సింగరేణి సెగ: ఎమ్మెల్సీ కవితక్క వర్సెస్ ఎమ్మెల్యే సీతక్క

by Anukaran |   ( Updated:2021-07-16 11:23:05.0  )
సింగరేణి సెగ: ఎమ్మెల్సీ కవితక్క వర్సెస్ ఎమ్మెల్యే సీతక్క
X

దిశ ప్రతినిధి, ఖమ్మం: సింగరేణిని తన గుప్పిట్లో పెట్టుకున్న అధికార పార్టీకి ఇక చుక్కెదురేనా..? ‘గుర్తింపు సంఘం’ గడువు ముగిసినా ఇంకా ఎన్నికలకు వెళ్లకపోవడానికి కారణం అదేనా..? అనివార్య పరిస్థితుల్లో ఎన్నికలకు వెళ్తే టీబీజీకేఎస్‌కు పరాభవం తప్పదా..? రేవంత్ పీసీసీ బాధ్యతలు చేపట్టాక కాంగ్రెస్ అనుబంధ కార్మిక సంఘం ఐఎన్టీయూసీ భారీగా పుంజుకోనుందా..? అసలు సింగరేణిలో ఎన్నికలు నిర్వహిస్తే.. కవితక్క వర్సెస్ సీతక్క అన్నట్లు పోటీ తప్పదా..? సింగరేణిలో ఈసారి ఐఎన్టీయూసీ తాడోపేడో తేల్చుకోనుందా..? అంటే నల్లసూరీళ్ల నుంచి అవుననే సమాధానం వస్తోంది..

సింగరేణిలోని అన్ని కార్మిక సంఘాల్లో సందడి నెలకొంది. ఎప్పుడైనా సరే ఎన్నికలు నిర్వహించే అవకాశాలు స్పష్టంగా కనిపిస్తున్నాయి. దీంతో పోటీకి సిద్ధమయ్యే అన్ని సంఘాలు ఇప్పటినుంచే గ్రౌండ్ వర్క్ చేసుకుంటున్నాయి. ముఖ్యంగా అధికార పార్టీకి అనుబంధంగా ఉన్న, గత ఎన్నికల్లో గుర్తింపు సంఘంగా గెలుపొందిన టీబీజీకేఎస్(తెలంగాణ బొగ్గుగని కార్మిక సంఘం) తాజా పరిస్థితులపై ఉలిక్కి పడుతున్నట్లు కార్మిక వర్గాల్లో ప్రచారం జరుగుతోంది. ఓ పక్క ఎన్నికలను ఇంతకాలం వాయిదా వేస్తూ వచ్చినా ఇక తప్పేట్టు లేకపోవడం.. మరోవైపు కాంగ్రెస్ అనుబంధ ఐఎన్టీయూసీ గౌరవ అధ్యక్షురాలిగా సీతక్కను నియమించబోతున్నట్లు వార్తలు రావడంతో ఏం చేయాలో అర్థం కాని పరిస్థితుల్లో టీబీజీకేఎస్ నేతలు ఉన్నట్లు తెలుస్తోంది.

కవితకు చెక్ పెట్టేందుకే తెరపైకి సీతక్క..

ఖమ్మం, వరంగల్, ఆదిలాబాద్, కరీంనగర్ జిల్లాల్లో విస్తరించి ఉన్న సింగరేణి వ్యాప్తంగా ఉన్న కార్మిక సంఘాలు ఎన్నికల కోసం ఎప్పటి నుంచో పట్టుబడుతున్నాయి. అయితే చేతిలో ఉన్న అధికారంతో ఎన్నికలను ప్రభుత్వం, గుర్తింపు సంఘం వాయిదా వేస్తూ వస్తున్నాయి. ఈ క్రమంలో సింగరేణిలో టీబీజీకేఎస్ పూర్తి ఆధిపత్యం చేలాయించే దిశగా ఆ సంఘానికి గౌరవ అధ్యక్షురాలిగా ఉన్న ఎమ్మెల్సీ కవిత వ్యూహాలు రచిస్తోంది. మరోవైపు కోల్ బెల్ట్ పై పూర్తి పట్టున్న సీతక్కను కాంగ్రెస్ అనుబంధ ఐఎన్టీయూసీ గౌరవ అధ్యక్షురాలిగా నియమిస్తే కేసీఆర్ కూతురికి మొదట చెక్ పెట్టొచ్చని రేవంత్ టీం ఆలోచన. అంతేకాదు.. గతంలో కూడా సీతక్క సింగరేణి కార్మికుల తరఫున అనేక పోరాటాలు చేశారు. అసెంబ్లీలో సైతం తన గళాన్ని వినిపించారు. సింగరేణి గనులున్న భూపాలపల్లి, మణుగూరు, ఇల్లెందు, కొత్తగూడెం తదితర ప్రాంతాల్లోని కార్మికులతో ఆమెకు సన్నిహిత సంబంధాలున్నాయి.

కోల్ బెల్ట్ ఏరియాతో మంచి అనుబంధం..

ఇక గత ఎన్నికల్లో భూపాలపల్లి, కొత్తగూడెం, భద్రాచలం, పినపాక, ఇల్లెందు స్థానాల్లోనే కాంగ్రెస్ పార్టీ తరఫునే అభ్యర్థులు గెలుపొందారు. అందుకే ఆ ప్రాంత కార్మికులకు హస్తం పార్టీతో మంచి అనుబంధం ఉంది. ముఖ్యంగా కవితను ఎదుర్కోవాలంటే మంచి వాక్చాతుర్యం, పోరాటపటిమ, సింగరేణి ఏరియాలతో మంచి అనుబంధం ఉన్న సీతక్క అయితేనే కరెక్టు అనే భావనతో రేవంత్ టీం ముందుకెళ్తున్నట్లు తెలుస్తోంది. ఆమెను ఐఎన్టీయూసీకి గౌరవ అధ్యక్షురాలిగా నియమిస్తే కార్మిక సంఘం మరింత పటిష్టంగా తయారై.. ఇతర సంఘాల్లోకి వెళ్లిన వారు సైతం తిరిగొస్తారనే నమ్మకంతోనే సీతక్కకు కీలక బాధ్యతలు అప్పగిస్తున్నట్లు తెలుస్తోంది.

పదవీ కాలం ముగిసినా..!

టీబీజీకేఎస్ గుర్తింపు సంఘంగా కాల పరిమితి ముగిసినప్పటికీ ఎన్నికలకు వెళ్లేందుకు సిద్ధపడకపోగా.. నాలుగేళ్ల కాలపరిమితి అంటూ బుకాయిస్తూ వచ్చింది. వాస్తవానికి 2017 అక్టోబర్ 5వ తేదీన సింగరేణి గుర్తింపు సంఘం ఎన్నికలు నిర్వహించారు. ఆ ఎన్నికల్లో టీఆర్ఎస్ అనుబంధ సంఘం టీబీజీకేఎస్ ఎన్నికల్లో గెలుపొందింది. 2019 అక్టోబర్ 5నాటికే కాల పరిమితి పూర్తయింది. అయితే మొదట నాలుగేళ్ల కాలపరిమితికి ఎన్నికలు జరిపేందుకు అన్ని సంఘాలు మొగ్గుచూపినప్పటికీ కేంద్ర కార్మిక శాఖ మాత్రం టీబీజీకేఎస్ కు రెండేళ్లకే ధ్రువీకరణ పత్రం అందించింది. అయితే నాలుగేళ్ల కాలపరిమితికి ఎన్నికలు నిర్వహించారని టీబీజీకేఎస్ వాదిస్తూ వస్తోంది. కేంద్ర కార్మిక శాఖ ఇచ్చిన అధికార పత్రంలో రెండేళ్లుగా ఉండడంతో టీబీజీకేఎస్ ఖంగుతిన్నది. ఆ తర్వాత మరోసారి వింత వాదనకు తెరలేపింది.. ఎన్నికలు పూర్తయిన ఆరు నెలల తర్వాత తాము ధ్రువీకరణ పత్రం అందుకున్నామని, 2020 ఏప్రిల్ వరకు కాలపరిమితి ఉందంటూ నాయకులు బుకాయించారు. ఈలోపు కరోనా రావడంతో కొంత ఆలస్యమైంది. ఇప్పుడు పరిస్థితులు సాధారణ స్థితికి రావడం, టీబీజీకేఎస్ మినహా అన్ని కార్మిక సంఘాలు సింగరేణి ఎన్నికల కోసం పట్టుబడుతుండడంతో ఈ సారి తప్పట్లు కనబడడం లేదు.

పెద్దల హస్తంతో అన్నీ అక్రమాలే..

టీబీజీకేఎస్ గుర్తింపు సంఘంగా గెలుపొందిన నాటినుంచే అన్నీ అక్రమాలు చోటుచేసుకున్నాయని కార్మికులు ఆరోపిస్తున్నారు. అంతేకాదు వర్గ పోరుతో అనేకసార్లు రోడ్డుపై పడ్డారు తప్ప కార్మికులకు చేసింది ఏమీ లేదని చెబుతున్నారు. ఇటీవల గోదావరిఖనిలో జరిగిన ఓ సమావేశంలో టీబీజీకేఎస్ రెండు వర్గాలుగా విడిపోయి ఒకరిపై ఒకరు దాడి చేసుకోవడంతో ఆ సంఘం రాష్ట్ర అధ్యక్షుడు వెంకట్రావ్ అక్కడ వెనుదిరిగి వెళ్లిపోయిన విషయం కూడా కార్మికుల్లో అసహనం తెప్పించింది. అంతేకాదు తమకు అనుకూలమైన వారి సమస్యలకే పరిష్కారం దొరకేదని, మిగతా వారిని పట్టించుకోలేదంటున్నారు. ఇక సింగరేణిలో ఉద్యోగాలు మొదలు, అత్యంత కీలకమైన మెడికల్ అన్ ఫిట్, మెడికల్ బోర్డులో, ఔట్ సోర్సింగ్ ఉద్యోగాలు.. ఇలా అన్నింట్లో అధికార పార్టీ పెద్దల హస్తంతో పాటు టీబీజీకేఎస్ నాయకులు కూడా ఉన్నారని, తమకు అనుకూలమైన వారికే పైరవీలు చేసి కోట్లు సంపాదించుకున్నారనే మిగతా సంఘాల కార్మికులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.

అధికార పార్టీలో గుబులు..

సింగరేణిపై పూర్తి ఆధిపత్యంతో ఉన్న అధికార పార్టీకి.., పీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి దృష్టి పెట్టడంతో ఏం చేయాలో అర్థం కావడంలేదు. అంతేకాదు ఫైర్ బ్రాండ్‌గా పేరున్న సీతక్కను ఐఎన్టీయూసీ కార్మిక సంఘం గౌరవ అధ్యక్షురాలిగా నియమించేందుకు కసరత్తులు మొదలు పెట్టడంతో ఒకింత గుబులు పట్టుకుందని కార్మికుల్లో ప్రచారం జరుగుతోంది. కార్మికుల సమస్యల పట్ల వివక్ష, పదవీ కాలంలో తీవ్ర అవినీతి, అక్రమాలు చోటుచేసుకోవడం, అధికారాన్ని అడ్డు పెట్టుకుని సింగరేణి ఉన్నతాధికారులను సైతం గుప్పట్లో పెట్టుకున్నారన్న ఆరోపణలు రావడం.. ఎన్నికలకు వెళ్లకుండా పెత్తనం చెలాయిస్తారన్న అపవాదును మూటగట్టుకోవడం.. ఇలా అన్నీ కలిపి టీబీజీకేఎస్ పై కార్మికుల్లో తీవ్ర వ్యతిరేకత ఏర్పడింది. మరోవైపు ప్రతిపక్షం స్ట్రాంగ్‌గా తయారవుతుండడంతో కంటిమీద కునుకులేకుండా పోతున్నట్లు టీబీజీకేఎస్ సంఘానికి చెందిన కొంతమంది కార్మికులే అంటున్నారు.

సీతక్క కార్మికుల పక్షాన నిలబడే వ్యక్తి..

సీతక్క ఐఎన్టీయూసీకి స్టార్ క్యాంపెయినర్ అయితే చాలా ఉపయోగం. మా కార్మిక సంఘం చాలా బలపడుతుంది అనే నమ్మకం ఉంది. ప్రస్తుతానికి ఎలాంటి బాధ్యతలు అనేది ఏమీ అనుకోలేదు.. సీతక్క కార్మికులు, పేదల పక్షాన నిలబడే వ్యక్తి. ఆమెకు బాధ్యతలు ఇస్తే మాకు బాగుంటుంది. కవితకు ధీటుగా మంచి ఫైర్ బ్రాండ్‌గా ఉంటుంది.

– జనక్ ప్రసాద్, ఐఎన్టీయూసీ సింగరేణి విభాగం సెక్రటరీ జనరల్

కవితకు సీతక్కే కరెక్ట్..

కోల్ బెల్ట్ ఏరియాలో సీతక్కకు మంచి పట్టుంది. ఆమె సేవలను ఐఎన్టీయూసీ వినియోగించుకుంటుంది. మా సంఘం కాంగ్రెస్ పార్టీకి అనుబంధం కాబట్టి, కొత్త నాయకత్వంలో గెలుపే లక్ష్యంగా ముందుకు పోతాం. మేం గెలిపించుకున్న ఎమ్మెల్యేలు అందరూ టీఆర్ఎస్ పార్టీలోకి వెళ్లిపోయారు.. ఇప్పుడు సీతక్క లాంటి స్టార్ క్యాంపెయినర్ ముందుకు వస్తే స్వాగతిస్తాం. టీబీజీకేఎస్ పూర్తిగా అధికార పార్టీ కబంధ హస్తాల్లో నడుస్తుంది. కేసీఆర్, కవిత, కేటీఆర్ చెప్పినట్లే వారు నడుచుకుంటారు. కవితకు చెక్ పెట్టాలంటే సీతక్కే కరెక్టు.

– త్యాగ రాజన్, ఐఎన్టీయూసీ అనుబంధ సింగరేణి కోల్ మైన్స్ లేబర్ యూనియన్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి

Advertisement

Next Story