యాదాద్రి మోడల్ పార్కుగా ‘తంగేడువనం’

by Shyam |
యాదాద్రి మోడల్ పార్కుగా ‘తంగేడువనం’
X

దిశ, మునుగోడు: యాదాద్రిభువనగిరి జిల్లా చౌటుప్పల్ మున్సిపాలిటీ పరిధిలోని తంగేడువనాన్ని గురువారం అటవీశాఖ మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి, విద్యుత్ శాఖ మంత్రి గుంటకండ్ల జగదీశ్ రెడ్డిలు ప్రారంభించారు. అనంతరం ఆరో విడత హరితహారంలో భాగంగా మంత్రులు మొక్కలు నాటారు. ఈ సందర్బంగా ఇంద్రకరణ్ రెడ్డి మాట్లాడుతూ.. 230 కోట్ల మొక్కలను నాటడమే లక్ష్యంగా పెట్టుకోవడం జరిగిందన్నారు. 120 ఎకరాల విస్తీర్ణం కలిగిన తంగేడువనంను రూ.3.7 కోట్లతో అభివృద్ధి చేయడం జరిగిందన్నారు. మియావకి విధానంలో ఎకరానికి 4000 మొక్కలను నాటి ఒక చిట్టడివిగా తయారుచేయడం అటవీ అధికారులను అభినందించదగ విషయమన్నారు. ఈ చిట్టడివిలో 14 రకాల మొక్కలను నాటి పెంచడం జరిగిందన్నారు. రాష్ట్రంలోని అన్ని గ్రామ పంచాయతీలు, మున్సిపాలిటీలో ఖాళీగా ఉన్న ప్రభుత్వ భూములలో మియావకి విధానంలో మొక్కలను పెంచేలా ప్రోత్సహిస్తామన్నారు. అనంతరం జగదీశ్ రెడ్డి మాట్లాడుతూ.. ప్రస్తుతం ప్రపంచాన్ని పర్యావరణ సమస్య పట్టి పీడిస్తున్నదని, అందుకోసం మొక్కలను పెంచాలన్నారు. రాష్ట్రంలో ఉన్న 24% అడవులను 33% పెంచడమే లక్ష్యంగా హరితహారం కార్యక్రమాన్ని సీఎం ప్రారంభించారని తెలిపారు. జాతీయ రహదారి 65 వెంట ఖాళీ స్థలాలలో పెద్ద ఎత్తున మొక్కలను పెంచాలన్నారు. తంగేడువనంలో చిట్టడివిని సృష్టించడంలో కీలకపాత్ర పోషించిన కింది స్థాయి అటవీ అధికారుల నుంచి ఉన్నతాధికారుల వరకు అందరిని ప్రత్యేకంగా అభినందించారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్సీ కర్నె ప్రభాకర్, రాజ్యసభ సభ్యులు బడుగుల లింగయ్య యాదవ్, ఎమ్మెల్సీ నర్సిరెడ్డి, కలెక్టర్ అనితా రామచంద్రన్, రాష్ట్ర అటవీశాఖ అధికారిణి ప్రశాంతి, మాజీ ఎమ్మెల్యే ప్రభాకర్ రెడ్డి, జిల్లా అటవీ శాఖ అధికారులు, స్థానిక ప్రజాప్రతినిధులు తదితరులు పాల్గొన్నారు.

Advertisement

Next Story

Most Viewed