కరోనా బాధితులకు అండగా ఉంటాం : మంత్రి

దిశ, హన్మకొండ: మంత్రి కేటీఆర్ పుట్టినరోజు సంద‌ర్భంగా ‘స్మైల్ ఎ గిఫ్ట్’లో భాగంగా ఉమ్మడి వరంగల్ జిల్లా నుంచి ఇచ్చిన 14 అంబులెన్సుల్లో నాగులు వాహనాలను మంత్రి ఎర్ర‌బెల్లి ద‌యాక‌ర్ రావు, ప్ర‌భుత్వ చీఫ్ విప్ దాస్యం విన‌య్ భాస్క‌ర్, మేయ‌ర్ గుండా ప్ర‌కాశ్ రావు, ఎమ్మెల్యే ఆరూరి ర‌మేశ్‌తో క‌లిసి సోమ‌వారం ప్రారంభించారు. ఈ సంద‌ర్భంగా ఎర్రబెల్లి మాట్లాడుతూ… కేటీఆర్ జ‌న్మ‌దినోత్స‌వాన్ని పుర‌స్క‌రించుకుని, క‌రోనా బాధితుల‌కు అండ‌గా ఉండేందుకు వీలుగా ఉమ్మ‌డి వ‌రంగ‌ల్ జిల్లా నుంచి 14 అంబులెన్సులను ఎమ్మెల్యేలు, మేయ‌ర్ త‌దిత‌రులంతా క‌లిసి ఇచ్చార‌న్నారు.

వాటిని ఇటీవ‌లే కేటీఆర్ చేతుల మీదుగా ప్రారంభించామ‌ని, వ‌రంగ‌ల్‌లో ఈరోజు 4 వాహ‌నాల‌ను ప్రారంభించినట్టు వెల్లడించారు. అందులో ఒక‌టి భూపాల‌ప‌ల్లి, జ‌న‌గామ‌, పాల‌కుర్తి నియోజ‌క‌వ‌ర్గానికి రెండు వాహ‌నాలు కేటాయించగా, సేవలు మొదలైనట్టు చెప్పారు. భూపాల‌పల్లి వాహ‌నాన్ని ఎమ్మెల్యే గండ్ర వెంక‌ట‌ర‌మ‌ణారెడ్డి, జ‌న‌గామ వాహనాన్ని మేయ‌ర్ గుండా ప్ర‌కాశ్ రావు, పాల‌కుర్తి వాహ‌నాల‌ను ఒద్దిరాజు ర‌విచంద్ర‌, సంతోశ్ రెడ్డిలు ఇచ్చార‌ని, వారికి మంత్రి ధ‌న్య‌వాదాలు తెలిపారు. మిగ‌తా వాహ‌నాలు కూడా త్వ‌ర‌లోనే అందుబాటులోకి వ‌స్తాయ‌ని తెలిపారు.

Advertisement