‘నేతన్న’లకు రామన్న గుడ్‌న్యూస్.. రూ.109 కోట్ల ప్రయోజనం

by Sridhar Babu |   ( Updated:2021-06-14 10:37:55.0  )
ktr-texttile 1
X

దిశ, తెలంగాణ బ్యూరో : నేతన్నకు చేయూత కార్యక్రమాన్ని తిరిగి ప్రారంభిస్తున్నట్లు టెక్స్ టైల్ శాఖ మంత్రి కేటీఆర్ తెలిపారు. సోమవారం ప్రగతి భవన్‌లో జరిగిన టెక్స్‌టైల్ శాఖ సమీక్షా సమావేశంలో మంత్రి నిర్ణయం తీసుకున్నారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ.. రాష్ర్టంలోని చేనేత, మరమగ్గ కార్మికులు ఈ పొదుపు పథకంలో భాగస్వాములు కావొచ్చన్నారు. కార్మికుల పొదుపునకు అదనంగా ప్రభుత్వం తన వాటాను జమచేస్తుందని తెలిపారు. చేనేత, మరమగ్గ కార్మికులు జమ చేసుకునే 8 శాతం వేతన వాటాకు రెట్టింపు వాటాను 16 శాతాన్ని ప్రభుత్వం జమ చేస్తుందన్నారు. రాష్ర్టంలోని సూమారు 25 వేల మంది చేనేత కార్మికులకు, మరో 10వేల మంది పవర్ లూమ్ కార్మికులకు ఈ పొదుపు ఫథకం భరోసాను ఇస్తుందని మంత్రి వెల్లడించారు. గతంలో కేవలం సొసైటీల పరిధిలో ఉన్న చేనేతలకు ఈ పథకం ఉండేదని, ప్రస్తుతం రాష్ర్టంలో ఉన్న ప్రతీ ఒక్క చేనేత కార్మికుడితో పాటు డైయ్యర్స్, డిజైనర్స్, వీవర్లు, వైండర్లు, ఇతర చేనేత పనివారు కూడా ఈ పథకంలో చేరవచ్చన్నారు.

ఈ పథకం కరోనా కాలంలో నేతన్నలకు ఎంతో ఉపయుక్తంగా నిలించిందని మంత్రి పేర్కొన్నారు. నేత కార్మికులు ఈ ప్రయోజనాలను నిర్ణీత లాగిన్ పిరియడ్ కన్నా ముందే పొందేలా వెసులు బాటు కల్పించామని, దీంతో సుమారు రూ.109 కోట్ల మేర ప్రయోజనం కలిగిందన్నారు. నేత కార్మికులు ‘చేయూత’ పథకాన్ని కొనసాగించాలని కోరడంతో ప్రభుత్వం సానుకూలంగా నిర్ణయం తీసుకుందని తెలిపారు. ఈ పథకం కొనసాగింపునకు అవసరమైన నిధులను ప్రభుత్వం విడుదల చేసిందని మంత్రి తెలిపారు. నేతన్నల సంక్షేమానికి ప్రభుత్వం కట్టుబడి ఉందని ‘నేతన్నకు చేయూత’ పొదుపు పథకంలో నేత కార్మికులంతా చేరాలని విజ్ఞప్తి చేశారు. సమావేశంలో టెక్స్‌టైల్ శాఖ సెక్రటరీ శైలజా రామయ్యార్, టెక్స్‌టైల్ శాఖ ఉన్నతాధికారులు పాల్గొన్నారు.

Advertisement

Next Story