మంత్రి బంపర్ ఆఫర్.. ఎక్కువ మంది పిల్లలుంటే రూ. లక్ష బహుమతి!

by Shyam |
mizoram Minister robert romawia
X

దిశ, ఫీచర్స్ : 135 కోట్లకు పైగా పాపులేషన్‌తో ఇండియా ప్రపంచంలోనే రెండో అతిపెద్ద జనాభా గల దేశంగా కొనసాగుతోంది. ఈ విషయంలో చైనా మాత్రమే భారత్ కంటే ముందు ఉంది. ఇక జనాభా నియంత్రణకు కృషిచేస్తున్న ప్రభుత్వాలు.. వివిధ ప్రోగ్రామ్స్ ద్వారా ఫ్యామిలీ ప్లానింగ్ ఆపరేషన్స్‌పై అవగాహన కల్పిస్తుంటారన్న విషయం తెలిసిందే. ఈ పరిస్థితుల్లో మిజోరంకు చెందిన మంత్రి.. తన నియోజకవర్గంలో ఎక్కవ మంది పిల్లలున్న వారికి రూ. లక్ష నగదు బహుమతి ప్రకటించడం విశేషం. తక్కువగా ఉన్న మిజో కమ్యూనిటీల జనాభా పెరుగుదలను ప్రోత్సహించేందుకే ఈ నిర్ణయం తీసుకున్నట్టు తెలుస్తోంది.

ఫాదర్స్ డే సందర్భంగా ఈ ప్రకటన చేసిన మిజోరం క్రీడా మంత్రి రాబర్ట్ రొమావియా.. తను ప్రాతినిథ్యం వహిస్తున్న ఐజ్వాల్ తూర్పు-2 అసెంబ్లీ నియోజకవర్గంలో ఎక్కువ మంది పిల్లలతో నివసిస్తున్న కుటుంబంలో ఒక్కరికి (పురుషుడు లేదా మహిళకు) రూ. 1 లక్ష రివార్డు ఇవ్వనున్నట్టు వెల్లడించాడు. అంతేకాదు సదరు వ్యక్తికి సర్టిఫికెట్‌తో పాటు ట్రోఫీ కూడా ప్రదానం చేయనున్నట్టు తెలిపారు. కాగా ఈ ప్రోత్సాహకానికి సంబంధించిన ఖర్చును మంత్రి రాబర్ట్‌ కుమారుడి కన్‌స్ట్రక్షన్ కంపెనీయే భరించనుంది. ‘వివిధ రంగాల్లో అభివృద్ధి సాధించేందుకు అవసరైమనంత జనాభా మిజోరంలో లేదు. అక్కడి పాపులేషన్‌ క్రమంగా తగ్గుతుండటమే అందుకు కారణం. తక్కువ జనాభా అనేది తీవ్రమైన సమస్య కాగా, చిన్న సమాజాలు లేదా మిజో వంటి తెగల మనుగడ, పురోగతికి అది అడ్డంకిగా నిలుస్తోంది. వివిధ రకాల మిజో తెగలకు మిజోరం పుట్టినిల్లు’ అని మంత్రి పేర్కొన్నారు.

2011 సెన్సస్ లెక్కల ప్రకారం ఈ రాష్ట్ర జనాభా 1,091,014 కాగా.. సుమారు 21,087 చదరపు కిలోమీటర్ల విస్తీర్ణాన్ని కలిగి ఉంది. ఈ క్రమంలో చ. కిలోమీటరుకు 52 మంది జనాభాను మాత్రమే కలిగి ఉన్న మిజోరం.. దేశంలో అత్యల్ప జనసాంద్రత కలిగిన రెండో రాష్ట్రంగా నిలిచింది. ఇక 17 మందితో అరుణాచల్ ప్రదేశ్ మొదటి స్థానంలో ఉండగా.. సగటు జాతీయ జనసాంద్రత చ.కిమీ.కు 382 గా ఉంది.

Advertisement

Next Story

Most Viewed