‘మంచు’ చిరుతల రక్షణే లక్ష్యంగా..

by Shyam |
‘మంచు’ చిరుతల రక్షణే లక్ష్యంగా..
X

దిశ, వెబ్‌డెస్క్: కేంద్రపాలిత ప్రాంతం ‘లడఖ్’ అనగానే గుర్తొచ్చేది ఎత్తైన కొండలు, మంచు పర్వతాలు. నిజానికి లడఖ్ అంటే కూడా ‘ఎత్తైన పర్వత రహదారి ప్రాంతాల భూమి’ అనే అర్థం. పేరుకు తగ్గట్లే హిమాలయాలతో కూడిన ఈ అద్భుత భూభాగం.. అరుదైన జంతువులైన మంచు చిరుతలు, తోడేళ్లు, ఇతర క్షీరదాలకు ఆలవాలం. కాగా పెరుగుతున్న కాలుష్యం, స్థానిక తెగల వేట, ఇతర కారణాల రీత్యా.. మంచు చిరుతలు(పిల్లి జాతి), తోడేళ్లు ఇతర క్షీరదాలు అంతరించిపోయే పరిస్థితులు ఏర్పడుతున్నాయి. తద్వారా అక్కడ జీవవైవిధ్యం దెబ్బతినే ప్రమాదం పొంచి ఉంది. ఈ నేపథ్యంలో ఓ ఇద్దరు లడఖ్ వాసులు.. మంచు చిరుతల రక్షణతో పాటు వన్యప్రాణుల సంరక్షణకు పాటుపడుతున్నారు. ఆ ఇద్దరు వ్యక్తులు ఎవరు? వారు స్థాపించిన సంస్థల ద్వారా అరుదైన జంతు జాతుల రక్షణకు ఎలాంటి చర్యలు తీసుకుంటున్నారు? తెలియాలంటే ఈ స్టోరీ చదవాల్సిందే.

లడఖ్‌లోని నుబ్రా తహసీల్, సెరెన్ గ్రామానికి చెందిన రించెన్ వాంగ్‌చుక్ ఇండియన్ ఆర్మీ సోల్జర్. తండ్రి కల్నల్ కావడంతో దేశ రక్షణకోసం పని చేయాలని తాను కూడా ఇండియన్ ఆర్మీలో చేరాడు. గ్రామంలోనే పుట్టి పెరిగిన వాంగ్‌చుక్‌.. చిన్నప్పుడు పశువుల కాపరులతో కలిసి తిరుగుతూ పిల్లులు, అరుదైన జంతువులపై ప్రేమ పెంచుకున్నాడు. అయితే ఆర్మీ నుంచి రిటైర్ అయిన తర్వాత వాంగ్ చుక్‌.. స్థానిక తెగల వేటలో, మారిన పర్యావరణ పరిస్థితుల్లో ఈ అరుదైన జంతు జాతులన్నీ అంతరించిపోవడాన్ని గుర్తించాడు. ఈ క్రమంలో స్థానిక తెగలకు చెందిన ప్రజలను భాగస్వాములను చేస్తూ జంతువుల రక్షణ కోసం ‘స్నో లియోపార్డ్ కన్జర్వెన్సీ(మంచు చిరుత సంరక్షణ), ఇండియా ట్రస్ట్ (ఎస్ఎల్‌సీ-ఐటీ) స్థాపించాడు. 2011లో వాంగ్ చుక్ నరాల వ్యాధితో మరణించగా, కొన్ని రోజుల తర్వాత ఈ ట్రస్ట్ బాధ్యతలను వన్యప్రాణి శాస్త్రవేత్త డాక్టర్ సెవంగ్ నంగేల్ తీసుకున్నారు. ప్రస్తుతం ఈ ట్రస్ట్‌కు ఆయనే డైరెక్టర్‌గా కొనసాగుతున్నారు.

లేహ్ టౌన్‌కు 125 కిలోమీటర్ల దూరంలో ఉన్న స్కుబుచాన్ గ్రామానికి చెందిన సెవంగ్ నంగేల్.. ప్రకృతి ప్రేమికుడు. బాల్యంలో ఎక్కువ కాలం పర్వతాలు, జంతువుల మధ్య గడిపాడు. వన్యప్రాణాల మధ్య తిరిగే సెవంగ్ వారాంతాల్లో మాత్రమే స్కూల్‌కు వెళ్లేవాడు. ఎప్పుడూ పచ్చిక బయళ్లలో పశువుల కాపరులతో గొర్రెలు, మేకల మధ్య ఉండే సెవంగ్.. మంచు చిరుతలను చిన్నప్పటి నుంచే ఇష్టపడటం ప్రారంభించాడు. గొర్రెలు, మేకలను మేతకు తీసుకెళ్లినప్పుడు కొన్నింటిని మంచు చిరుతల వల్ల కోల్పోయాడు. ఇక తండ్రి ఉద్యోగరీత్యా ఇతర ప్రదేశాలకు వెళ్లిన సెవంగ్.. గ్రాడ్యుయేషన్ పూర్తి చేసుకున్నాడు. అనంతరం అంతర్జాతీయ మంచు చిరుత ట్రస్ట్‌లో ఫీల్డ్ అసోసియేట్‌గా చేరాడు. తిరిగి స్వగ్రామం చేరుకొని పర్వత ప్రాంతాల్లో పలు సర్వేలు నిర్వహించాడు.

పర్వత ప్రాంతాల్లోని గ్రామీణ తెగలు మంచు చిరుతల వల్ల పడుతున్న ఇబ్బందులు గమనించాడు. వాటి నుంచి గ్రామీణ తెగల పశువులు, గొర్రెలను ఎలా రక్షించాలి? అనే ఆలోచన చేశాడు. చిరుతల నుంచి పశువులను రక్షించుకునే క్రమంలోనూ స్థానిక తెగల వేటకు బలై కేవలం 250 మంచు చిరుతలు మాత్రమే మిగిలాయని అంచనాకొచ్చిన సెవంగ్.. వాటిని కూడా రక్షించాలని నిర్ణయించుకున్నాడు. రించెన్ స్థాపించిన ఎస్ఎల్‌సీ-ఐటీ ద్వారా స్థానిక తెగల పశువుల రక్షణకు షెడ్లు నిర్మించడం ప్రారంభించారు. బలంగా ఉండే ఈ షెడ్లతో 5 వేల మందికి లాభం చేకూరింది. వీటిని టూరిస్టు స్పాట్లుగా కూడా మార్చారు. హేమిస్ జాతీయ పార్కు పరిసర ప్రాంతాలు, శాం లడఖ్, జంస్కర్ ప్రాంతాల్లో టూరిజం స్పాట్లు ఏర్పాటు చేయడంతో పర్యాటకుల సందడి పెరిగింది. ట్రెక్కింగ్ స్పాట్స్‌లో విజిటర్స్ ఎంజాయ్ చేస్తున్నారు. ఈ ప్రాంతాల్లో స్థానిక మహిళలు వెదురు ద్వారా ఉత్పత్తి చేసే చేనేత ఉత్పత్తులకు(వస్త్రరంగానికి) మార్కెట్ ఏర్పడుతోంది. ఇలా రించెన్ ఆశయాలను సెవంగ్ నంగేల్ ముందుకు తీసుకెళ్తున్నాడు. మంచు చిరుత పులులను, వన్యప్రాణులను సంరక్షించడమే జీవిత లక్ష్యంగా ముందుకు సాగుతున్నాడు.

Advertisement

Next Story

Most Viewed