ఇంటర్నెట్ ఫేవరెట్ ఈ లేడీ డాక్టర్

by Shyam |
ఇంటర్నెట్ ఫేవరెట్ ఈ లేడీ డాక్టర్
X

దిశ, వెబ్‌డెస్క్: సెక్స్..ఈ పేరును బయటికి గట్టిగా అనడానికి కూడా ఇప్పటికీ కొందరు మొహమాటపడుతుంటారు. అందరూ చేసేదే అయినా మాట్లాడటానికి మాత్రం సంకోచం ఎందుకో అర్థం కాదు. దీని గురించి ఎక్కువగా మాట్లాడరు కాబట్టే ఎన్నో సెక్స్ సంబంధిత, మర్మావయవాల సంబంధిత ఆరోగ్య సమస్యలతో బయటికి చెప్పుకోలేక ఇబ్బంది పడుతుంటారు. వారి సమస్య గురించి ఇంట్లో వాళ్లతో చెప్పలేరు. డాక్టర్‌కు కూడా సరిగా చెప్పలేనివారు కొందరు ఉంటారు. దీనంతటికీ కారణం సరైన సెక్స్ ఎడ్యుకేషన్ లేకపోవడమే. పాఠశాల విద్యలో ప్రత్యుత్పత్తి ఎలా జరుగుతుందనేది నేర్పిస్తారు. కానీ, దానికి కారణమైన అవయవాల పరిశుభ్రత గురించి, పనితీరు గురించి నేర్పించరు. ఇక ఆడవాళ్ల సంగతి అయితే చెప్పనక్కర్లేదు. తమ సొంత పార్టనర్‌తో కూడా ఇలాంటి విషయాలను షేర్ చేసుకోలేక ఇబ్బంది పడుతుంటారు. సరైన సెక్స్ ఎడ్యుకేషన్ లేని కారణంగా లైంగిక దాడులు, ఈవ్‌టీజింగ్‌లు జరుగుతున్నాయని పరిశోధనలు చెబుతున్నాయి.

మరి ఈ కాలంలో ఏ సమస్యకైనా పరిష్కారాన్ని చూపించే ఇంటర్నెట్‌ ద్వారా సరైన సెక్స్ ఎడ్యుకేషన్ పొందే అవకాశం లేకుండా పోయింది. ఎందుకంటే గూగుల్‌లో సెక్స్ అని టైప్ చేయగానే బూతు వీడియోలు వస్తున్నాయి. దీంతో సమస్యను పక్కన పెట్టి, తప్పుదారి పడుతున్న పరిస్థితి ఏర్పడుతుంది. అయితే సరైన ప్లాట్‌ఫాంను పట్టుకోగలిగితే కావాల్సినంత జ్ఞానం పొందవచ్చు. అలాంటి ఒక సరైన ప్లాట్‌ఫాం ఇన్‌స్టాగ్రాం. ఇందులో సెక్స్ ఎడ్యుకేషన్ గురించి, సెక్స్ గురించి ఉన్న మూఢనమ్మకాల గురించి క్లారిటీ ఇచ్చే ఇన్‌ఫ్లూయెన్సర్‌లు ఎంతో మంది ఉన్నారు. వారిలో ఇప్పుడు ఇంటర్నెట్ ఫేవరెట్‌ డాక్టర్‌గా వినిపిస్తున్న పేరు డాక్టర్ క్యూటెరస్. తన పోస్ట్‌లతో సెక్స్ ఎడ్యుకేషన్ ప్రాముఖ్యతను ఆమె చాటి చెబుతున్నారు.

ఆమె పేరు డాక్టర్ తనయా నరేంద్ర. ఆక్స్‌ఫర్డ్‌లో శిక్షణ పొంది వచ్చిన డాక్టర్. అందరు డాక్టర్‌ల మాదిరిగా కాకుండా సెక్స్, పీరియడ్స్, మెన్‌స్ట్రుయేషన్ లాంటి కాన్సెప్ట్‌లను నేటి తరం వాళ్లకు అర్థమయ్యేలా మీమ్‌లు, జిఫ్‌లు, వీడియోలతో క్లియర్‌గా వివరిస్తుంది. అంతేగాకుండా మర్మాంగాల ఆరోగ్యం గురించి, పాటించాల్సిన డైట్ గురించి, అలాగే సెక్స్ పట్ల ఉన్న అపోహల గురించి ఆమె చక్కగా అర్థమయ్యేలా వివరిస్తారు. కొన్నిసార్లు ఏకంగా ఆపరేషన్ థియేటర్ నుంచి వీడియోలను పోస్ట్ చేస్తారు. ప్లాస్టిక్ మోల్డ్‌లతో మర్మాంగాల పనితీరును తనయా వివరిస్తుంది. ఇంటర్నెట్ ట్రెండ్‌లకు తగ్గట్లు సెక్స్ ఎడ్యుకేషన్ మీమ్స్ తయారు చేస్తుంది. అలాగే తరచుగా తన ఫాలోవర్స్‌తో ఇంటరాక్ట్ అవుతూ వారి అనుమానాలను నివృత్తి చేస్తుంది.

ఎవరూ ఎక్కువగా మాట్లాడటానికి ఇష్టపడని ఎల్‌జీబీటీక్యూ కమ్యూనిటీ గురించి, ఆడవాళ్ల అంతర్గత సమస్యల గురించి ఆమె తన గళాన్ని ఎత్తుతారు. ఇక ఎవరైనా సెక్స్ గురించి తప్పుడు సమాచారాన్ని ఇస్తే మాత్రం తన నాలెడ్జ్ మొత్తాన్ని ఉపయోగించి వారితో మాటల యుద్ధం కూడా చేస్తుంది. అదే సమయంలో తనది ఏదైనా తప్పు ఉంటే నిక్కచ్చిగా ఒప్పుకుంటుంది. అందుకే ఇప్పుడు డాక్టర్ తనయా… ఇంటర్నెట్ ఫేవరెట్ డాక్టర్‌గా మారిపోయింది. ఎక్కువగా ఇలాంటి విషయాలే మాట్లాడుతోందని, తమ కమ్యూనిటీ పాలసీలకు విరుద్ధంగా డాక్టర్ తనయా పోస్ట్‌లు ఉన్నాయంటూ ఇటీవల ఇన్‌స్టాగ్రాం ఆమె ఖాతాను డిజేబుల్ చేసింది. అయితే ఆమె ఎడ్యుకేట్ చేస్తోందని అర్థమయ్యాక మళ్లీ ఆమెకు, ఆమె లాంటి డాక్టర్‌లకు ఈ పాలసీ నిబంధనల నుంచి మినహాయింపు కల్పించింది. ఈ మధ్యనే ఆమె ఫాలోవర్ల సంఖ్యను లక్ష మందిని దాటింది. దీంతో ఇదే జోష్‌తో తాను కొత్త కంటెంట్‌ను తీసుకొస్తానని ఈ మిలెన్నియల్ డాక్టర్ తన ఫాలోవర్లకు హామీ ఇచ్చింది. @dr_cuterus ట్యాగ్‌లో డాక్టర్ తనయను ఫాలో చేయొచ్చు.

Advertisement

Next Story

Most Viewed