అధికారులకు మంత్రి సత్యవతి రాథోడ్ హెచ్చరిక

by Shyam |
Satyavati Rathore
X

దిశ, తెలంగాణ బ్యూరో : రాష్ట్ర వ్యాప్తంగా మరో రెండు, మూడు రోజులు భారీ వర్షాలు కురవనున్న నేపథ్యంలో అధికారులు అప్రమత్తంగా ఉండి, ప్రజలకు పూర్తి స్థాయిలో అందుబాటులో ఉండాలని రాష్ట్ర గిరిజన, స్త్రీ – శిశు సంక్షేమ శాఖల మంత్రి సత్యవతి రాథోడ్ అధికారులను ఆదేశించారు. గోదావరి, కృష్ణా పరివాహక ప్రాంతాల్లో భారీ వర్షాల వల్ల వరద ఉధృతి పెరుగుతున్న నేపథ్యంలో సీఎం కేసీఆర్ మంత్రులు, ప్రజా ప్రతినిధులు పరిస్థితులను సమీక్షించాలని ఆదేశించిన నేపథ్యంలో మంత్రి సత్యవతి రాథోడ్ గురువారం మహబూబాబాద్, ములుగు, భూపాల పల్లి జిల్లాల కలెక్టర్లు, ఎస్పీ, ఇరిగేషన్ అధికారులతో టెలి కాన్ఫరెన్స్ నిర్వహించి, పరిస్థితిని సమీక్షించారు.

ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ అవసరమైతే తప్ప ఇళ్ల నుంచి బయటకు వెళ్లకుండా ప్రజలకు అవగాహన కల్పించాలని సూచించారు. ప్రజా ప్రతినిధులు ప్రజలను అప్రమత్తం చేయాలని కోరారు. రాగల 48 గంటల్లో మరిన్ని భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని, ములుగు, భూపాలపల్లి జిల్లాలకు రెడ్ అలర్ట్, మహబూబాబాద్ జిల్లాకు ఆరెంజ్ అలర్ట్ ను వాతావరణ శాఖ జారీ చేసిందన్నారు. వర్షాల వల్ల జరిగే ప్రమాదాల నివారణకు అధికారులు ముందస్తు జాగ్రత్తలు తీసుకోవాలని ఆదేశించారు. జిల్లా కేంద్రాల్లో కంట్రోల్ రూమ్ లు ఏర్పాటు చేసి 24 గంటలు అవి పనిచేసేలా పర్యవేక్షించాలన్నారు. చిన్న సమాచారం వచ్చినా నిర్లక్ష్యం చేయకుండా అటెండ్ చేయడానికి అధికారులు సిద్ధంగా ఉండాలని చెప్పారు.

లోతట్టు ప్రాంతాలను ముందే గుర్తించి, అక్కడి ప్రజల భద్రతకు కావల్సిన చర్యలు వెంటనే చేపట్టాలన్నారు. ముంపు ప్రాంతాల్లో ఉన్న జనాలను అక్కడి నుంచి తరలించి, పునరావాస ఏర్పాటు చేయాలని సూచించారు. ఎలాంటి ప్రాణ నష్టం జరగకుండా అన్ని రకాల ముందస్తు జాగ్రత్తలు తీసుకోవాలన్నారు. కాలువలు, చెరువులు, కుంటలలో బలహీనంగా ఉన్న ఆనకట్టలు గుర్తించి వాటిని పటిష్టం చేసే చర్యలు చేపట్టాలన్నారు. శిథిలావస్థలో ఉన్న ఇండ్లను ఖాళీ చేయించి సురక్షిత ప్రాంతాలకు చేర్చాలన్నారు. ఎలాంటి సమాచారం ఉన్నా వెంటనే అందించాలని, తాను 24 గంటలు అందుబాటులో ఉంటానని అధికారులకు తెలిపారు.

Advertisement

Next Story

Most Viewed