హెచ్​ఓడీలు కూడా ఓపీల్లో కుర్చోవాల్సిందే.. తేల్చిచేెప్పిన మంత్రి హరీష్

by Shyam |
హెచ్​ఓడీలు కూడా ఓపీల్లో కుర్చోవాల్సిందే.. తేల్చిచేెప్పిన మంత్రి హరీష్
X

దిశ, తెలంగాణ బ్యూరో: ఆసుపత్రుల్లో మరింత వేగంగా వైద్య సేవలు అందేందుకు ప్రొఫెసర్లు, హెచ్​ఓడీలు కూడా ఓపీల్లో కుర్చోవాల్సిందేనని ఆరోగ్యశాఖ మంత్రి హరీష్​రావు తేల్చి చెప్పారు. హాస్పిటల్స్​వారీగా రివ్యూలు చేయాలని మంత్రి డీఎంఈకి ఆదేశాలిచ్చారు. సోమవారం హైదరాబాద్​లోని నిలోఫర్​ ఆసుపత్రిలో ఆయన నూతన సిటీ స్కాన్​ మిషన్​ను ప్రారంభించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ.. ఇక నుంచి పనితీరు లేని డాక్టర్లకు పనిష్మెంట్​ ఇస్తామన్నారు. సర్కార్​ దవాఖాన్లలో పేదలకు ఎలాంటి ఇబ్బందులు రాకూడదన్నారు. స్వరాష్ట్రం ఏర్పడిన తర్వాత సీఎం కేసీఆర్​ ఆధ్వర్యంలో ఇప్పటికే కొంత పురోగతిని సాధించామన్నారు. మరిన్ని మెరుగులు తీర్చిదిద్దేందుకు చర్యలు తీసుకుంటున్నామన్నారు.

నిలోఫర్​ బలోపేతం..

నిలోఫర్ లోని ఎనిమిది హెచ్ఓడీల వారీగా సమీక్ష నిర్వహించామని మంత్రి హరీష్​రావు తెలిపారు. ఇప్పటికే కావాల్సిన అన్ని పరికరాలను సమకూర్చాలని టీఎస్ఎమ్ఎస్ఐడీసీకి సూచించామన్నారు. ప్రతీ డాక్టర్​ నుంచి సలహాలు తీసుకుంటున్నామన్నారు. ఈ మేరకు సెల్ఫ్ అప్రైజల్ ఇవ్వాలని మంత్రి కోరారు. ప్రతినెల లక్ష్యాలను నిర్దేశించుకోవాలని, అందులో ఏ మేర సాధించారో నివేదిక ఇవ్వాలని మంత్రి అధికారులకు సూచించారు. ఇక జీతాలు, మందులు, రియేజెంట్ల విషయంలో ఎలాంటి ఇబ్బంది ఉండదని స్పష్టత నిచ్చారు. నిలోఫర్​కు ప్రతి సంవత్సరం ఆరోగ్యశ్రీ కింద రూ.10 కోట్లు వస్తున్నాయని, వీటిని హాస్పిటల్ అభివృద్ధికి వినియోగించెలా సూపరింటెండెంట్ కి అనుమతులు ఇచ్చామన్నారు. గతంలో ఆరోగ్యశ్రీ ప్యాకేజీ కుటుంబానికి రెండు లక్షలు ఉంటే సీఎం కేసీఆర్​రూ. 5 లక్షలకు పెంచారన్నారు. నిలోఫర్ లో కార్డియాలజీ లేకపోవడంతో ఇబ్బంది ఎదురవుతున్నట్లు తమ దృష్టికి రాగానే ఓ కమిటీని వేసినట్లు తెలిపారు. వారం రోజుల్లో దానిపై ఓ నివేదిక వస్తుందని, పరిష్కరించే ప్రయత్నం చేస్తానని హామీ ఇచ్చారు.

రెండు అవార్డులు…

దేశంలోనే అత్యధిక తలసరి ఆరోగ్య వ్యయం చేస్తున్న రాష్ట్రాల్లో తెలంగాణ మూడో స్థానంలో నిలిచినట్లు కేంద్ర ఆరోగ్య శాఖ స్పష్టం చేసిందని మంత్రి హరీష్​రావు తెలిపారు. ఆరోగ్య సంరక్షణ కోసం ఒక్కొక్కరిపై రూ.1698 తలసరి ఖర్చు చేస్తున్నామన్నారు. దీంతో పాటు వెల్నెస్ యాక్టివిటీస్ లో తెలంగాణ నంబర్ 1 రాష్ట్రంగా నిలిచిందన్నారు. ఎన్​సీడీ స్క్రీనింగ్ లో రెండో స్థానంలో ఉన్నామన్నారు. కేంద్రం దేశ వ్యాప్తంగా మూడు అంశాల్లో అవార్డులు ప్రకటిస్తే అందులో తెలంగాణకు రెండు రావడం గర్వకారణమన్నారు. ఇది రాష్ట్ర వైద్యారోగ్య శాఖ పని తీరు నిదర్శనమని ఆయన నొక్కి చెప్పారు. రాష్ట్ర వ్యాప్తంగా పనిచేస్తున్నఆరోగ్య శాఖ సిబ్బందికి అభినందనలు తెలిపారు.

అందరికీ ఆయూష్మాన్ ​భారత్​

ఇతర రాష్ట్రాల నుంచి వచ్చే వారికి కూడా ఆయుష్మాన్ భారత్ కింద చికిత్స చేయాలని అన్ని ఆసుపత్రులకు సూచించినట్లు మంత్రి తెలిపారు. కర్ణాటక నుంచి కొందరు హైదరాబాద్​కు రిఫరల్​ పై వస్తున్నట్లు తెలిసిందని, వారందరికీ ఆయుష్మాన్ భారత్ కింద చికిత్స అందించాలని ఆదేశాలిచ్చామన్నారు. మాతృ మరణాలు 92 నుంచి 63కు, శిశు మరణాలు 39 నుంచి 26 కు తగ్గాయన్నారు. 5 ఎండ్లలోపు పిల్లల మరణాలు 42 నుంచి 29కి, నవజాత శిశు మరణాలు 25 నుంచి 16కు పడిపోయాయని తెలిపారు. మరోవైపు ప్రభుత్వ దవాఖానాల్లో ప్రసవాలు 30 నుంచి 52 శాతానికి పెరిగినట్లు మంత్రి వివరించారు. రాబోయే రోజుల్లో మరిన్ని చర్యలు తీసుకుంటామన్నారు. ఇప్పటికే నార్మల్ డెలివరీలు పెరగాలని వైద్యసిబ్బందికి స్పష్టంగా చెప్పామన్నారు. కేసీఆర్​,అమ్మఒడి వంటి పథకాల వల్ల దవాఖాన్లలోనూ ప్రసవాల సంఖ్య 97 శాతానికి పెరిగిందన్నారు. హెల్త్​డైరెక్టర్​, ఎన్​హెచ్​ఎమ్​ కమీషనర్​ ములుగు, సిరిసిల్లా జిల్లాల్లో పర్యటించి ఓ నివేదిక ను తయారు చేస్తారని, దాని ఆధారంగా త్వరలో హెల్త్​ ప్రోఫైల్​ను ప్రారంభిస్తామన్నారు. ఈ కార్యక్రమంలో హెల్త్​ సెక్రటరీ రిజ్వీ, డీఎంఈ డా రమేష్​రెడ్డి తదితరులు పాల్గొన్నారు.

Advertisement

Next Story

Most Viewed