పొరపాట్లు జరిగితే సరిదిద్దుతాం: మంత్రి జగదీష్ రెడ్డి

by Shyam |
పొరపాట్లు జరిగితే సరిదిద్దుతాం: మంత్రి జగదీష్ రెడ్డి
X

దిశ, న్యూస్‌బ్యూరో: విద్యుత్ బిల్లుల్లో ఏదైనా పొరపాటు జరిగితే సరిదిద్దేందుకు సిద్ధంగా ఉన్నామని, ఇందు కోసం ప్రతి విద్యుత్ రెవెన్యూ ఆఫీసు(ఈఆర్ఓ)లో హెల్ప్ డెస్క్ ఏర్పాటు చేశామని తెలంగాణ విద్యుత్ శాఖ మంత్రి జగదీశ్‌రెడ్డి తెలిపారు. రెండు నెలల పూర్తిస్థాయి లాక్‌డౌన్ తర్వాత జారీ చేస్తున్న కరెంటు బిల్లులపై ప్రజల నుంచి వ్యతిరేకత వస్తున్న నేపథ్యంలో జగదీశ్‌రెడ్డి సోమవారం హైదరాబాద్‌లోని టీఎస్‌ఎస్పీడీసీఎల్ కార్యాలయంలో మీడియాతో మాట్లాడారు. ప్రతి ఏడాది వేసవిలో ఇళ్లలో 35 నుంచి 40 శాతం కరెంటు వాడకం పెరిగేదని, ఈ ఏడాది లాక్‌డౌన్ కారణంగా అది మరో 10 నుంచి 15 శాతం అదనంగా పెరిగిందని చెప్పారు. కేటగిరీల వారిగానే బిల్లులు తయారు చేశామని ఇందులో ఎలాంటి సందేహాలకు తావు లేదన్నారు. బిల్లులన్నీ పారదర్శకంగానే జనరేట్ అయ్యాయని తెలిపారు. కొవిడ్ కారణంగా ఒకేసారి పెద్ద మొత్తంలో వచ్చిన బిల్లులను చెల్లించలేని పక్షంలో మూడు నెలల వాయిదాల పద్ధతిలో చెల్లించుకునే అవకాశం కల్పించామని చెప్పారు. అయితే నేరుగా చెల్లిస్తేనే వాయిదాల పద్ధతిలో అవకాశముంటుందని, ఆన్‌లైన్‌లో చెల్లించే వాళ్లు వాయిదాల పద్ధతి వినియోచించుకోవడం కుదరదన్నారు. కరోనా వ్యాప్తిని నివారించేందుకే ఇంటింటికి తిరిగి బిల్లులు జారీ చేసే విధానాన్ని నిలిపివేశామన్నారు. దీంతో గతంలో కన్నా ఎక్కువ బిల్లు వచ్చిందన్న అపోహ ప్రజల్లో ఏర్పడిందని అందంతా అవాస్తవమని మంత్రి తెలిపారు. బిల్లు ఎక్కువ వచ్చిందన్న అనుమానం సాక్షాత్తూ విద్యుత్ శాఖ ప్రత్యేక కార్యదర్శి అజయ్ మిశ్రాతో పాటు శాసనసభ్యులు గాదరి కిశోర్, సైదిరెడ్డికి కూడా వచ్చిందని తెలిపారు. దీంతో అప్పటికప్పుడు వారి కరెంటు బిల్లులు తెప్పించి శాఖాపరంగా విచారించి చూసినపుడు ఇచ్చిన బిల్లులు సరైనవేనని తేలిందన్నారు. ఈ విలేకరుల సమావేశంలో విద్యుత్ శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి అజయ్ మిశ్రా, టీఎస్ ఎస్పీడీసీఎల్ ఎండీ రఘమారెడ్డి పాల్గొన్నారు.

Advertisement

Next Story

Most Viewed