అపోహలు వద్దు.. దళిత బంధుపై మంత్రి హారీశ్ కీలక వ్యాఖ్యలు

by Anukaran |   ( Updated:2021-08-14 06:26:53.0  )
అపోహలు వద్దు.. దళిత బంధుపై మంత్రి హారీశ్ కీలక వ్యాఖ్యలు
X

దిశ ప్రతినిధి, కరీంనగర్ : హుజురాబాద్‌ ఉప ఎన్నిక సమయం దగ్గరపడుతున్న కొద్ది పొలిటికల్ హీట్ పెరుగుతోంది. శనివారం ఆర్థికశాఖ మంత్రి హరీశ్ రావు మీడియా సమావేశంలో పాల్గొన్నారు. ఈ సమావేశానికి మంత్రి గంగుల కమలాకర్, ఇతర టీఆర్ఎస్ నేతలు పాల్గొన్నారు. ఈ సందర్బంగా మంత్రి హరీశ్ రావు మాట్లాడుతూ.. దళిత బంధు కార్యక్రమాన్ని ఎల్లుండి(ఆగస్ట్ 16వ తేదీ, సోమవారం) సీఎం కేసీఆర్ హుజురాబాద్‌లో ప్రారంభిస్తారని అన్నారు. పైలట్ ప్రాజెక్టులో భాగంగానే దళిత బంధు కోసం హుజురాబాద్‌ను ఎంపిక చేసినట్టు తెలిపారు.

బీజేపీ నాయకులు, కొన్ని సంఘాల నాయకులు ప్రజల్లో అపోహలు, అనుమానాలు సృష్టిస్తూ ప్రజల్లో కన్ఫ్పూజన్ క్రియేట్ చేస్తున్నారని విమర్శించారు. హుజురాబాద్‌లోని ప్రతీ కుటుంబానికి దళిత బంధు అందిస్తామని.. ఎవరి చెప్పుడు మాటలు వినొద్దని ప్రజలకు కోరారు. రైతు బంధు కూడా ఇక్కడి నుంచే ప్రారంభించినప్పుడు కొందరికే వస్తుందని, ఎన్నికల కోసమే ఇస్తున్నారని బీజేపీ, కాంగ్రెస్ నాయకులు అప్పుడు కూడా తప్పుడు ప్రచారం చేసారని గుర్తు చేశారు. కానీ, కరోనా కష్టకాలంలోనూ నిరాటంకంగా రైతు బంధును రెండు పంటలకు ఇస్తున్నట్టు ఈ సందర్బంగా తెలిపారు.

రైతు బంధు ఇదే నియోజకవర్గంలో ప్రారంభించినప్పుడు చప్పట్లు కొట్టిన నాయకులు, ఇప్పుడు అదే చేతులతో గుండెలు బాదుకుంటున్నారు. అప్పుడు, ఇప్పుడు పథకాలపై అపోహలు సృష్టిస్తూ ప్రజలను రెచ్చగొట్టే ప్రయత్నం చేస్తున్నారని ఆరోపించారు. దళిత బంధును హుజురాబాద్‌లో అమలు చేయడానికి 2వేల కోట్లు కేటాయిస్తు కేబినెట్ నిర్ణయం తీసుకుందని తెలిపారు.

ఈ 2వేల కోట్లతో 20 వేల కుటుంబాలకు దళిత బంధు లబ్ధి చేకూరుతుందని అన్నారు. ఎన్నికల సమయంలోనే ఈ పథకం తెచ్చారని అంటున్నారు. కానీ ఆర్థిక మంత్రిగా నేనే ఈ పథకం కోసం బడ్జెట్ ప్రవేశపెట్టాను. సీఎం దళిత్ ఎంపవర్‌మెంట్ ప్రారంభిస్తున్నామని, ఎస్సీ, ఎస్టీ సబ్ ప్లాన్‌కు ఇది అదనమని ఆనాడే చెప్పామని తెలిపారు. అప్పుడు హుజురాబాద్ ఎన్నికలు లేకున్నా మార్చిలోనే ఈ కొత్త పథకాన్ని సీఎం ప్రకటించారని తెలిపారు.

ఇదే హుజురాబాద్‌లో రైతు బంధు ప్రారంభిస్తే ఒప్పు, ఇప్పుడు దళిత బంధు ప్రారంభిస్తే తప్పు ఎలా అవుతుందన్నారు. ఏ నాయకుడైనా, ప్రజాప్రతినిధి అయినా తన నియోజకవర్గ ప్రజలకు మేలు జరిగితే సంతోషిస్తారు, ఆహ్వానిస్తారని.. ప్రభుత్వానికి, సీఎంకు కృతజ్ఞతలు తెలుపుతారని అన్నారు. కానీ, దురదృష్టవశాత్తు ఇక్కడ నిరసలను చేపిస్తున్నారని విమర్శించారు. ప్రతిపక్ష నేతలకు నిజంగా ప్రజల మీద ప్రేమ ఉంటే మరో 10 లక్షలు కేంద్రం నుంచి తెచ్చి ఇవ్వండని కోరారు. బండి సంజయ్ చెప్పినట్లుగా మరో 40 లక్షలు అదనంగా తెచ్చిస్తే మీకు, మోడీకి ప్రజలు పాలాభిషేకం చేస్తారు. రాష్ట్రంలోని ప్రజలకు 50 లక్షలు వస్తే మేమెంతో సంతోషిస్తామని అన్నారు. వచ్చే ఏడాది బడ్జెట్ పెంచుకుని అన్ని నియోజకవర్గాల్లో దళిత బంధు అమలు చేయబోతున్నట్టు వెల్లడించారు.

సోమవారం జరిగే కార్యక్రమంలో ముఖ్యమంత్రి చేతుల మీదుగా 15 కుటుంబాలకు దళిత బంధు చెక్కులను అందిస్తామని అన్నారు. ప్రత్యేక అధికారులతో గ్రామసభలు నిర్వహించి, ప్రజల మధ్యే లబ్ధిదారుల ఎంపిక జరుగుతుందని తెలిపారు. సర్పంచ్, ఎంపీటీసీలు, జడ్పీటీసీల సమక్షంలో అత్యంత పారదర్శకంగా లబ్ధిదారులను ఎంపిక చేసి అందరికీ దళిత బంధు ఇస్తామని పేర్కొన్నారు. నియోజకవర్గంలోని ప్రతీ అర్హునికీ ఒకే దఫాలో దళిత బంధు ఇవ్వాలనే కృత నిశ్చయంతో ఉన్నామన్నారు. మీరు ఎన్ని ఇబ్బందులు పెట్టినా దళిత బంధు ఇచ్చి తీరుతామని వెల్లడించారు.

దళిత బంధు ఆపాలని కొందరు చూస్తున్నారు. దళిత బంధు ఆపాలని హైకోర్టులో కేసులేస్తున్నారు. దళిత జాతి మొత్తం ఈ వ్యవహారాలను గమనిస్తున్నారని అన్నారు. దీని వెనక ఎవరున్నారనేది వారు తెలుసుకుంటున్నారని తెలిపారు. తెలంగాణలో మేము ఇచ్చిన ప్రతీ హామీని నెరవేరుస్తూ వస్తున్నాము. రైతు బంధు, నిరంతర విద్యుత్, ఇంటింటికి మిషన్ భగీరథ నీరులాంటివన్నీ అమలు చేస్తున్నామని మంత్రి తెలిపారు. కరోనాతో అన్ని దేశాల ఆర్థిక వ్యవస్థలు దెబ్బతిన్నాయి. అయినా కూడా ప్రజలకిచ్చిన మాట నిలబెట్టుకోవడంలో మా ప్రభుత్వం ముందే ఉందన్నారు.

దళిత జాతిలో గుణాత్మమైన మార్పు తేవాలని ప్రభుత్వం ఈ పథకం తెచ్చింది. ఆర్థిక స్వావలంభన తేవాలని, వారి కాళ్లపై వారు నిలబడాలని ఈ స్కీం తెచ్చామని అన్నారు. దళిత బంధులాంటి మంచి పథకాన్ని మీ బీజేపీ తరపున ఒక్కరైనా ఆహ్వానించారా?. దళిత సోదరులు అపోహలు, పుకార్లు నమ్మొద్దు. ఆరు నూరైన అర్హులైన ప్రతీ కుటుంబానికి దళిత బంధు అంది తీరుతుందన్నారు.

ఈనెల 16న మధ్యాహ్నం 2 గంటలకు సీఎం సభకు వస్తారు. 4 గంటల వరకు సభ జరుగుతుందని అన్నారు. హుజురాబాద్ మండలంలోని వెంకట్రావుపల్లిలోని దళిత బస్తీలో గెల్లు శ్రీనివాస్‌కు అండగా ఉంటామని ఏకగ్రీవంగా మద్ధతు ప్రకటించారని తెలిపారు. దసరా రోజు పాలపిట్టను చూసేందుకు వెళ్లినంత సంబురంగా దళిత బంధు సభకు వస్తామని చెబుతున్నారని పేర్కొన్నారు. ఈ సందర్భంగా రోడ్డు ప్రమాదంలో చనిపోయిన ‘దిశ’ జర్నలిస్టు లక్ష్మణ్ రావుకు మంత్రి హరీశ్ రావు సంతాపం ప్రకటించారు. లక్ష్మణ్ రావు కుటుంబాన్ని అన్ని విధాల ఆదుకుంటామని మంత్రి హామీ ఇచ్చారు. జర్నలిస్టులుగా మీరు ధర్మాన్ని కాపాడాలి. జర్నిలిస్టు సహకారం ప్రభుత్వానికి ఎల్లవేళలా ఉండాలి. ప్రభుత్వ సహకారం కూడా మీకు ఉంటుందని తెలిపారు.

Advertisement

Next Story