దేశ భక్తి ప్రతీ పౌరుడికి ఉంటుంది.. క్షుద్ర రాజకీయాలు చేయకండి..

by Shyam |   ( Updated:2021-03-25 09:59:36.0  )
దేశ భక్తి ప్రతీ పౌరుడికి ఉంటుంది.. క్షుద్ర రాజకీయాలు చేయకండి..
X

దిశ, వెబ్ డెస్క్ : రాజకీయ పదవులు కాదు.. రాష్ట్ర ప్రయోజనాలే శాశ్వతం.. తెలంగాణ బీజేపీ నేతలకు దేశభక్తి ఏమోగానీ భుక్తి అయితే ఉందని ఆర్ధికశాఖ మంత్రి తన్నీరు హరీష్ రావు ధ్వజమెత్తారు. దేశంలో ఏ రాష్ట్రానికి లేని విధంగా తెలంగాణ కోసం కొత్త చట్టం తేవాలని బండి సంజయ్ రాసిన లేఖలో పేర్కొనడం దుర్మార్గం.. రాజకీయ పదవుల కోసం రాష్ట్ర ప్రయోజలను పణంగా పెట్టడం బాధాకరమన్నారు. అసెంబ్లీలో పద్దులపై జరిగిన చర్చలో మంత్రి మాట్లాడారు. బీజేపీ నేతలు కేంద్రానికి లేఖలు రాసింది తెలంగాణలోని ప్రాజెక్టులకు అనుమతులు రాకుండా అడ్డుకునేందుకే అన్నారు. రాష్ట్రానికి ద్రోహం చేసే వాళ్ళను ద్రోహులు అంటామా? అనమా? అన్నారు. బీజేపీ నాయకులు తెలంగాణకు జాతీయ ప్రాజెక్టు తెస్తే సన్మానాలు చేస్తామని.. అందుకు కావాలంటే తీర్మానాలు సైతం చేస్తామని స్పష్టం చేశారు. బండి సంజయ్ కేంద్ర జలాశక్తికి లేఖ రాశారని.. అందులో సీడబ్ల్యూసీ క్లీయరెన్స్ వచ్చే వరకు పర్యావరణ అనుమతులు ఇవ్వొద్దని పేర్కొన్న విషయం వాస్తవం కాదా? అని ప్రశ్నించారు. బీజేపీ నాయకులకే కాదు.. దేశ ప్రజలందరికీ దేశ భక్తి ఉందని.. దేశభక్తి సరే రాష్ట్ర భక్తి ఎటుపోయిందో స్పష్టం చేయాలన్నారు. రాష్ట్ర పునర్ విభజన చట్టాన్ని కేంద్రం తుంగలో తొక్కి తెలంగాణకు అన్యాయం చేస్తుందని.. ఈ విషయం ఇక్కడి బీజేపీ నేతలకు తెలియదా అన్నారు. కేంద్రాన్ని ప్రశ్నించే సత్తా లేక తెలంగాణలో జరుగుతున్న అభివృద్ధిని అడ్డుకోవాలని చూడటం సిగ్గుచేటన్నారు. గతంలో నీటి ప్రాజెక్టులను ఆపేందుకు వేసిన కేసులను మంత్రి సభలో ప్రస్తావించారు.

ఏపీ ప్రాజెక్టులను ఆపేందుకు ఫైట్ చేస్తున్నాం

చట్ట విరుద్ధంగా ఏపీ ప్రభుత్వం నిర్మిస్తున్న ప్రాజెక్టులను ఆపేందుకు తెలంగాణ ప్రభుత్వం చట్టపరంగా పోరాడుతుందని మంత్రి హరీష్ రావు తెలిపారు. కేఆర్ఎంబీ, అఫెక్స్, కేంద్రం, గ్రీన్ ట్రిబ్యునల్ తో పాటు సుప్రీంకోర్టులో కేసువేశామని వెల్లడించారు. రాష్ట్ర ప్రయోజనాలే తమ లక్ష్యమని, వాటికి ఎలాంటి భంగం వాటిల్లకుండా ప్రభుత్వం చర్యలు తీసుకుంటుందన్నారు. ఎన్ని ప్రయత్నాలు చేసినా ఏపీ ప్రభుత్వం పనులు ఆపడం లేదని రాష్ట్ర ప్రయోజనాలను దృష్టిలో ఉంచుకొని అందరం కలిసి కట్టుగా పోరాడుదామని పిలుపు నిచ్చారు.

ఉద్యమకారుడిగా పాడెలను మోసా..

తెలంగాణ ప్రత్యేక రాష్ట్ర సాధన ఉద్యమంలో టీఆర్ఎస్ నాయకులంతా చురుకుగా పాల్గొన్నారని మంత్రి తెలిపారు. తెలంగాణ కోసం అమరులైన అమరుల శవాలను, పాడెలను మోసిన విషయాన్ని గుర్తు చేశారు. తెలంగాణ కోసం పోరాడిన చరిత్ర టీఆర్ఎస్‌ది అన్నారు. నాడు కేసీఆర్ మంత్రి పదవికి సైతం రాజీనామా చేసి తెలంగాణ కోసం కొట్లాడడని తెలిపారు. తెలంగాణ వచ్చిన తర్వాత రాష్ట్రంలో ప్రాజెక్టులను నిర్మించుకున్నామని .. భూగర్భజలాలు సైతం పెరిగాయని ఇక్కడి వాటర్ గురించి నేడు ఐఏఎస్ లకు పాఠ్యపుస్తకాల్లో చెప్తున్నారన్నారు.

టీ కాంగ్రెస్ నేతలు ఉద్యమంలో పాల్గొనలేదు

రాష్ట్ర సాధన ఉద్యమంలో టీ కాంగ్రెస్ నేతలు పాల్గొనలేదని… పోరాటం చేయలేదని మంత్రి హరీష్ రావు విరుచుకుపడ్డారు. నాడు పదవుల కోసం పాకులాడారు తప్ప.. ప్రజా సమస్యలు ఏనాడూ పట్టించుకోలేదని ధ్వజమెత్తారు. తెలంగాణ కోసం పీజేఆర్ తప్ప మిగతా వారు ఎవ్వరూ ఉద్యమానికి సహకరించలేదని, పాల్గొనలేదన్నారు. ఇప్పడు తెలంగాణ కోసం పోరాడామని చెప్పుకోవడం హాస్యాస్పదమన్నారు.

కాళేశ్వరంపై గ్లోబల్ ప్రచారం..

తెలంగాణ ప్రభుత్వం ప్రజలకు సాగు, తాగునీరందించేందుకు ప్రతిష్ఠాత్మకంగా కాళేశ్వరం ప్రాజెక్టును నిర్మించిందని మంత్రి తెలిపారు. లక్షల ఎకరాలకు ప్రాజెక్టుతో నీరందిస్తున్నామని కొంత మంది పని గట్టుకొని ఈర్ష్యతో ప్రాజెక్టుకు డీపీఆర్ లేదని గ్లోబల్స్ ప్రచారం చేస్తున్నారని దీనిని తీవ్రంగా ఖండిస్తున్నట్లు వెల్లడించారు. డీపీఆర్ లేకుండా కేంద్రం ప్రాజెక్టు నిర్మాణానికి అనుమతి ఎలా ఇస్తుందని ప్రశ్నించారు. అన్ని అనుమతులతోనే ప్రాజెక్టును నిర్మించామని తెలిపారు. ఎవరికైనా అనుమతులపై అనుమానం ఉంటే వస్తే పూర్తి సమాచారం ఇస్తామన్నారు. ప్రజాస్వామ్యంలో ప్రజలే దేవుళ్లు.. రాష్ట్ర అభివృద్ది కోసం రాజకీయాలను పక్కన బెట్టి అందరం కలిసి కట్టుగా పని చేద్దామని కోరారు.

Advertisement

Next Story