- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
ఎమ్మెల్యేలు.. ఎక్కడున్నరు..!
దిశ ప్రతినిధి, ఆదిలాబాద్ : ఎన్నికలొచ్చాయంటే ఊర్ల మీదికి దండయాత్రలా వచ్చే నాయకులు, ప్రజాప్రతినిధులు.. ఆపద సమయంలో పత్తా లేకుండా పోయారు.. ఓట్ల సమయంలో నోట్ల కట్టలు, కల్లుసీసాలు పట్టుకుని.. ఇల్లిల్లు, గల్లిగల్లీ తిరిగే లీడర్లు.. కరోనా మహమ్మారి విజృంభిస్తుంటే పట్టించుకున్న పాపాన పోలేదు.. టెస్టులు, వైద్యం చేయక.. వ్యాక్సిన్, బెడ్లు దొరక్క జనాలు చస్తుంటే.. అవగాహన, భరోసా కల్పించి ఆదుకోవాల్సిన నేతలు కనిపించకుండా పోయారు.. నెల రోజులుగా తమ నియోజకవర్గానికి రాకపోగా.. ప్రజలను పట్టించుకోకుండా పట్టణాలకే పరిమితమయ్యారు.. బయట పని లేక, ఇల్లు గడవక పస్తులుండాల్సిన పరిస్థితుల్లో.. సగానికిపైగా ఎమ్మెల్యేలు అసలు తమకేం సంబంధం లేనట్లుగా ఉన్నారు.. మంత్రి అల్లోల నాలుగు జిల్లాల్లో పర్యటించగా.. ముగ్గురు నలుగురు ఎమ్మెల్యేలు అసలు జాడ లేకుండాపోయారు..!
సీఎం కేసీఆర్ క్యాబినెట్ మీటింగ్ తర్వాత ఈ నె 12 నుంచి లాక్డౌన్ అమలు చేయగా.. మంత్రులు, ఎమ్మెల్యేలు సొంత నియోజకవర్గాల్లో ఉండాలని ఆదేశించారు. అయినప్పటికీ ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాకు చెందిన ఎమ్మెల్యేల తీరు మాత్రం మారలేదు. ఇప్పటికీ సగానికిపైగా ఎమ్మెల్యేలు తమకేం సంబంధం లేదన్నట్లుగా పట్టణాలకే పరిమితమయ్యారు. తమకు ఓట్లు వేసి గెలిపించిన జనాలు కరోనాతో అల్లాడి పోతుంటే.. కనీసం అవగాహన కల్పించి భరోసా ఇవ్వటం లేదు. కరోనా బాధితులకు మెరుగైన వైద్యం అందించటం అటుంచితే.. కనీసం టెస్టులు చేయించే పరిస్థితి లేదు. రాష్ట్ర అటవీ, పర్యావరణ, న్యాయ, దేవాదాయ శాఖ మంత్రి అల్లోల ఇంద్రకరణ్రెడ్డి మాత్రం ఉమ్మడి జిల్లాలో పర్యటించి.. కరోనా వ్యాప్తి, నియంత్రణకు తీసుకుంటున్న చర్యలపై సమీక్షించారు. నిర్మల్, ఆదిలాబాద్, మంచిర్యాల, ఆసిఫాబాద్ జిల్లాల్లో పర్యటించి.. సమీక్షలు, క్షేత్రస్థాయిలో పరిశీలన చేశారు. ఆస్పత్రుల్లో అందుతున్న వైద్యం, సౌకర్యాలపై ఆరా తీయటంతో పాటు ఆయా జిల్లాల్లో అమలవుతున్న లాక్డౌన్ పరిస్థితిని క్షేత్రస్థాయిలో తిరిగి పరిశీలించారు.
ముధోల్ ఎమ్మెల్యే గడ్డిగారి విఠ్ఠల్రెడ్డి, ఆసిఫాబాద్ ఎమ్మెల్యే ఆత్రం సక్కు, బోథ్ ఎమ్మెల్యే రాథోడ్ బాపురావు, ఆదిలాబాద్ ఎమ్మెల్యే జోగు రామన్న, ఖానాపూర్ ఎమ్మెల్యే అజ్మీరా రేఖానాయక్ కొన్ని రోజులుగా అసలు నియోజకవర్గంలోనే పర్యటించటం లేదనే విమర్శలున్నాయి. వీరంతా పట్టణాలకే పరిమితమవగా.. ప్రజలను అసలు పట్టించుకోవటం లేదనే విమర్శలున్నాయి. ఒకరిద్దరు ఎమ్మెల్యేలకు కరోనా సోకగా.. తాజాగా వ్యాధి నుంచి కోలుకున్నారు. మంత్రి అల్లోల, కలెక్టర్ నిర్వహించిన సమీక్ష సమావేశాల్లో కొందరు ఎమ్మెల్యేలు మాత్రమే పాల్గొనగా.. ఇద్దరు ఎమ్మెల్యేలు వీటికి కూడా హాజరు కాలేదు. కొందరు ఎమ్మెల్యేలు ఆదిలాబాద్, హైదరాబాద్, మంచిర్యాలలోనే ఉండగా.. ఆపదలో ఉన్న కార్యకర్తలను, ఓట్లు వేసిన జనాలను కనీసం దగ్గరకు కూడా రానీయటం లేదు. ఎమ్మెల్యేల ఇండ్లకు వెళ్తే.. ఉండి కూడా లేరని చెప్పిస్తున్నారని పార్టీ కార్యకర్తలు, జనాలు వాపోతున్నారు. దీంతో తమ బాధలు, అవస్థలు ఎవరికి చెప్పుకోవాలో అర్థం కావటం లేదని జనాలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
చెన్నూర్ ఎమ్మెల్యే, ప్రభుత్వ విప్ బాల్క సుమన్ సభ్యత్వ నమోదు తర్వాత రెండు సార్లు వచ్చి వెళ్లారు. ఒకసారి అభివృద్ధి పనులు, చెక్కుల పంపిణీ చేయగా.. ఇటీవల కలెక్టర్తో సమీక్ష, ఆస్పత్రులను సందర్శించారు. క్షేత్రస్తాయిలో మాత్రం ప్రజలకు వద్దకు వెళ్లి కరోనా బాధితులను ఆదుకోవటం లేదనే విమర్శలున్నాయి. ఆదిలాబాద్ ఎమ్మెల్యే జోగు రామన్న రిమ్స్లోలో సమీక్ష నిర్వహించగా.. డైరక్టర్ బలిరాం నాయక్ తో వాగ్వాదం జరిగి వివాదానికి దారి తీసింది. ఇటీవల మంత్రి ఇంద్రకరణ్రెడ్డి నిర్వహించిన సమీక్షకు హాజరయ్యారు. ముధోల్ ఎమ్మెల్యే గడ్డిగారి విఠ్ఠల్రెడ్డి నెలరోజులుగా నియోజకవర్గానికి రాలేదు. కరోనాతో పాటు బ్లాక్ ఫంగస్తో నియోజక వర్గ ప్రజలు అల్లాడుతుంటే.. పట్టించుకోవటం లేదు. రాథోడ్ బాపురావు ఆదిలాబాద్లోని ఉండగా.. సీఎంఆర్ఎఫ్, కల్యాణ లక్ష్మీ చెక్కుల పంపిణీకే పరిమితమయ్యారు. కార్యకర్తలు, జనాలు కలిసేందుకు వెళ్లినా.. నిరాశే మిగులుతోందని వాపోతున్నారు. ఖానాపూర్ ఎమ్మెల్యే అజ్మీరా రేఖానాయక్కు పాజిటివ్ రాగా.. ఇప్పుడిప్పుడే కోలుకుంటోంది.
సిర్పూర్(టి) నియోజకవర్గ ఎమ్మెల్యే కోనేరు కోనప్ప గత నెల రోజుల నుండి నియోజకవర్గంలో ఉండగా.. అత్యవసరం ఉంటేనే హైదరాబాద్ వెళ్లి వస్తున్నారు. గత వారం రోజుల నుండి కోవిడ్ బారినపడి ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నవారికి, ఇంటి వద్ద ఐసోలేషన్లో ఉన్న వారికి రోజూ రెండు పూటలు భోజన వసతి కల్పిస్తున్నారు. ఆసుపత్రిని సందర్శించి కోవిడ్ బాధితులకు పరామర్శించి వారికి మనోధైర్యం నింపారు. బెల్లంపల్లి ఎమ్మెల్యే దుర్గం చిన్నయ్య గత నెల రోజుల్లో అంతంత మాత్రంగా పట్టించుకోగా.. నాలుగు రోజుల క్రితం బెల్లంపల్లి ఐసోలేషనులోని బాధితులను కలిసి ఓదార్చారు. రెండుసార్లు ఆసుపత్రిని సందర్శించటంతో పాటు అధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించారు. బెల్లంపల్లి ఐసోలేషన్ కేంద్రంలో మౌలిక సదుపాయాలు లేకపోవడంతో కరోనా రోగులకు శాపంగా మారింది. మంచిర్యాల ఎమ్మెల్యే నడిపెల్లి దివాకర్రావు నియోజకవర్గంలో ఉండి.. ఆస్పత్రిని సందర్శించారు. అంబులెన్స్, కరోనా కిట్లు అందజేయటంతో పాటు పల్లెల్లో తిరుగుతున్నారు.