ఈటలపై మంత్రి హరీశ్ ఘాటు వ్యాఖ్యలు.. రీతి, నీతి, జాతి ఏమైనా ఉన్నాయా..?

by Shyam |
ఈటలపై మంత్రి హరీశ్ ఘాటు వ్యాఖ్యలు.. రీతి, నీతి, జాతి ఏమైనా ఉన్నాయా..?
X

దిశ, కమలాపూర్ : సర్పంచ్, కౌన్సిలర్ కాకపోయినా ఈటలను ఎమ్మెల్యే, మంత్రిని చేసి నువ్వు నా తమ్ముడు అని నెత్తిన పెట్టుకున్న కేసీఆర్ లాంటి వ్యక్తికి గోరి కడతానన్న ఈటల మాటలకు రీతి, నీతి, జాతి ఉందా..? అని మంత్రి హరీష్ రావు ధ్వజమెత్తారు. హన్మకొండ జిల్లా కమలాపూర్ మండలం భీంపల్లి గ్రామంలో శుక్రవారం జరిగిన ధూమ్‌ధాం కార్యక్రమంలో ఆర్థికమంత్రి పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ఈటల పదవి ఉన్నా, లేకున్నా రైతులకు వ్యతిరేకంగా నల్ల చట్టాలను తెచ్చిన బీజేపీ పార్టీని గద్దె దించే వరకు కొట్లాడుతానన్న ఈటల.. పదవి కోసమే బీజేపీలో చేరాడని, బీజేపీలో ఏ సిద్ధాంతం కోసం చేరారో చెప్పాలని ప్రశ్నించారు. తాను పుట్టుకతోనే వామపక్ష వాదినని చెప్పుకుంటూ నేను లెఫ్టిస్తునని పదేపదే గుర్తుచేసే ఈటల.. రైటిస్టు పార్టీలో ఎలా చేరాడని ప్రశ్నించారు. ఈటలకు, బీజేపీ పార్టీకి నీతి, జాతి లేదని మండిపడ్డారు. ప్రజలు ఏమైనా పరవాలేదని, తన పదవి కాపాడుకోవాలని బీజేపీలో చేరినట్టు వెల్లడించారు.

ఈటలకు హుజురాబాద్ ప్రజల మీద ప్రేమ లేదని, మంత్రిగా ఉండి తన సహచర మంత్రులు డబుల్ బెడ్ రూమ్ ఇల్లు కట్టి లబ్ధిదారులకు అందించారని గుర్తుచేశారు. హుజరాబాద్ నియోజకవర్గానికి కేసీఆర్ నాలుగు వేల ఇండ్లు మంజూరు చేస్తే, ఒక్క ఇల్లు కూడా పూర్తి చేయలేదని ఆరోపించారు. ఈరోజు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం చెప్పిన ప్రతీ పథకం అమల్లో ఉందని, రైతులు అందరూ సంతోషంగా ఉన్నారని, దీనికి కారణం కేసీఆర్ అన్నారు. మన బాధలు తీరాలన్న, అభివృద్ధి కొనసాగాలన్న గెల్లు శ్రీనివాస్ యాదవ్‌‌ను అత్యధిక మెజార్టీతో గెలిపించాలని ప్రజలను కోరారు.

Advertisement

Next Story

Most Viewed