లాక్‌డౌన్‌ విధుల్లో మూడు కాళ్ల పోలీస్ ఆఫీసర్

by Sujitha Rachapalli |   ( Updated:2021-05-23 07:10:18.0  )
లాక్‌డౌన్‌ విధుల్లో మూడు కాళ్ల పోలీస్ ఆఫీసర్
X

దిశ, ఫీచర్స్ : పుణె సిటీ, జంగ్లీ మహరాజ్ రోడ్‌లోని బాలగంధర్వ ఆడిటోరియం చెక్ పాయింట్ వద్ద సిటీ పోలీసులకు సాయంచేస్తున్న స్పెషల్ పోలీస్ ఆఫీసర్(ఎస్‌పీఓ) ‘రాజా’ ప్రస్తుతం అందరి దృష్టిని ఆకర్షిస్తున్నాడు. రాజా అంటే మనిషని పొరబడేరు. కానే కాదు.. ఓ వీధి కుక్క. ఈ మూడు కాళ్ల శునకం చెక్‌పాయింట్ వద్ద పోలీసులకు తోడుగా విధులు నిర్వర్తిస్తున్న ఫొటోను శనివారం ట్విట్టర్‌లో షేర్ చేసిన పుణె కమిషనర్ దానిపై ప్రశంసలు కురిపించారు. ‘మా స్పెషల్ పోలీస్ ఆఫీసర్ : రాజాకు సెల్యూట్. ఈ మూడు కాళ్ల శునకం – బాలగంధర్వ నాకబండి వద్ద లాక్‌డౌన్ అంతటా మా ఆఫీసర్లకు తోడుగా ఉంటున్న చురుకైన సహచరుడు, నిజమైన స్నేహితుడు’ అని కొనియాడారు.

ఈ ట్వీట్‌కు స్పందిస్తున్న నెటిజన్లు రాజా పట్ల ప్రేమను చూపిస్తూ మెసేజ్‌లు పంపిస్తున్నారు. అంతేకాదు దాని ఆరోగ్యం గురించి వాకబు చేస్తూ, ఫుడ్ ఆఫర్ చేస్తున్నారు. కాగా, ఈ మెసేజ్‌లపై స్పందించిన పుణె సీపీ.. ‘రాజా పట్ల ఇంత ప్రేమ, కేర్ చూపించడం ఆనందంగా ఉంది. రాజా ఆరోగ్యంపై ఆందోళన అవసరం లేదు. అది సరిగా ఆహారం తీసుకుంటుందో లేదో చూసేందుకు మా టీమ్ మొత్తం వెళ్ళింది. ప్రస్తుతానికి మీరు ‘ఇంట్లో సురక్షితంగా ఉండాలని’ కోరుకుంటున్నాం. మేము రాజాను బాగానే చూసుకుంటున్నాం, మీరు నిశ్చింతగా ఉండండి’ అంటూ మరో ట్వీట్ చేసి, అందుకు సంబంధించిన ఫొటోను యాడ్ చేశారు.

ఇక చెక్‌పోస్ట్ వద్ద డ్యూటీలో ఉన్న మరొక పోలీస్‌మ్యాన్ రాజా గురించి పలు విషయాలు పంచుకున్నారు. చాలా రోజుల నుంచి ఆ శునకం తమతో పాటే ఉంటుందని చెప్పిన ఆఫీసర్.. తమ టీమ్‌లో ఒక మెంబర్‌గా మారిపోయిందని తెలిపాడు. గతంలో జరిగిన ప్రమాదంలో రాజా ఒక కాలు కోల్పోగా, డ్యూటీలో ఉన్న వారందరం ఫుడ్ షేర్ చేస్తామని చెప్పాడు. కొన్నిసార్లు డాగ్ లవర్స్ కూడా దానికి ఫుడ్ అందిస్తుంటారని, ఎక్కువ గంటలు డ్యూటీ చేస్తున్న సమయంలో రాజా తమకు తోడుగా ఉంటుందని వెల్లడించాడు.

Advertisement

Next Story