- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
‘గల్ఫ్ కార్మికుల’నయా ప్లాన్.. సోషల్ మీడియానే ప్రధాన అస్త్రం..!
దిశ ప్రతినిధి, కరీంనగర్ : సామాన్యులే తమ బలం.. ప్రచారానికి సోషల్ మీడియానే ప్రధాన అస్త్రంగా ఉపయోగిస్తూ జాతీయ పార్టీ ఏర్పాటుకు కసరత్తులు చేస్తున్నారు గల్ఫ్ వలస కార్మిక ప్రతినిధులు. ఐదు రోజులుగా ఢిల్లీలోనే మకాం వేసిన వీరంతా వివిధ రాష్ట్రాల ప్రతినిధులతో సంప్రదింపులు జరిపి జాతీయ పార్టీ ఏర్పాటు కోసం అవసరమైన కసరత్తులు ప్రారంభించారు. భారత ఎన్నికల కమిషన్‌లో పార్టీ ఏర్పాటుకు సంబంధించిన ప్రక్రియ పూర్తి చేసేందుకు అవసరమైన కార్యాచరణను రూపొందించే పనిలో నిమగ్నం అయ్యారు.
వలస కార్మికులతో మమేకం…
ఐదు రోజులుగా ఢిల్లీలో జరిగిన సమాలోచనల నేపథ్యంలో గల్ఫ్ వలస కార్మికులే కాకుండా, దేశ వ్యాప్తంగా ఉన్న వలస కార్మికులను కూడా కలుపుకుపోవాలని భావిస్తున్నారు. గల్ఫ్ దేశాలకు వలస వెళ్లిన కార్మికులు 88 లక్షలు ఉండగా, దేశంలోనూ ఉపాధి కోసం ఇతర రాష్ట్రాలకు వలస వెళ్లి జీవనం సాగిస్తున్న వారి అంశాలను కూడా పరిగణనలోకి తీసుకుని దేశీయ, అంతర్జాతీయ ప్రవాసీలతో మమేకం అయ్యే విధంగా పార్టీ ఏర్పాటు ఉండాలని తుది నిర్ణయానికి వచ్చారు. లాక్‌డౌన్ అమలు చేసినప్పుడు దేశంలో ఉపాధి కోసం వలస వెళ్లి తమ స్వస్థలాలకు కాలినడకన వెళ్లిన వలస పక్షులే 4 కోట్ల మంది ఉంటారని అధికారిక లెక్కలు చెబుతున్నాయని వీరు చర్చించారు. ఈ అంశాలను పరిశీలించిన ప్రతినిధులు ప్రవాసీ కార్మికుల చైతన్యమే లక్ష్యంగా పార్టీ ఏర్పాటు చేసే యోచనలో ఉన్నారు. వీరందరిని ఒకే తాటి మీదకు తీసుకువచ్చేందుకు కార్యాచరణ కూడా రూపొందిస్తున్నారు.
ఎన్నికల ఎత్తుగడ..
అధికారమే లక్ష్యంగా వలస కార్మికుల నినాదం ఎత్తుకుని ముందుకు సాగడం ముఖ్యం కాదని వారి హక్కులను సాధించడమే ముఖ్య ఉద్ధేశ్యంగా ప్లాన్ చేస్తున్నారు. అయితే ఎన్నికల్లో పోటీ చేయించేందుకు సామాన్య వలస కార్మికులనే బరిలో నిలిపాలని దీనివల్ల గెలవడం కన్నా గెలుపోటములను శాసించడమే అవసరమని భావిస్తున్నారు. ఇండిపెండెంట్ అభ్యర్ధులు కూడా 10 వేల వరకు కొన్ని నియోజకవర్గాల్లో ఓట్లను చీల్చడంతో గెలిచే అభ్యర్థుల తల రాతలను మార్చగలిగారని కూడా గుర్తించిన వీరు వలస కార్మికుల నినాదంతో జాతీయ స్థాయి పార్టీకి సన్నాహాలు చేస్తున్నారు. ప్రచార ఆర్బాటాలు లేకుండా సోషల్ మీడియా వేదికగానే ప్రచారాన్ని చేసి ప్రజల్లోకి చొచ్చుకుపోయే విధంగా వ్యూహం రచిస్తున్నారు. ఇప్పటికే పలు రాష్ట్రాలకు చెందిన వలస కార్మికుల ప్రతినిధులతో చర్చించిన తెలంగాణ గల్ఫ్ వర్కర్స్ అసోసియేషన్ (తెగువ) ఒక్కో అడుగు ముందుకు వేసేందుకు సమాయత్తం అవుతోంది. ఈ ఏడాది చివరికల్లా పార్టీ పేరు నిర్ణయించడంతో పాటు జాతీయ ఎన్నికల కమిషన్‌లో రిజిస్టర్ చేయించే ప్రక్రియను పూర్తి చేయాలని భావిస్తున్నారు.
నిఘా వర్గాల ఆరా…
తెగువ ప్రతినిధులు పొలిటికల్ పార్టీ ఏర్పాటుపై చేస్తున్న కసరత్తుల గురించి నిఘా వర్గాలు ఆరా తీస్తున్నాయి. ఈ ప్రతినిధుల కుటుంబ నేపథ్యం, ఆర్థిక స్థితిగతులతో పాటు వెన్నుదన్నుగా నిలుస్తున్న వారెవరూ అన్న వివరాలు సేకరించే పనిలో ఇంటెలిజెన్స్ ఉంది. వీరి అంచనాలు ఏంటీ, ఏ పార్టీని లక్ష్యంగా పెట్టుకుని ముందుకు సాగుతున్నారు, వీరు పార్టీ పెట్టడం వల్ల జరిగే నష్టం తదితర సమగ్రమైన వివరాలను సేకరిస్తున్నట్టు తెలుస్తోంది.