ఏపీ ప్రజలకు భారీ షాకిచ్చిన జగన్ సర్కార్.. ఉచిత బియ్యం పంపిణీకి బ్రేక్

by srinivas |   ( Updated:2021-12-22 20:36:01.0  )
ఏపీ ప్రజలకు భారీ షాకిచ్చిన జగన్ సర్కార్.. ఉచిత బియ్యం పంపిణీకి బ్రేక్
X

దిశ, ఏపీ బ్యూరో : కేంద్ర ప్రభుత్వం ప్రతి నెలా అందించే ఉచిత బియ్యానికి రాష్ట్రంలో తాత్కాలికంగా బ్రేక్ పడింది. ఈ నెల 18 నుంచే ప్రారంభం కావాల్సిన పంపిణీ ఇప్పటికీ మొదలవకపోవటమే ఇందుకు నిదర్శనం. ఈ ఏడాది నవంబర్ నుంచి ఉచిత బియ్యం పంపిణీ ఉండదని తొలుత ప్రకటించిన కేంద్రం దానిని వచ్చే ఏడాది మార్చి వరకు పొడిగించింది. డిసెంబర్ నెలకు సంబంధించిన కోటా పంపిణీ ఇంకా ప్రారంభం కాలేదు. జనవరి నెలలో రెండు నెలల బియ్యం ఒకేసారి పంపిణీ చేసే అవకాశాలున్నాయని సమాచారం.

ఈ అంశంపై రాష్ట్ర పౌరసరఫరాల శాఖ మంత్రి కొడాలి నాని స్పందించారు. డిసెంబర్‌లో పంపిణీ చేయాల్సిన ఉచిత రేషన్‌ బియ్యాన్ని జనవరి బియ్యంతో కలిపి అందజేయనున్నట్లు స్పష్టం చేశారు. పీఎంజీకేఏవై కింద కేంద్రం ఉచిత బియ్యం పంపిణీని డిసెంబర్‌ నుంచి వచ్చే ఏడాది మార్చి వరకు పొడిగించినట్టు తెలిపారు. ఇందులో భాగంగా జాతీయ ఆహార భద్రతా పథకంలోని కార్డుదారులు ఒక్కొక్కరు 5 కిలోల చొప్పున ఉచితంగా బియ్యం పొందనున్నట్లు స్పష్టం చేశారు. ఈ క్రమంలో కేంద్రం 89 లక్షల మందికి (జాతీయ ఆహార భద్రత కార్డు దారులకు)మాత్రమే సరిపడే 1,34,110.515 టన్నుల బియ్యాన్ని కేటాయించినట్లు వివరణ ఇచ్చారు.

ఏపీలో మొత్తం 144 లక్షల మంది లబ్ధిదారులకు 2,11,592.890 టన్నుల బియ్యాన్ని పంపిణీ చేయాల్సి ఉందని పేర్కొన్నారు. సరిపడా నిల్వలు లేకపోవడంతో వాయిదా వేసినట్టు మంత్రి స్పష్టం చేశారు. పీఎంజీకేఏవై కింద రాష్ట్రంలోని లబ్ధిదారులకు పంపిణీ చేసేందుకు రాష్ట్రానికి విడుదల చేయాలని కోరుతూ ఈ నెల 1న కేంద్ర ప్రభుత్వానికి లేఖ రాసినట్లు మంత్రి కొడాలి నాని స్పష్టం చేశారు. ఈ లేఖపై కేంద్రం స్పందించాల్సి ఉందని తెలియజేశారు.

Advertisement

Next Story

Most Viewed