- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
ఉద్యోగులకు ఇచ్చిన హామీ.. ఆరేండ్ల తర్వాత తెరపైకి..!
దిశ, తెలంగాణ బ్యూరో : తెలంగాణ ఉద్యోగులకు ఇచ్చిన మరో హామీని తెలంగాణ అసెంబ్లీ శనివారం గుర్తు చేసింది. దాదాపుగా ఆరేండ్ల నుంచి ఈ ప్రక్రియ మరుగున పడింది. కనీసం కమిటీ కూడా భేటీ కావడమే మరిచిపోయింది. ఈ విషయంపై శాసనమండలిలో ఎమ్మెల్సీ పురాణం సతీష్ అడిగిన ప్రశ్నతో తెలంగాణ అడ్మినిస్ట్రేటివ్ సర్వీస్ (టాస్) వ్యవహారాన్ని ముందుకు తెచ్చారు. దీనిపై మంత్రి హరీశ్‌రావు సమాధానమిచ్చారు. ఇంకా ప్రభుత్వ పరిశీలనలో ఉందంటూ చెప్పుకొచ్చారు. వాస్తవంగా టాస్ ప్రక్రియ ఆరేండ్ల నుంచి సాగుతూనే ఉంది.
రాష్ట్రంలో గ్రూప్–1 స్థాయి అధికారుల సేవలను అన్ని విభాగాల్లో సమర్థవంతంగా వినియోగించుకునే ఉద్దేశంతో ఏర్పాటు చేయాలనుకున్న తెలంగాణ అడ్మినిస్ట్రేటివ్ సర్వీస్ (టాస్) అటకెక్కింది. ఆరేండ్ల కిందట టాస్ ఏర్పాటు కోసం ప్రభుత్వం జీవో జారీ చేసి, హడావుడి చేసినా ఇంతవరకు ఆచరణ దిశగా అడుగులు పడలేదు. గ్రూప్–1 అధికారుల సంఘం, రెవెన్యూ అధికారుల జేఏసీ, గెజిటెడ్ అధికారుల సంఘాలు కలిసి కేరళ, ఒడిశా, గుజరాత్, రాజస్తాన్, హిమాచల్‌ప్రదేశ్ రాష్ట్రాల్లోని అడ్మినిస్ట్రేటివ్ సర్వీస్ పనితీరు తెలుసుకుని, మన రాష్ట్రంలో ఏర్పాటుకు చేపట్టాల్సిన చర్యలపై అధ్యయనం చేసి 2017లో ఇచ్చిన నివేదిక ఇప్పుడు ఎక్కడుందో కూడా తెలియని పరిస్థితి. ఈ నివేదికను ఐఏఎస్ అధికారుల కమిటీ ప్రభుత్వానికి సమర్పించలేదు.
ఆ కమిటీ ఉన్నట్టా? లేనట్టా?
2016 మార్చి 10న సీనియర్ ఐఏఎస్ అధికారి ఎంజీ గోపాల్ నేతృత్వంలో ఆరుగురు ఐఏఎస్ అధికారులతో ఉన్నత స్థాయి కమిటీ నియామకమైంది. అప్పుడు సీఎస్‌గా ఉన్న రాజీవ్ శర్మ ఈ ఉత్తర్వులిచ్చారు. ఎంఏయూడీ, పంచాయతీ రాజ్, రెవెన్యూ, జీఏడీ పొలిటికల్ ప్రిన్సిపల్ సెక్రెటరీలు, ప్రభుత్వ స్పెషల్ సెక్రెటరీ, హెచ్ఆర్ఎండీ సెక్రెటరీతో ఈ కమిటీ వేశారు. ఈ కమిటీకి అప్పుడు ఎంఏయూడీ ప్రిన్సిపల్ సెక్రెటరీగా ఉన్న ఎంజీ గోపాల్ చైర్మన్‌గా వ్యవహరించారు. ఆ తర్వాత ఆయన రిటైర్‌మెంట్ అయ్యారు. కానీ ఇప్పటి నుంచి ఇంతవరకు ఒక్కసారి కూడా కమిటీ భేటీ కాలేదు. అసలు కమిటీ ఉందా? లేదా? అనే దానిపైనా స్పష్టతలేదు. ఫలితంగా అన్ని విభాగాల్లో గ్రూప్–1 స్థాయి అధికారుల సేవలను సంపూర్ణంగా వినియోగించుకోవాలన్న లక్ష్యం నెరవేరకపోగా, కన్ఫర్డ్ ఐఏఎస్ కోటాలో రెవెన్యూ యేతర విభాగాలకు చెందిన గ్రూప్–1 స్థాయి అధికారులకు తగిన ప్రాతినిధ్యం ఎండమావిగానే మిగిలింది.
అంతేకాకుండా టాస్ ప్రక్రియ అడుగు ముందుకు పడకుండా నిలిచిపోగా, 2018లో చేపట్టిన కన్ఫర్డ్ ఐఏఎస్ పదోన్నతుల ప్రక్రియ వివాదాస్పదమైంది. రెవెన్యూయేతర గ్రూప్–1 స్థాయి అధికారులు ఆందోళన కూడా వ్యక్తం చేశారు. సీనియారిటీ విషయంలో రెవెన్యూ విభాగానికి చెందిన ప్రమోటీలు కూడా వ్యతిరేకించారు. టాస్ ఏర్పాటు చేసి తమకు ఐఏఎస్ పోస్టుల్లో తగిన ప్రాతినిధ్యం కల్పించాలని కోరుతున్నా ఉన్నతాధికారులు పట్టించుకోవడం లేదని నాన్ రెవెన్యూ గ్రూప్–1 స్థాయి అధికారులు పలుమార్లు విన్నవించారు. రెవెన్యూ, నాన్ రెవెన్యూ అనే తేడా లేకుండా టాస్‌ను ఏర్పాటు చేసి, గ్రూప్–1 స్థాయి వారందరిని స్టేట్ సివిల్ సర్వీసెస్ కిందకు తీసుకురావాలని వేడుకున్నారు. అయితే రెవెన్యూలో డైరెక్ట్ రిక్రూటీస్, ప్రమోటీల సీనియారిటీ కేసుకు సంబంధించి హైకోర్టు తీర్పు వెలువడకముందే కన్ఫర్డ్ ఐఏఎస్ కోసం జాబితాను ఆమోదించుకోవడంపై ఆందోళన వ్యక్తమైనా ప్రభుత్వం పక్కనపారేసింది. దేశంలోని పలు రాష్ట్రాల్లో గ్రూప్–1 స్థాయి అధికారులతో అడ్మినిస్ట్రేటివ్ సర్వీసును ఏర్పాటు చేయగా, కేరళ ప్రభుత్వం కూడా 2018 నుంచి అమల్లోకి తీసుకువచ్చింది. కానీ రాష్ట్రంలో ఇప్పటి వరకు ఈ ప్రక్రియ ముందుకు పడలేదు.
తాజాగా చర్చల్లోకి
తెలంగాణ అడ్మినిస్ట్రేటీవ్ సర్వీస్ ఏర్పాటు ప్రభుత్వ పరిశీలనలో ఉందంటూ మంత్రి హరీశ్‌రావు శాసనమండలిలో శనివారం వెల్లడించారు. దీంతో టాస్ అంశం మళ్లీ చర్చల్లోకి వచ్చింది. రాష్ట్రంలో తెలంగాణ పరిపాలన సర్వీస్ ఏర్పాటుపై ఎమ్మెల్సీ పురాణం సతీష్ శాసనమండలి ప్రశ్నించారు. దీనికి మంత్రి స్పందిస్తూ అడ్మినిస్ట్రేటివ్ సర్వీస్ ఏర్పాటు ప్రభుత్వ పరిశీలనలో ఉందని, టాస్ ఏర్పాటుపై వేసిన కమిటీ నివేదిక వచ్చిన అనంతరం ప్రభుత్వం నిర్ణయం తీసుకుంటుందని, దేశంలో నాలుగైదు రాష్ట్రాల్లో ఈ తరహా అడ్మినిస్ట్రేటివ్ సర్వీస్ లుఉన్నాయని చెప్పారు. కమిటీ నివేదిక వచ్చిన తర్వాత లాభ, నష్టాలపై పూర్తి స్థాయి చర్చ తర్వాత ప్రభుత్వం నిర్ణయం తీసుకుంటుందంటూ వెల్లడించారు. అయితే ఆరేండ్ల కిందటే నివేదిక ఇచ్చినా దాన్ని ప్రభుత్వానికి ఇవ్వడంలో ఉన్నతాధికారులు నిర్లక్ష్యం చేశారు. ఇప్పుడైనా నివేదికను ఇస్తారా అనేది కొంత అనుమానంగానే ఉన్నా మంత్రి హరీశ్‌రావు ప్రకటనతో గ్రూప్-1 స్థాయి అధికారులు కొంత ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు.