ఖిల్లా.. దాహం తీరేదెలా?

by Shyam |
ఖిల్లా.. దాహం తీరేదెలా?
X

దిశ‌, వ‌రంగ‌ల్ తూర్పు: కాక‌తీయుల రాజ‌ధాని.. సిరిసంప‌ద‌ల‌కు పెట్టినిళ్లు.. వ‌ల‌యాకారంలో ఉన్న మ‌ట్టి కోట, రాతి కోటల మ‌ధ్య మూడు డివిజ‌న్లు, ముప్పైవేల మంది జ‌నాభాతో విస్త‌రించిన న‌గ‌రం నేడు దాహంతో అల‌మ‌టిస్తోంది. బుక్కెడు నీటికోసం ఎదురు చూడాల్సిన ప‌రిస్థితి.. వారం, ప‌ది రోజులైనా న‌ల్లాల ద్వారా నీటి స‌ర‌ఫ‌రా లేక జనం రోడ్డెక్కుతున్నారు. అధికారుల‌కు ఫిర్యాదు చేసినా ప‌ట్టించుకోని వైనం.

ఒకే వాట‌ర్ ట్యాంక్‌..

ఉగాది నుంచి మిష‌న్ భ‌గీర‌థ ద్వారా ఇంటింటికీ తాగు నీరు అందిస్తామంటూ అధికారులు ప్ర‌క‌ట‌న‌లు చేస్తున్నా అది ఇక్క‌డ అమ‌ల‌య్యే ప‌రిస్థితి క‌నిపించ‌డం లేదు. అట్ట‌హాసంగా పైప్‌లైన్ నిర్మాణాల‌ను చేసినా నీరు స‌ర‌ఫ‌రా చేసేందుకు కావాల్సిన వాట‌ర్ ట్యాంకు ఇక్క‌డ లేక‌పోవ‌డం ప్ర‌జల దాహార్తికి ప్ర‌ధాన కార‌ణంగా మారుతోంది. పూర్వ కాలంలో కేవ‌లం ఐదు వేల జ‌నాభా ఉన్న స‌మ‌యంలో అప్ప‌టి అవ‌స‌రాల‌కు అనుగుణంగా నిర్మించిన వాట‌ర్ ట్యాంకే నేటికీ అక్క‌డి ప్ర‌జ‌ల‌కు నీటిని స‌ర‌ఫ‌రా చేస్తోంది. దీంతో నీళ్లు సరిపోక ప్ర‌జ‌లు స‌త‌మ‌త‌మ‌వుతున్నారు. ఇక వేస‌వి కాలంలో అయితే నానా తిప్పలు పడుతున్నామని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.

ముందుచూపులేని అధికారులు..

మిష‌న్ భ‌గీర‌థ ప‌థ‌కం ద్వారా ఖిల్లా వ‌ర‌ంగ‌ల్‌లోని 8వ డివిజ‌న్‌లో వాట‌ర్ ట్యాంక్ నిర్మించాల‌ని బ‌ల్దియా అధికారులు నిర్ణ‌యించారు. ఈ మేర‌కు టెండ‌ర్లు ఖ‌రారు చేశారు. రూ.9 కోట్ల‌తో ట్యాంక్ నిర్మించేలా ఏర్పాట్లు చేశారు. అప్పుడు ఎమ్మెల్యేగా ఉన్న కొండా సురేఖ శంకుస్థాప‌న చేసి ప‌నుల‌ను ప్రారంభించారు. ఇందుకు కావాల్సిన మెటీరియ‌ల్‌ను కాంట్రాక్ట‌ర్ తెచ్చారు. ట్యాంక్ కోసం పెద్ద గోతిని త‌వ్వారు.

అభ్యంత‌రం చెప్పిన పురావ‌స్తు శాఖ‌..

రాతి కోట‌కు స‌మీపంలో ఎలాంటి త‌వ్వ‌కాలు, నిర్మాణాలు చేపట్ట‌కూడ‌దని పురావ‌స్తు శాఖ అభ్యంత‌రం తెలిపింది. రాతి కోట‌ నుంచి క‌నీసం వంద మీట‌ర్ల దూరం అవతల మాత్రమే నిర్మాణాలు చేప‌ట్టాలి. కానీ స‌మీపంలో నిర్మించ‌కూడ‌దంటూ ప‌నుల‌ను ఆపేశారు. క‌నీసం రా‌తికోట నుంచి వంద మీట‌ర్ల దూరంలో అయినా ట్యాంక్ నిర్మాణం చేప‌ట్టాల‌ని అధికారులు నిర్ణ‌యించినా అక్క‌డ ప్ర‌భుత్వ భూమి లేక‌పోవ‌డంతో ఎక్క‌డి ప‌నులు అక్క‌డే నిలిచిపోయాయి. ఇది జ‌రిగి రెండు సంవ‌త్స‌రాలు కావ‌స్తున్నా అధికారులు ప్ర‌త్యామ్నాయం ఆలోచించ‌క పోవ‌డంతో ప్రజలకు నీటి క‌ష్టాలు త‌ప్ప‌డం లేదు.

క‌నిపించ‌ని శిలా ఫ‌ల‌కం..

ట్యాంకు నిర్మాణం కోసం వేసిన శిలా ఫ‌ల‌కం మాయం కావ‌డం ఆశ్చ‌ర్యానికి గురిచేస్తోంది. ఇది దుండ‌గుల ప‌నా.. లేక కావాల‌నే రాజ‌కీయ నాయ‌కులు చేసిన ప‌నా అని స్థానికులు మండిపడుతున్నారు. ఏదేమైనా శిలాఫ‌ల‌కం తొల‌గించి దానికి అడ్డంగా న‌ల్ల‌టి టార్ఫాలిన్‌ను అడ్డుపెట్టడం ఏంటని పలువురు ప్రశ్నిస్తున్నారు.

Advertisement

Next Story

Most Viewed