అమ్మకానికి అమ్మాయి.. దుబాయ్ ఫోన్‌కాల్‌తో గుట్టురట్టు

by Anukaran |   ( Updated:2021-02-06 01:09:42.0  )
అమ్మకానికి అమ్మాయి.. దుబాయ్ ఫోన్‌కాల్‌తో గుట్టురట్టు
X

దిశ, వెబ్‌డెస్క్: కన్న కూతురే ఆ పేద దంపతులకు భారమైంది. పెళ్లి చేసే స్థోమత లేక అమ్మాయిని అమ్మకానికి పెట్టారు. అంతలోనే దుబాయ్ నుంచి ఫోన్‌కాల్ రావడంతో ఈ వ్యవహరం అంతా వెలుగులోకి వచ్చింది. ఈ ఘటన మహబూబ్‌నగర్ జిల్లాలో చోటు చేసుకుంది.

వివరాల్లోకి వెళ్తే.. నవాబ్‌పేట మండలం హాజిలాపూర్ గ్రామ పరిధిలోని గాలోనికుంటకు చెందిన వాలమ్మ, రవినాయక్ దంపతులకు నలుగురు సంతానం. వీరు హైదరాబాద్‌లో కూలీ పనులు చేసుకుంటూ జీవనం సాగిస్తున్నారు. ఈ దంపతులకు అక్కడే షాద్‌నగర్‌కు చెందిన ఓ వ్యక్తి పరిచయమయ్యాడు. ఈ క్రమంలో రెండో కూతురు (17) పెళ్లి చేయలేకపోతున్నామని సదరు వ్యక్తితో పలు మార్లు ఆవేదన వ్యక్తం చేశారు దంపతులు. ఇదే అదనుగా భావించిన ఆ వ్యక్తి అమ్మాయిని అమ్మేందుకు ప్లాన్ వేశాడు. రాజస్తాన్‌కు చెందిన ఓ వ్యక్తితో పెళ్లి చేయిస్తానని.. దీని కోసం పెళ్లి కొడుకు నుంచి రూ.3 లక్షలు ఇప్పిస్తానని ఒప్పందం కుదుర్చుకున్నాడు.

తమ కూతురిని రాజస్థాన్ వ్యక్తికి అప్పగించేందుకు దంపతులు.. శుక్రవారం నవాబ్‌పేట నుంచి హైదరాబాద్‌కు వచ్చారు. ఈ విషయం దుబాయ్‌లో ఉంటున్న బాలిక బాబాయ్‌కి తెలియడంతో పోలీసులకు ఫోన్‌లో సమాచారం అందించాడు. వెంటనే రంగంలోకి దిగిన పోలీసులు దంపతులను అడ్డుకున్నారు. అమ్మాయి మైనర్ కావడంతో ఆమెను మహబూబ్‌నగర్‌లోని స్టేట్‌హోంకు తరలించారు. బాలికను రాజస్థాన్‌కు అక్రమంగా తరలిస్తున్నారంటూ దుబాయ్ నుంచి ఫోన్ కాల్ రావడంతో వెంటనే వారిని అడ్డుకున్నామని ఎస్ఐ శ్రీకాంత్ తెలిపారు. బాలికల అక్రమ తరలింపు ఘటనలో స్థానికంగా ఎవరైనా ఉన్నారా.. డబ్బుల కోసం ఎర వేస్తున్నారా అనే విషయాలపై విచారణ చేపట్టామని వెల్లడించారు. బాలికల అక్రమ తరలింపునకు బాధ్యులైన వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.

Advertisement

Next Story