పూడూరు ఖాదీ భూములపై ఎమ్మెల్యే విద్యాసాగర్ రావు క్లారిటీ..

by Sridhar Babu |
korutla-mla vidya sagar rao
X

దిశ, జగిత్యాల : జగిత్యాల జిల్లాలోని కొడిమ్యాల మండలం పూడూర్ గ్రామంలోని మెట్‌పల్లి ఖాదీ గ్రామోద్యోగ ప్రతిష్టాన్‌కు సంబంధించిన స్థలంలోని కొంత భాగాన్ని గత పాలక మండలి తీర్మానం మేరకు అన్ని నిబంధనలు పాటిస్తూ విక్రయించామని ఛైర్మన్, మెట్‌పల్లి ఎమ్మెల్యే కల్వకుంట్ల విద్యాసాగర్ రావు తెలిపారు. పూడూర్ మండల కేంద్రంలోని భూమిపై పూర్తి యాజమాన్య హక్కులు ఖాదీ ప్రతిష్టాన్ చెందినవని, కార్మికులకు ఈ భూమిపై ఎలాంటి హక్కులు లేవన్నారు. చేనేత వస్త్రాలకు గిరాకీ లేకపోవడంతో చాలామంది చేనేత వృత్తికి దూరమయ్యారని, కట్టడాలు శిథిలావస్థకు చేరుకున్నాయని వివరించారు. పునర్వ్యవస్థీకరణకు కార్మికులు ఎవరూ ముందుకు రాకపోవడంతోనే గత పాలక మండలి ఈ భూమిని అమ్మడానికి నిర్ణయించిందన్నారు.

మూడేళ్ల కిందటే అప్పటి చైర్మన్ రాజేశ్వరరావు ఆధ్వర్యంలో పూడూరులో నిరూపయోగంగా ఉన్న భూమిని అమ్మాలని తీర్మానించారన్నారు. ఆనాడే, గుంటకు రూ.4 లక్షల చొప్పున ఒప్పందం కుదిరిందని, ఆయన మరణంతో రిజిస్ట్రేషన్ మా హయాంలో చేయాల్సి వచ్చిందన్నారు. ఇప్పటికీ పూడూర్ రోడ్డు వైపు వంద అడుగుల పొడవు 35 అడుగుల వెడల్పుతో ఖాదీ ప్రతిష్టాన్‌కు స్థలం ఉందన్నారు. ఆ స్థలంలో షాపింగ్ కాంప్లెక్స్, ఆఫీసు, వసతి గృహం నిర్మిస్తున్నామని విద్యాసాగర్ రావు చెప్పారు. అలాగే కరీంనగర్ 2వ పోలీసు స్టేషన్ దగ్గర ఉన్న 4 గుంటల భూమిలో దుకాణాలు, ఆఫీస్, వసతి గదులు నిర్మించడానికి, మున్సిపల్ అనుమతులు తీసుకున్నామన్నారు. కరోనాతో పూడూర్, కరీంనగర్‌లలో నిర్మాణాలు ఆలస్యం అయ్యాయని, ఇందులో ఎలాంటి అవకతవకలు జరగలేదని ఎమ్మెల్యే స్పష్టంచేశారు. స్థానికంగా ఉన్న కొంతమంది అక్కడ ఉన్న ధరకు భూమి అమ్మడానికి బదులుగా తక్కువ ధరకు అమ్మారని రాజకీయం చేస్తున్నారని, గ్రామంలో చుట్టు పక్కల ఉన్న భూముల మార్కెట్ ధరకు అనుగుణంగానే విక్రయించి ప్రజలకు ఉపయోగపడేలా వ్యాపార సముదాయాలు నిర్మిస్తున్నామన్నారు. అభివృద్ధిని అడ్డుకునే విధంగా ఆరోపణలు చేయడం సరికాదని విద్యాసాగర్ రావు విమర్శించారు.

Advertisement

Next Story

Most Viewed