గంపెడాశలు హరీష్ పైనే..

by Shyam |
గంపెడాశలు హరీష్ పైనే..
X

దిశ, మెదక్: రాష్ట్ర ఆర్థికశాఖ మంత్రి, సిద్దిపేట ఎమ్మెల్యే తొలిసారిగా అసెంబ్లీలో బడ్జెట్ ప్రవేశపెట్టనున్నారు.దీంతో హరీష్ రావు సొంత జిల్లాకు నిధుల పంపకంలో ప్రాధాన్యం ఉంటుందని పలువురు భావిస్తున్నారు. గత ప్రభుత్వంలో హరీష్ రావు రాష్ట్ర భారీ నీటి పారుదలశాఖ మంత్రిగా పనిచేశారు. ప్రస్తుతం ఆర్థిక శాఖ మంత్రిగా ఉన్నారు. దీంతో సిద్ధిపేట జిల్లా ప్రజలతో పాటు ఉమ్మడి మెదక్ జిల్లా ప్రజలు మంత్రి హరీష్ రావుపై గంపేడు ఆశలు పెట్టుకున్నట్టు తెలుస్తోంది.గతేడాది బడ్జెట్‌ను సీఎం కేసీఆర్ ప్రవేశపెట్టినప్పుడు లోటు బడ్జెట్ పేరుతో నిధుల కేటాయింపు సరిగా జరగలేదు. ఈ సారి మంత్రి హరీశ్ రావు బడ్జెట్ ప్రవేశపెట్టనుండటంతో ప్రాధాన్యత పెరిగింది. రాష్ట్రంపై పూర్తి పట్టు ఉన్న నాయకుడిగా హరీశ్ రావుకు మంచి పేరుంది. సాగునీటి వనరులు, ఇతర కార్యక్రమాలు, ప్రభుత్వ సంక్షేమ పథకాల గురించి ఆయనకున్నంత అవగాహన మరెవరికి లేదేమో. ఆ అనుభవంతోనే ఆర్థిక మాంధ్యంలో ఉన్న రాష్ట్ర పరిస్థితిని చక్కదిద్దడంలో ఆయన సఫలమయ్యారు. జిల్లాలోని రిజర్వాయర్లు, కాలువల నిర్మాణాలకి ఇంకా నిధుల అవసరం ఉంది. నిధుల లోపం వల్లే కాలువల నిర్మాణ పనులు ఆలస్యం అవుతున్నాయని పలువురు చర్చించుకుంటున్నారు. హరీష్ రావు చొరవతో మరిన్ని నిధులు సమకూరుతాయేమో చూడాలి. అలాగే జిల్లాలో కొత్తపల్లి-మనోహరాబాద్ రైల్వే లైన్ పనులు జరుగుతున్నాయి. ఇప్పటికే గజ్వేల్ పట్టణం వరకు పనులు పూర్తి కాగా రైలు కూడా ట్రయల్ రన్ జరుగుతున్నది. ఈ బడ్జెట్‌లో నిధులు కేటాయిస్తే స్టేషన్ల నిర్మాణం, ఇతర పనులు కూడా పూర్తవుతాయి. అభివృద్ధి కార్యక్రమాల్లో సిద్ధిపేట జిల్లాకి ఎవరు పోటీలోకి రారేమో. సీఎం కేసీఆర్, మంత్రి హరీశ్ రావు ఇద్దరూ జిల్లాకు చెందినవారే కావడంతో అభివృద్ధి పనులపరంగా సిద్దిపేట టాప్‌లో దూసుకుపోతుంది. గజ్వేల్, సిద్దిపేట నియోజకవర్గాలు రాష్ట్రానికే మోడల్‌గా నిలుస్తున్నాయి. అయితే ఇదే స్థాయిలో దుబ్బాక, హుస్నాబాద్, చేర్యాల ప్రాంతాలను అభివృద్ధి చేయాలనే డిమాండ్ ఆ నియోజకవర్గాల ప్రజల నుంచి వ్యక్తమవుతోంది. జిల్లాలో పలు పథకాల వల్ల లబ్దిదారులకు డబ్బులు రావాల్సి ఉంది. ఈ నేపథ్యంలో మంత్రి హరీశ్ రావు తొలిసారిగా బడ్జెట్ ప్రవేశపెడుతుండడం ప్రాధాన్యత సంతరించుకున్నది. జిల్లాలో కొత్త పనులకు మోక్షం కలిగే అవకాశాలున్నాయని జిల్లా వాసులు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు.

Advertisement

Next Story

Most Viewed