ముంబై టు చైనా.. 4500 కి.మీ. ప్రయాణించిన శాండ్ పైపర్

by Shyam |   ( Updated:2021-06-03 04:09:07.0  )
ముంబై టు చైనా.. 4500 కి.మీ. ప్రయాణించిన శాండ్ పైపర్
X

దిశ, ఫీచర్స్ : మనుషులకు మాత్రమే సరిహద్దు ఆంక్షలుంటాయి కానీ పక్షులకు బౌండరీలు తెలియవు. స్వేచ్ఛగా ఆకాశంలో విహరిస్తూ సప్త సముద్రాలు, ఖండాంతరాలు దాటి ప్రయాణిస్తుంటాయి. అలా వందలాది రకాల పక్షులు ప్రతి ఏటా కాలాలనుగుణంగా వివిధ దేశాలకు వలస వెళుతుంటాయని తెలిసిన విషయమే. ఈ క్రమంలోనే బుజ్జిపిట్ట ‘శాండ్ పైపర్’ గమనాన్ని తెలుసుకోవడానికి భారతదేశపు పురాతన వన్యప్రాణి పరిశోధనా సంస్థలలో ఒకటైన ‘బాంబే నేచురల్ హిస్టరీ సొసైటీ’(బిఎన్‌హె‌చ్ఎస్) ప్రయత్నించింది. ఈ నేపథ్యంలోనే ముంబైలో మూడు సంవత్సరాల క్రితం తిరుగాడిన కర్ల్ శాండ్‌పైపర్ ప్రస్తుతం పాకిస్తాన్‌లో కనువిందు చేసింది.

ఫిబ్రవరి 2018లో శీతాకాలంలో ఒడిశాలోని చిలికా సరస్సు వద్ద కనిపించిన ‘నార్తరన్ షోవెలర్’ బర్డ్, ఆ తర్వాత ఏప్రిల్ 2021లో ఉజ్బెకిస్తాన్‌లోని యజ్యావన్ వద్ద కనిపించింది. అలానే గుజరాత్ గల్ఫ్ ఆఫ్ కచ్ వద్ద ‘టెరెక్ శాండ్‌పైపర్’ (ట్రాకింగ్ కోసం ట్యాగ్ చేసిన) స్వేచ్ఛగా విహరించగా, అదే పక్షి మూడు సంవత్సరాల తరువాత గత మే నెలలో చైనాలో చక్కర్లు కొట్టింది. అదేవిధంగా, మార్చి 2019లో నవీ ముంబైలో టాగ్ చేసిన కర్లీ శాండ్‌పైపర్, అంతర్జాతీయ సరిహద్దులను ధిక్కరించి వేలాది కిలోమీటర్ల దూరం ప్రయాణించి మే నెలలో చైనాలో కనిపించింది. దీని ప్రయాణాన్ని బాంబే నేచురల్ హిస్టరీ సొసైటీ (బిఎన్‌హె‌చ్ఎస్) నమోదు చేయగా, ‘బర్డ్ మైగ్రేషన్’ అధ్యయనంలో ఇదో పెద్ద మైలురాయి అని అధికారులు తెలిపారు.

కర్లీ శాండ్‌పైపర్ పక్షి మొదట టండ్రా ఆఫ్ ఆర్కిటిక్ సైబీరియా నుంచి ఇక్కడకు వచ్చింది. ఈ పక్షులు ఆఫ్రికా, దక్షిణ, ఆగ్నేయ ఆసియాతో పాటు, ఆస్ట్రేలియా, న్యూజిలాండ్‌‌ల నుంచి కూడా వలస వెళుతుంటాయి. దీనిని తొలిసారి చూసిన బిఎన్‌హెచ్‌ఎస్ శాస్త్రవేత్త మృగంక్ ప్రభు, అతని బృందం 2019 మార్చి 18న నవీ ముంబైలోనిపామ్ బీచ్ రోడ్ సమీపంలో ప్రత్యేకమైన ఫ్లాగ్ నంబర్ 7ఎన్5తో ట్యాగ్ చేయగా అదే పక్షి మళ్లీ చైనాలో కనిపించిందని ప్రభు తెలిపాడు.

1927లో స్థాపించిన బిఎన్‌హె‌చ్ఎస్ ‘బర్డ్ మైగ్రేషన్’ ట్రాక్ చేయడంలో ఉత్తమ పనితీరు కనబరుస్తుంది. పక్షుల వలసలు, అవి దాటిన అంతర్జాతీయ సరిహద్దులు, వాటి ప్రయాణంలో అవి జయించిన అవరోధాలపై విశ్లేషణ చేస్తోంది. ఇది పక్షులపై రంగు-జెండాలు, బ్యాండ్లతో పాటు, మెడ-కాలర్లను కూడా ఉపయోగిస్తుంది. ఈ కలర్ కాంబినేషన్స్ అంతర్జాతీయ ఫ్లైవే ప్రోటోకాల్‌లకు అనుగుణంగా ఉంటాయి. ట్యాగ్ చేసిన పక్షులను, వాటికి అమర్చిన జెండాలను అధిక రిజల్యూషన్ ఫొటోల ద్వారా గుర్తిస్తారు. ప్రతి సంవత్సరం, ప్రపంచవ్యాప్తంగా 50 బిలియన్ పక్షులు వలస వెళుతున్నాయి. పక్షుల మార్గం, ప్రయాణించిన సమయం, ఎకాలజీ ఆఫ్ మైగ్రేషన్ (వలస జీవావరణ శాస్త్రం) తెలుసుకోవడం వల్ల వాటి సామర్థ్యం, వాటి అవసరాలతో పాటు జీవలక్షణాలు తెలుస్తాయని బిఎన్‌హె‌చ్ఎస్ తెలిపింది.

Advertisement

Next Story