మరో వివాదంలో మంత్రి ‘మల్లారెడ్డి’.. ఆయన రూటే సపరేటు..

by Shyam |
మరో వివాదంలో మంత్రి ‘మల్లారెడ్డి’.. ఆయన రూటే సపరేటు..
X

దిశ, జవహర్ నగర్ : జవహర్ నగర్ మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలోని మహంకాళీ కమాన్ నుంచి బాలా టిఫిన్ సెంటర్ వరకున్న శ్రీరామ్ నగర్ ప్రధాన రోడ్డు నిర్మాణ పనుల కోసం రెండు సార్లు శంకుస్థాపనలు చేసుకుంది. మొదటగా 2019, సెప్టెంబర్ 13న మంత్రి మల్లారెడ్డి చేతుల మీదుగా తొలి శంకుస్థాపన చేసుకుంది. అప్పట్లో అంచనా వ్యయం రూ.24 లక్షలు. అయినా ఇప్పటి వరకు పనులు ప్రారంభం కాలేదు.

తర్వాత కొన్ని నెలలు గడిచాక కార్పొరేషన్ ఎన్నికలు రావటంతో పట్టించుకున్న పాపాన పోలేదు. కార్పొరేషన్ ఏర్పడి నూతన పాలక వర్గం పగ్గాలు చేపట్టి ఏడాదికి పైగా సాగుతున్న తర్వాత 2021, సెప్టెంబరు 14న సీసీ రోడ్డు నిర్మాణానికి రూ.34.50 లక్షలు అంచనాతో మరోసారి మంత్రి మల్లారెడ్డి శంకుస్థాపన చేశారు. దీంతో కార్పొరేషన్ ప్రజలు అవాక్కవుతున్నారు.

చెప్పేది గుండెకాయ.. కొట్టేది కొబ్బరికాయ..

మంత్రి మల్లారెడ్డి ఎలాంటి సభలు, సమావేశాల్లో పాల్గొన్నా ఘంటాపథంగా జవహర్ నగర్ నా గుండె కాయా.. కోట్ల రూపాయల తెచ్చి అభివృద్ధి చేస్తానంటూ పలు సందర్భాలలో ఇలాంటి హుషారు పుట్టించే మాటలతో జనానికి సులభంగా నమ్మకం కల్పిస్తూ వస్తున్నారు. తాను మంత్రిగా ఎన్నికైన తర్వాత, కార్పొరేషన్ ఏర్పడ్డ తర్వాత ఏ ఒక్క అభివృద్ధి పనికి నోచుకోలేదని కేవలం మాటలతో కోట్లు ఖర్చు చేస్తున్నట్లు ప్రచారం చేస్తున్నారనే ఆరోపణలు వస్తున్నాయి. చెప్పేది గుండెకాయ.. కొట్టేది కొబ్బరికాయ అంటూ పలు విమర్శలకు దారితీసింది.

రెండేళ్లలో ఒకే రోడ్డుకు ఇరువైపులా శంకుస్థాపనలు చేసిన మంత్రి మల్లారెడ్డిపై తీవ్ర అసహనం పెరిగిపోతోంది. సీసీ రోడ్డు కోసం 2019 లో అంచనా వ్యయం రూ.24 లక్షలు రోడ్డు వేయకుండానే ఖర్చు పెట్టారా.. లేక నిధులు దుర్వినియోగం చేశారా అనే అనుమానాలు కలుగుతున్నాయి. అదే రోడ్డుకు పేరు మార్చి మళ్లీ రూ.34.50 లక్షలతో శిలాఫలకం వేయడంలో ఆంతర్యం ఏమిటని ప్రజలు ప్రశ్నిస్తున్నారు. కార్పొరేషన్ పరిధిలో జరుగుతున్న శంకుస్థాపనల పేరుతో శిలాఫలకాలపైనే అభివృద్ధి చేస్తున్నారని స్థానికులు ధ్వజమెత్తారు. ఇప్పటికైనా ప్రభుత్వం స్పందించి ఇక్కడ జరుగుతున్న శంకుస్థాపనలపై ఉన్నతాధికారులు స్పందించి పూర్తిస్థాయి విచారణ చేపట్టాలని ప్రజలు డిమాండ్ చేస్తున్నారు.

Advertisement

Next Story