MLC ఎన్నికల కోసం భారీ‌స్కెచ్.. ఈటల రాజేందర్ దెబ్బ.. టీఆర్ఎస్ అబ్బా..!

by Anukaran |   ( Updated:2021-12-05 05:40:41.0  )
MLC ఎన్నికల కోసం భారీ‌స్కెచ్.. ఈటల రాజేందర్ దెబ్బ.. టీఆర్ఎస్ అబ్బా..!
X

దిశ ప్రతినిధి, కరీంనగర్ : ఎమ్మెల్సీ ఎన్నికల్లో అధికార టీఆర్ఎస్ పార్టీకి వ్యతిరేకంగా ఉన్న వారందరినీ ఒకే వేదిక మీదకు తీసుకొచ్చే ప్రయత్నాలు సాగుతున్నట్టుగా తెలుస్తోంది. ఈ మేరకు బీజేపీ నేత, ఎమ్మెల్యే ఈటల రాజేందర్ పావులు కదుపుతున్నారు. ఫైనల్‌ అభ్యర్థిగా ఎవరిని ప్రకటించాలి? ఎవరిని పోటీ నుంచి తప్పించాలన్న విషయంపై కసరత్తులు చేస్తున్నట్టు సమాచారం. ఉమ్మడి కరీంనగర్ జిల్లా నుంచి ఇద్దరు ఎమ్మెల్సీలు ఎన్నిక కావాల్సి ఉన్న నేపథ్యంలో 10 మంది అభ్యర్థులు పోటీ చేస్తున్నారు. వీరిలో ఎల్ రమణ, భాను ప్రసాద్ రావులు టీఆర్ఎస్ పార్టీ అభ్యర్థులు కాగా, 8 మంది స్వతంత్రులు ఉన్నారు. ఎమ్మెల్సీ ఎన్నికల్లోనే అధికార పార్టీకి ఝలక్ ఇవ్వాలన్న యోచనలో ఉన్న ఈటల ఇండిపెండెంట్ అభ్యర్థులను ఒకే వేదిక మీదకు తీసుకొచ్చే ప్రయత్నాలు చేస్తున్నట్టుగా తెలుస్తోంది.

8 మంది అభ్యర్థులు ఎవరికీ వారు పోటీ చేసిన్టయితే ఓట్లు చీలిపోయి అధికారపార్టీ అభ్యర్థులకు లాభం చేకూరుతుందని భావిస్తున్న నేపథ్యంలో ఒకే అభ్యర్థిని ప్రకటించినట్టయితే అన్ని విధాలా లాభం చేకూరుతుందని అనుకుంటున్నట్టుగా తెలుస్తోంది. టీఆర్ఎస్ అభ్యర్థికో ఓటు ప్రత్యర్థికో ఓటు అన్న నినాదాన్ని తీసుకొస్తే సత్ఫలితాన్ని రాబట్టవచ్చని అంచనా వేస్తున్నారు. ఈ నినాదం వినిపించడం వల్ల టీఆర్ఎస్ పార్టీకి చెందిన స్థానిక సంస్థల ప్రజా ప్రతినిధులు కూడా అనుకూలంగా ఓట్లు వేస్తారన్న యోచనలో కూడా ఉన్నట్టుంది.

అలాగే లోకల్ బాడీస్ డెలిగేట్స్‌లో కూడా ప్రభుత్వంపై తీవ్రమైన వ్యతిరేకతను సానుకూలంగా మలుచుకున్నట్టయితే ఒక స్థానంలో టీఆర్ఎస్ పార్టీని ఓడించే అవకాశాలు మెండుగా ఉన్నాయని ఈటల భావిస్తున్నారట.. ఈ మేరకు ఈటల రాజేందర్ సమీకరణాలు చేస్తున్నట్టుగా విశ్వసనీయంగా తెలుస్తోంది.ఈ నెల 8న స్వతంత్రుల ఉమ్మడి అభ్యర్థిని ప్రకటించి ఓట్లు అభ్యర్థించాలన్న లక్ష్యంతో ముందుకు సాగుతున్నట్టుగా సమాచారం. ఈ మేరకు తాను కూడా ఎవరికి మద్దతు ఇస్తున్నానో కూడా మీడియా ముందు ప్రకటించినట్టయితే మరింత పట్టు బిగించే అవకాశాలు ఉన్నాయన్న యోచనలో ఉన్నట్టుగా తెలిసింది.

ఈటలను కలిసిన ఇనుముల..

మరో వైపున తనకు మద్దతు ఇచ్చి ఆశీర్వదించాలని మంథని కాంగ్రెస్ నాయకుడు, ఎమ్మెల్సీ అభ్యర్థి ఇనుముల సతీష్ కరీంనగర్ జిల్లా జమ్మికుంటలో పర్యటిస్తున్న బీజేపీ నేత ఈటల రాజేందర్‌ను అభ్యర్థించారు. అధికార టీఆర్ఎస్ పార్టీకి వ్యతిరేకంగా తాను చేస్తున్న పోరాటానికి మీ వంతు సహకారం అందించాలని కూడా సతీష్ కోరారు.

మంత్రి కేటీఆర్ పై ‘సర్దార్’ సంచలన కామెంట్స్..

మున్సిపల్ మంత్రిగా పనికిరారట..!

Advertisement

Next Story

Most Viewed