ఢిల్లీ లిక్కర్ స్కాంలో ఈడీ విచారణకు డుమ్మా.. తేల్చేసిన ఎమ్మెల్సీ కవిత

by Javid Pasha |   ( Updated:2023-09-14 11:47:51.0  )
ఢిల్లీ లిక్కర్ స్కాంలో ఈడీ విచారణకు డుమ్మా.. తేల్చేసిన ఎమ్మెల్సీ కవిత
X

దిశ, వెబ్‌డెస్క్: ఢిల్లీ లిక్కర్ స్కాం కేసులో తనకు మరోసారి ఈడీ నోటీసులు ఇవ్వడంపై ఎమ్మెల్సీ కవిత స్పందించారు. మోదీ నోటీసులు అందాయని, రేపు ఈడీ విచారణకు హాజరుకావడం లేదని తెలిపారు. రాజకీయ కక్షతోనే నోటీసులు అందాయని, నోటీసులను తన లీగల్ టీమ్ చూసుకుంటుందని కవిత స్పష్టం చేశారు. ఈడీ నోటీసులను సీరియస్‌గా తీసుకోవాల్సిన అవసరం లేదని శ్రేణులకు సూచించారు.

లిక్కర్ స్కాంలో గురువారం కవితకు ఈడీ నోటీసులు జారీ చేసింది. రేపు విచారణకు రావాల్సిందిగా ఆదేశించింది. గతంలో పలుమార్లు ఈ స్కాంలో కవిత ఢిల్లీలోని ఈడీ కార్యాలయంలో విచారణకు హాజరయ్యారు. స్కాంకు సంబంధించిన విషయాలపై కవితను ఈడీ అధికారులు కొన్ని గంటలపాటు ప్రశ్నించారు. అలాగే ఆమె ఫోన్లను కూడా స్వాధీనం చేసుకుని ఫోరెన్సిక్ ల్యాబ్‌కు పంపారు. ఆ సమయంలో కవితను అరెస్ట్ చేస్తారనే ప్రచారం కూడా బలంగా వినిపించింది. ఢిల్లీ డిప్యూటీ సీఎం మనీష్ సిసోడియాను అరెస్ట్ చేయడంతో.. కవితను కూడా అరెస్ట్ చేయడం ఖాయమనే ప్రచారం జరిగింది. కానీ కవిత నుంచి ఈడీ ఆధారాలు సేకరించగా.. ఆ తర్వాత ఆమెపై ఎలాంటి చర్యలు తీసుకోలేదు.

ఇటీవల ఢిల్లీ లిక్కర్ స్కాం కేసులో నిందితుడిగా ఉన్న హైదరాబాద్‌కు చెందిన ప్రముఖ వ్యాపారి అరుణ్ రామచంద్ర పిళ్లై అప్రూవర్‌గా మారారు. అలాగే ఇటీవల కవిత మాజీ చార్టెడ్ అకౌంటెంట్ బుచ్చిబాబును కూడా ప్రశ్నించారు. ఈ తరుణంలో కవితకు మరోసారి ఈడీ నోటీసులు రావడం బీఆర్ఎస్ వర్గాల్లో ఆందోళన కల్గిస్తోంది. గత కొద్ది నెలలుగా ఢిల్లీ లిక్కర్ స్కాంలో ఈడీ, సీబీఐ దూకుడు తగ్గించడంతో పాటు కవిత విషయంలో సైలెంట్ అయ్యారు. దీంతో ఈ కేసులో దర్యాప్తు పూర్తయినట్లేనని అందరూ భావించారు. కానీ అనూహ్యంగా కవితకు మరోసారి నోటీసులు అందటం కీలకంగా మారింది.

Advertisement

Next Story