విరుద్ధంగా వ్యవహరిస్తే కఠిన చర్యలు: మంత్రి తలసాని

by Shyam |
విరుద్ధంగా వ్యవహరిస్తే కఠిన చర్యలు: మంత్రి తలసాని
X

దిశ, హైదరాబాద్ :

ప్రభుత్వం అమలు చేస్తున్న కార్యక్రమాలను ఎమ్మెల్యేలు, కార్పొరేటర్లతో సమన్వయం చేసుకొని అమలు చేయాలని మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ జీహెచ్ఎంసీ, రెవెన్యూ అధికారులకు సూచించారు. మాసాబ్ ట్యాంక్ లోని పశుసంవర్థక శాఖ కార్యాలయంలోని తన చాంబర్‌లో గ్రేటర్ హైదరాబాద్ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, కార్పొరేటర్లతో బుధవారం టెలీకాన్ఫరెన్స్ నిర్వహించారు. ఈ సందర్భంగా మంత్రి తలసాని మాట్లాడుతూ.. ప్రభుత్వ విధానాలకు విరుద్ధంగా వ్యవహరించే అధికారులపై కఠిన చర్యలు ఉంటాయని హెచ్చరించారు. జీహెచ్ఎంసీ పరిధిలో అన్ని ప్రాంతాల్లో దోమల నివారణకు ఫాగింగ్, కరోనా నియంత్రణకు హైపోక్లోరైడ్ స్ప్రే చేయాలన్నారు. ఇంకా స్ప్రే చేపట్టని ప్రాంతాలను స్పెషల్ డ్రైవ్ నిర్వహించి స్ప్రే చేసేలా సంబంధిత అధికారులకు ఆదేశాలు జారీ చేస్తామన్నారు.

స్థానిక డివిజన్ కార్పొరేటర్లు ప్రతిరోజూ 2 గంటల పాటు క్షేత్ర స్థాయిలో పర్యటించి, ప్రజల సమస్యలను పరిష్కరించాలని సూచించారు. వివిధ రాష్ట్రాల నుంచి ఉపాథి కోసం నగరానికి 85 వేల మంది వలస వచ్చారని, వారందరికీ 12 కిలోల బియ్యం, అందజేస్తున్నట్టు తెలిపారు. తెల్లరేషన్ కార్డుదారులకు కుటుంబ సభ్యుల్లో ఒక్కొక్కరికి 12 కిలోల బియ్యం, కార్డుకు రూ.1500 లు నగదు పంపిణీ చేస్తున్నట్టు తెలిపారు. రేషన్ కార్డు దరఖాస్తు చేసుకున్న వారిలో విచారణ అనంతరం అర్హులైన వారి జాబితా సిద్ధంగా ఉందన్నారు. వారికి కూడా బియ్యం పంపిణీకి చర్యలు తీసుకోనున్నట్టు తెలిపారు. అనంతరం హైదరాబాద్ కలెక్టర్ శ్వేతా మహంతి, జీహెచ్ఎంసీ కమిషనర్ డీఎస్ లోకేష్ కుమార్, వాటర్ బోర్డు ఎండీ దానకిషోర్, చీఫ్ రేషనింగ్ ఆఫీసర్ బాలమాయాదేవి తదితర అధికారులతో మాట్లాడి సమస్యల పరిష్కారానికి కృషి చేయాలని ఆదేశాలు జారీ చేశారు.

Tags: Minister Talasani Srinivas Yadav, Corona Review, Hyderabad Collector, GHMC, Water Board

Advertisement

Next Story

Most Viewed