మాంసం విక్రయదారులు జాగ్రత్తలు పాటించాలి: మంత్రి వేముల

by Shyam |
మాంసం విక్రయదారులు జాగ్రత్తలు పాటించాలి: మంత్రి వేముల
X

దిశ, నిజామాబాద్: కరోనా వైరస్ వ్యాప్తి నేపథ్యంలో విక్రయదారులు, కొనుగోలుదారులు చేతులకు గ్లౌజులు ధరించాలని రాష్ట్ర రోడ్లు భవనాల శాఖ మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి కోరారు. శుక్రవారం కామారెడ్డి జిల్లా కలెక్టర్ ఛాంబర్‌లో ధాన్యం కొనుగోళ్లు, కరోనా వైరస్ నియంత్రణపై అధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించారు. కరోనా నియంత్రణ కోసం జిల్లా యంత్రాంగం తీసుకుంటున్న చర్యలను కలెక్టర్ శరత్‌ను మంత్రి ప్రశాంత్‌రెడ్డి అడిగి తెలుసుకున్నారు. అనంతరం మంత్రి మాట్లాడుతూ మాంసం విక్రయదారులు, కొనుగోలుదారులు చేతులకు గ్లౌజులు, మాస్కులు ధరించాలని సూచించారు. జిల్లాలో లాక్‌డౌన్ పగడ్బందీగా అమలు జరుగుతోందని చెప్పారు. ఉదయం 6 నుంచి 11 గంటల వరకు మార్కెట్లలో కూరగాయల విక్రయాలు చేపడుతున్నారని తెలిపారు. మధ్యాహ్నం 2 గంటలకు కిరాణా దుకాణాలు, సాయంత్రం 6 గంటలకు మెడికల్ దుకాణాలు మూసి వేస్తున్నారని వివరించారు. ధాన్యం కొనుగోళ్లు ముమ్మరంగా సాగుతున్నాయన్నారు. ఇప్పటికే కందులు, శనగల కొనుగోళ్లు పూర్తయినట్టు తెలిపారు. ప్రభుత్వం ఏర్పాటు చేసిన కొనుగోలు కేంద్రాల్లోనే ధాన్యం విక్రయించి రైతులు గిట్టుబాటు ధర పొందాలని సూచించారు. కొనుగోలు కేంద్రాల వద్ద రైతులకు ఇబ్బందులు కలగకుండా చూడాలని ఆదేశించారు. ఈ సమావేశంలో ఎస్పీ శ్వేత, అదనపు కలెక్టర్లు యాదిరెడ్డి, వెంకటేశ్ దోతురే, సహాయ కలెక్టర్ తేజస్ నందలాల్ పవార్, జిల్లా వైద్యాధికారి చంద్రశేఖర్ తదితరులు పాల్గొన్నారు.

Tags: Kamareddy,Minister vemula prashanth reddy, Review, collector chamber

Advertisement

Next Story

Most Viewed