కంచాన వడ్డించగా.. గుటకలేయగా?

by sudharani |
కంచాన వడ్డించగా.. గుటకలేయగా?
X

దిశ, వెబ్ డెస్క్:

‘‘పంచెకట్టుటలో ప్రపంచాన మొనగాడు
కండువా లేనిదే గడప దాటనివాడు
పంచభక్షాలు తమ కంచాన వడ్డించ
గోంగూర కోసమై గుటకలేసేవాడు
ఎవడయ్య ఎవడువాడు ఇంకెవడయ్య తెలుగువాడు’’ అని గోంగూరతో తెలుగు వారికి ఉన్న సంబంధాన్ని అద్భుతంగా అభివర్ణించారు సాహితీ వటవృక్షం డాక్టర్ సి.నారాయణరెడ్డి. గోంగూర అంటే తెలుగు వారికి ప్రత్యేకం.. తెలుగునాట గోంగూరకు ఉన్న ప్రాధాన్యత అంతాఇంతా కాదు. దీన్ని ఇష్టంగా భుజిస్తారు. పచ్చడి వేసుకున్నా.. పులుసుగా తిన్నా గోంగూర రుచి దేనికి ఉండదంటారు. పెళ్లయినా, పేరంటమైనా, ఏ శుభకార్యం జరిగినా గోంగూర చేయాల్సిందే. తెలుగువారి జీవనం ముడిపడింది గోంగూరతో. అయితే, సాధారణంగా కొంత మంది ఆకుకూరలు అంటే ఇష్టంగా తినరు. పక్కకు పెట్టేస్తుంటారు. కానీ, ఆ పచ్చటి ఆకులతో శరీరం చాలా హాయిగా, ఆరోగ్యంగా ఉంటుందని నిపుణులు అంటున్నారు. పండ్లలో మహారాజు ఉన్నట్టే ఆకుకూరలలో కూడా మేటిగా ఒకటుంది. అదే గోంగూర.

గోంగూరలో ఉన్న పోషకాలు..

గోంగూర పచ్చడి అంటే.. నోట్లో నీళ్లూరిపోతాయి చాలా మందికి.గోంగూరలో ఉన్న పోషకాలు ఇక దేంట్లోను ఉండవంటున్నారు ఆరోగ్య నిపుణులు. రోజూ గోంగూర తినడం వల్ల కాల్షియం, విటమిన్ ఏ, విటమిన్ సీ తోపాటు పీచు పదార్థాలు లభిస్తాయి. అరుగుదలకు కూడా ఎంతో ఉపయోగపడుతుందట. గోంగూరలో ఉన్న గుణాలు శరీరంలోని పెద్ద పెద్ద గడ్డలను తగ్గిస్తాయట. గోంగూర ఆకులను ఆముదంతో కలిపి నూరి ఆ మిశ్రమాన్ని కొద్దిగా వేడి చేసి గడ్డలపై పూతగా పూస్తే వాపులన్నీ ఇట్టే తగ్గిపోతాయి. కొన్ని సీజన్లలో వచ్చే వ్యాధులూ గోంగూర తినడం వల్ల తగ్గిపోతాయట. ఇలా ఎన్నో ఔషధ గుణాలు ఒకే ఒక గోంగూరలో ఉన్నాయి కాబట్టి గోంగూర తప్పక ప్రతి ఒక్కరూ తినాలని వైద్యులు చెబుతున్నారు.

Tags: Mesta, good for health, telugu people, eat,

Advertisement

Next Story

Most Viewed