‘జీవాలకు మెరుగైన వైద్యసేవలు అందించాలి’

by Shyam |
‘జీవాలకు మెరుగైన వైద్యసేవలు అందించాలి’
X

దిశ తెలంగాణ బ్యూరో : రాష్ట్రంలోని జీవాలకు మెరుగైన వైద్య సేవలు అందించాలని తెలంగాణా పశుసంవర్ధక శాఖ లక్ష్యమని రాష్ట్ర పశుసంవర్ధక, మత్స్య, పాడి పరిశ్రమల అభివృద్ధి, సినిమాటోగ్రఫీ శాఖల మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ అధికారులని ఆదేశించారు.. తెలంగాణా రాష్ట్రం ఏర్పడిన తర్వాత ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రత్యేక చొరవతో పశుసంవర్ధక శాఖ కు గతంలో ఎన్నడూ లేని విధంగా పెద్ద ఎత్తున నిధులు కేటాయించడం, అనేక కార్యక్రమాల నిర్వహణ తో ఈ శాఖ కు ఎంతో గుర్తింపు లభించిందని వివరించారు. రాష్ట్రంలోని జీవాలకు వైద్యం మెరుగైన సేవలు అందించడంలో భాగంగా కాంట్రాక్ట్ పద్ధతిన గతంలో నియమించిన 75 మంది వైద్యుల పదవీకాలం ను మరో సంవత్సరం పాటు పొడగిస్తూ ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసిందని తెలిపారు.

పశుసంవర్ధక శాఖ లో కాంట్రాక్ట్ వైద్యుల సేవలు అవసరమని భావించి మార్చి 31 వ తేదీ 2022 వరకు వీరు విధులలో పాల్గొనే విధంగా బుధవారం ఉత్తర్వులను జారీ చేసినట్లు చెప్పారు. తెలంగాణా పశుసంవర్ధక శాఖ ఆధ్వర్యంలో అమలు చేస్తున్న కార్యక్రమాలను కేంద్ర ప్రభుత్వం అనేక సందర్బాలలో ప్రశంసించిందని గుర్తుచేశారు. ప్రధానంగా మూగజీవాల వద్దకే వైద్య సేవలను తీసుకెళ్ళాలనే ఉద్దేశంతో నియోజకవర్గానికి ఒకటి చొప్పున 100 సంచార పశువైద్య శాలలను ముఖ్యమంత్రి ఆదేశాల మేరకు ప్రారంభించడం జరిగిందని చెప్పారు. అదేవిధంగా కొన్ని సంవత్సరాల క్రితం నిర్మించిన రాష్ట్రంలోని పలు పశువైద్య శాలలు శిధిలావస్థలో ఉండగా అలాంటి వాటిని గుర్తించి మొదటి విడతలో 500 కు పైగా పశువైద్యశాలల ఆధునీకరణ పనులు చేపట్టడంతో పాటు అవసరమైన పరికరాలు సమకూర్చడం జరిగిందని తెలిపారు. జీవాలను రోగాల భారి నుండి రక్షించేందుకు సకాలంలో వ్యాక్సిన్ లు వేసే కార్యక్రమాలను నిర్వహించడం జరుగుతుందని చెప్పారు.

అన్ని పశువైద్యశాలల్లో జీవాలకు ఆవసరమైన మందులు అందుబాటులో ఉండేలా చర్యలు తీసుకుంటున్నట్లు తెలిపారు. ఎప్పటికప్పుడు శాఖ ఉన్నతాధికారులతో సమీక్షలు, సమావేశాలు నిర్వహిస్తూ జీవాలకు అందుతున్న వైద్యసేవలు, ఇంకా తీసుకోవాల్సిన చర్యలపై ఆదేశాలు, సూచనలు ఇస్తూ క్షేత్రస్థాయిలో వైద్యులు, సిబ్బందిని అప్రమత్తం చేస్తున్నట్లు వెల్లడించారు. పశుగ్రాసం కొరత ఏర్పడకుండా రైతులకు సబ్సిడీ పై గడ్డి విత్తనాల పంపిణీ చేయడంతో పాటు శాఖ కు చెందిన ఖాళీ స్థలాలలో గడ్డి పెంపకం చేపట్టినట్లు చెప్పారు. ఇవే కాకుండా గొర్రెలు, పశువుల కోసం గ్రామీణ ఉపాధి హామీ పథకం క్రింద ఉచితంగా షెడ్ల ను నిర్మించి ఇస్తున్న విషయాన్ని గుర్తు చేశారు. పశుసంవర్ధక శాఖ కు పెద్ద ఎత్తున నిధులు కేటాయించడంతో పాటు ఈ శాఖ ను మరింత బలోపేతం చేసేందుకు కృషి చేస్తున్నసీఎం కేసీఆర్ కు రైతుల పక్షాన కృతజ్ఞతలు తెలిపారు.

Advertisement

Next Story