నెలకు కనీసం రూ. రెండు కోట్ల డెభై లక్షలకు పైగా ఆదాయాన్ని నష్టపోయింది. 15 నెలలుగా ఎంఎంటీఎస్ రైళ్లు షెడ్డుకే పరిమితం కావడంతో దాదాపు రూ.41 కోట్లకు పైగా దక్షిణ మధ్య రైల్వే నష్టపోయింది. వచ్చే వారం ఈ సర్వీసులను పునరుద్ధరిస్తుండటంతో తిరిగి నష్టాలను పూడ్చుకునేందుకు రైల్వే శాఖ ప్రణాళికలు ఏర్పాట్లు చేస్తోంది.

15 నెలలుగా షెడ్డుకే పరిమితం..

కరోనా ఫస్ట్ వేవ్ సమయంలో వైరస్ ను అరికట్టేందుకు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు లాక్ డౌన్ విధించాయి. దీంతో ప్రజారవాణా స్తంభించిపోయింది. దీంతో గతేడాది మార్చి నుంచి నేటి వరకు 15 నెలలుగా ఎంఎంటీఎస్ రైళ్లు షెడ్లకే పరిమితమయ్యాయి. జంట నగరాలు, శివారు ప్రాంతాల ప్రజలకు, రోజూ కార్యాలయవాలకు వెళ్లే వారికి ఈ సర్వీసులు ఎంతగానో ఉపయోగపడేవి. గరిష్టంగా కేవలం రూ.15 టిక్కెట్ తో దాదాపు 50 కిలోమీటర్ల వరకు ప్రయాణించే ఫెసిలిటీని దక్షిణ మధ్య రైల్వే కల్పించింది. ట్రాఫిక్ కష్టాలు లేకుండా సురక్షితంగా ప్రయాణించేందుకు ఎంతో మంది సాఫ్ట్ వేర్ ఉద్యోగులు, చిరు వ్యాపారులు ఈ రైళ్లలో ప్రయాణించేందుకే మొగ్గు చూపేవారు. 15 నెలలుగా షెడ్డుకే పరిమితం కావడంతో ఇంజిన్ల పరిస్థితి ఎంతమేరకు కండిషన్లో ఉన్నాయో తెలియని పరిస్థితి ఏర్పడింది. ఇప్పటికే రూ.కోట్లల్లో నష్టపోయిన రైల్వేశాఖ రిపేర్ల కోసం ఎంత వెచ్చించనుందో తెలియాల్సి ఉంది.

సామాన్యుడికి తప్పనున్న పెట్రో బాదుడు..

ఎంఎంటీఎస్ రద్దుతో చిరు ఉద్యోగులు, అరకొర వేతనాలతో బతుకుబండిని నడిపే సామాన్యులపై ఆర్థిక భారం విపరీతంగా పెరిగిపోయింది. కార్యాలయాలకు వెళ్లేందుకు ఇన్నిరోజులు తమ సొంత వాహనాలను వినియోగించారు. అంతర్జాతీయ మార్కెట్ లో చమురు ధరలు మండిపోతున్నాయి. దీంతో దేశంలో లీటర్ పెట్రోల్ ధర సెంచరీని దాటింది. గతంలో రూ.5 నుంచి 15 రూపాయల్లో గమ్యస్థానాలు చేరే సామాన్యులపై పెట్రో భారం పడింది. బస్సుల్లో వెళ్దామంటే ట్రాఫిక్ కారణంగా కార్యాలయాలకు చేరుకునే సమయం దాటిపోతుంది. ప్రైవేట్ వాహనాల్లో వెళ్దామంటే ఎవరికి కరోనా ఉందో తెలియని పరిస్థితి. ఈ ఇబ్బందులు తగ్గించుకునేందుకు సొంత వాహనాల్లో వెళ్దామన్నా పెట్రో మంట. ఇలా సామాన్యుడి సగం జీతం రవాణా ఖర్చులకే సరిపోయింది. రైల్వేశాఖ మరో వారంలో ఎంఎంటీఎస్ సర్వీసులు ప్రారంభిస్తానని చెప్పడంతో సామాన్యుడికి సమయం వృథా కాకుండా ఉంటుంది. అంతేకాకుండా డబ్బు కూడా ఆదా అయ్యే అవకాశముంది.

రైల్వేశాఖ మంత్రికి కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి ధన్యవాదాలు..

కరోనా నిబంధనలను పాటిస్తూ ఎంఎంటీఎస్ సర్వీసులను తిరిగి పునరుద్ధరించాలని రైల్వే శాఖ నిర్ణయించింది. ఈ విషయమై కేంద్ర హోం శాఖ సహాయం మంత్రి కిషన్ రెడ్డి స్పందించారు. దిగువ, మధ్య తరగతి ప్రజలకు, చిరు వ్యాపారులకు, విద్యార్థులు, ఉద్యోగులు, ఇతర రంగాలకు చెందిన వారందరికీ చవకైన, సురక్షితమైన రవాణా సదుపాయాన్ని రైల్వేశాఖ తిరగి అందుబాటులోకి తీసుకురావడంతో ఆయన హర్షం వ్యక్తం చేశారు. ప్రజలందరూ కరోనా నియమాలను పాటిస్తూ, తగిన జాగ్రత్తలు తీసుకుంటూ ఎంఎంటీఎస్ సేవలను వినియోగించుకోవాలని కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి కోరారు. సర్వీసుల పునరుద్ధరణకు అంగీకరించిన కేంద్ర రైల్వే శాఖ మంత్రి పీయూశ్ గోయల్‌కు ఆయన ధన్యవాదాలు తెలిపారు.

Advertisement

Next Story