పారిశుద్ధ్య కార్మికుల కృషి అభినందనీయం: మంత్రి జగదీశ్ రెడ్డి

by Shyam |

దిశ, నల్గొండ: రాజకీయాలకు అతీతంగా పోరాటం చేయడం ద్వారానే ప్రపంచాన్ని కబలిస్తున్న కరోనా వైరస్‌ను కట్టడి చేయగలిగామని మంత్రి జగదీశ్ రెడ్డి అన్నారు. సూర్యాపేట మున్సిపల్ పాలకవర్గంతో గురువారం సాయంత్రం మంత్రి టెలీకాన్ఫరెన్స్ నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కరోనాపై పోరాటంలో మున్సిపల్ కార్మికుల శ్రమ ఎంతో దాగి ఉందన్నారు. సూర్యాపేటలో శాంపిల్స్ అధిక మొత్తంలో సేకరించడంతో పాజిటివ్‌ల సంఖ్య పెరిగినట్లు చూపిస్తుందని తెలిపారు. మునుముందు ఎలాంటి ప్రమాదం ఉండొద్దన్న కోణంలోనే అధికారులు ఈ నిర్ణయం తీసుకున్నట్లు మంత్రి వెల్లడించారు. కంటైన్‌మెంట్ పరిధిలో ఉన్న వారిని కంటికి రెప్పలా కాపాడుకుంటామని మంత్రి జగదీశ్‌ రెడ్డి భరోసా ఇచ్చారు. నిజానికి మార్చి 29 వరకు సింగిల్ కేసు నమోదు కాలేదన్నారు. మర్కజ్‌కు వెళ్లిన వారిలో స్థానికులు 11 మంది ఉన్నట్లు ప్రభుత్వం ప్రకటిందని మంత్రి జగదీశ్ రెడ్డి గుర్తు చేశారు. అయితే, వారిలో ఏ ఒక్కరికి పాజిటివ్‌గా తేల లేదన్నారు. ఈ క్రమంలోనే జనతా కర్ఫ్యూ, లాక్‌డౌన్ అమలు నేపథ్యంలో మినహాయింపులు ఇచ్చిన మెడికల్ దుకాణం, కూరగాయల మార్కెట్ నుంచి వైరస్ విస్తరించడం దురదృష్టకరమని తెలిపారు. ఈ టెలీ కాన్ఫరెన్స్‌లో మున్సిపల్ చైర్మన్ పెరుమాండ్ల అన్నపూర్ణమ్మ, వైస్ ఛైర్మన్ పుట్టా కిశోర్, ఓఎస్‌డీ వేణుగోపాల్ రెడ్డి, కమిషనర్ రామాంజల్‌రెడ్డితోపాటు మున్సిపల్ కౌన్సిలర్లు పాల్గొన్నారు.

Tags: minister jaghadish reddy, Teleconference, Municipal Officials, suryapet

Advertisement

Next Story

Most Viewed